Goverdhan Gande
అత్యద్భుతమైన విన్యాసాలు.ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు. వీటి మధ్య శృంగార దృశ్యాలు.
అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా తెరకు కట్టి పడేసే దృశ్య మాలికల సమాహారం.
అదే”జేమ్స్ బాండ్ 007 “చిత్రం.ఆ చిత్ర కథా నాయకుడే రవి అస్తమించ(ఏనాడో పతనమైన)ని బ్రిటీష్ సామ్రాజ్య గూఢచారి. ఆ గూఢచారి ఇతర దేశాల్లో చేసే గూఢ చర్యం ఆయాదేశాల్లోని ఆంతరంగిక అంశాల్లో జోక్యం చేసుకునే కుటిల నీతికి, ప్రభుత్వాలను కూలదేసే కుట్రలు,కుతంత్రాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కీలక పాత్రధారి గా అద్భుత నటన ను ప్రదర్శించిన పాత్రధారి తొలి బాండ్ సీన్ కానరీ ప్రస్తుతం మన మధ్య లేరు. భౌతికంగా ఆయన లేకపోయినా సినిమా చరిత్రలో ఆయన చిరంజీవే.
వెండితెర ‘తొలి జేమ్స్ బాండ్’ సీన్ కానరీ యే. 1962లో వచ్చిన ‘డాక్టర్ నో’ చిత్రం ఆయన మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ. ఆ సినిమాలో జేమ్స్ బాండ్ గా నటించిన కానరీ తొలి జేమ్స్ బాండ్ గా గుర్తింపుపొందారు. స్కాట్లాండ్ కు చెందిన అతగాడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాడీ బిల్డింగ్ హాబీ ఆయనను హీరోగా మార్చింది. బాండ్ చిత్రాలతో ఆయన పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఆ తరహా పాత్రల్లో అతగాడిని మించినవారు ఎవరు లేరు.
పేదరికం కారణం తో 14 ఏళ్లకే చదువు మానేసాడు. ముందు పాలవ్యాపారం చేసాడు …తర్వాత లారీ డ్రైవర్ గా పని చేసాడు .. అయితే ఏ పని చేసినా ఎప్పుడూ సిగ్గుపడలేదు. రకరకాల పనులతో పొట్ట పోసుకుంటూ 18 ఏళ్లకే బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాడు. మోడలింగ్ చేసాడు.
మెల్లగా నాటకాల్లో నటిస్తూ టీవీల్లో చిన్న పాత్రలు వేశాడు. 1954 లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ సినిమాలో చిన్న పాత్ర వేసాడు. 1957 లో ‘నో రోడ్ బ్యాక్’ లో మంచి క్యారెక్టర్ దొరికింది. నాలుగేళ్ళ తర్వాత బాండ్ సినిమా అవకాశం అందుకున్నాడు. అంతే. అక్కడనుంచి అంచెలంచెలుగా ఎదిగాడు.
జేమ్స్ బాండ్ సిరీస్ మూలం గా పెద్ద బ్రేక్ లభించింది. అన్ని కమర్షియల్ గా విజయం సాధించాయి. బాండ్ సినిమాలు కాకుండా ‘ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్’ తీసిన మేల్,ది విండ్ అండ్ ది లైన్ తదితర సినిమాల్లో అతని పాత్రలు బాగా క్లిక్ అయ్యాయి. ‘ది అన్టచబుల్స్’ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
అదికాక మరెన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. 2007 తర్వాత ఇక సినిమాల్లో నటించలేదు. ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించి ఆ మాటకే కట్టుబడ్డాడు. 90 సంవత్సరాల వయసులో 2020 అక్టోబర్ 31 న సీన్ కానరీ కన్నుమూశారు..