సర్జికల్ దాడులకు ఏడేళ్లు !

Sharing is Caring...

Surgical strikes………………..

పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఏడేళ్లు అవుతోంది. సెప్టెంబర్ 28, 2016 న ప్రత్యేకంగా శిక్షణ పొందిన మెరికల్లాంటి 100 మంది సైనికులు పాక్ సరిహద్దుల్లో ఉన్న లాంచ్‌ప్యాడ్‌లపై దాడులు చేసారు.

ఉగ్రవాదుల చొరబాటుకు ఉపయోగించే లాంచ్‌ప్యాడ్‌లను గుర్తించి పూర్తిగా ద్వంసం చేశారు. ఈ దాడుల్లో 45 మంది ఉగ్రవాదులు మరణించారని అప్పట్లో భారత్ సైనిక అధికారులు ప్రకటించారు.ఈ ఆపరేషన్ కోసం ఆర్మీ అధికారులు పక్కా వ్యూహాన్నిను రూపొందించారు.

ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా ఈ దాడులు జరిగాయి. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి సూచనలతో ఈ దాడులు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రత్యేక దళాలు తమ లక్ష్యాలను గుర్తించి … పలు జాగ్రత్తలు తీసుకుని నియంత్రణ రేఖకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెల్, లిపా, ఆత్ముఖం, తట్టపాణి, భీంబర్‌ పాంతాల్లోని  ఆరు లాంచ్‌ప్యాడ్‌లను ఒకేసారి ద్వంసం చేశాయి.

భారత సైన్యం డ్రోన్‌ల ద్వారా ఈ ఆపరేషన్ తాలూకు ఫోటోలను కూడా చిత్రీకరించింది. అయితే పాకిస్థాన్ నాయకత్వం అసలు దాడులే జరగలేదని ప్రకటించింది.అప్పట్లో ఈ దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఈ దాడులను తొలిసారి తామే నిర్వహించామని చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

బీజేపీ వాదనను తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్‌ స్టైక్స్‌ నిర్వహించినట్టు కాంగ్రెస్‌ ప్రజలకు వివరించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత రాజీవ్‌ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్‌ స్టైక్స్‌ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు.

తమ హయాంలో సర్జికల్‌ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్‌ ఎప్పుడూ తీసుకోలేదని బీజేపీని విమర్శించారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, వాజపేయి ఇలాంటి దాడులపై ఎపుడూ  విలేకరుల సమావేశం నిర్వహించి తమదే ఘనత అంటూ చెప్పుకోలేదని ఆయన బీజేపీని తూర్పార బట్టారు. కాగా అప్పట్లో ఈ సర్జికల్  స్ట్రైక్స్  ప్రతీకార దాడులుగా జరిగాయి.

యురి లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేసి అమలు పరిచారు. యురి ఉగ్ర దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. నలుగురు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి కేవలం మూడు నిమిషాల వ్యవధిలో 15 పైగా గ్రైనేడ్ లను విసిరారు.

20 ఏళ్లలో  సైన్యంపై జరిగిన అతి పెద్ద దాడి ఇది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. పుల్వామా దాడి తర్వాత వైమానిక దాడులు జరిపి 300 మంది ఉగ్రవాదులను అంతమొందించారు .అన్నట్టు ఇదే కథాంశంతో ఒక సినిమా కూడా వచ్చింది. దాని గురించి మరోమారు చెప్పుకుందాం.

post updated on 29-9-2023

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!