“సత్య …సరోజ ….శేషు” (కథ )

Sharing is Caring...
సత్య

……..

రాత్రి వేళ …. ఇంట్లో నేనొక్క దాన్నే ఉన్నా.కిటికీ లోనుంచి తెరలు తెరలుగా గాలి వీస్తోంది. ఆ గాలి లోనుంచి ఎవరిదో విషాదగానం వినిపిస్తోంది. నా పరిస్థితికి తగినట్టే ఉంది ఆ పాట కూడా. సాయంకాలం జరిగిన సంఘటనే పదేపదే గుర్తుకొస్తోంది. భయమేస్తుంది. బాధ కలుగుతోంది.తండ్రిలా కాపాడాల్సిన వాడే కాటేయడానికి పూనుకున్నాడంటే అంత కంటే ఘోరం ఏముంటుంది.కాలేజీకి శెలవు కావడం తో ఇంట్లోనే ఉన్నాను .ఉదయాన్నే అమ్మ తమ్ముడు పెళ్ళికని పక్క ఊరు వెళ్లారు.
తలనొప్పిగా ఉంటే  కళ్ళు మూసుకుని పడుకున్నా. నిద్ర పట్టేసింది.అంతలోనే ఎవరో బుగ్గపై ముద్దు పెట్టుకున్నట్టు,గుండెలపై చేయి వేసి తడుము తున్నట్టు అనిపించి గబాలున కళ్ళు తెరిచా.ఎదురుగా వికృతంగా నవ్వుతూ అతను. పిచ్చ కోపమొచ్చి బలంగా ఒక్క తోపు తోసా. అంతే…అతను వెళ్లి బల్లిలా గోడకు కరుచుకున్నాడు. క్షణంలో జరిగి పోయింది ఆ సంఘటన. లేకుంటే ఇంకేమి జరిగేదో?

విసురుగా లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నా. అతగాడు ఏమి మాట్లాడకుండా బయటి కెళ్ళి పోయాడు.తలుపు గడియ పెట్టి వచ్చా.అతగాడు మళ్ళీ వస్తే ఏం చేస్తానో ఏమో ?జరిగిన ఘటన పదేపదే కళ్ళముందు కదులుతోంది.

ఒక్కసారిగా ఎందుకో  ఏడుపు తన్నుకొచ్చింది. కాసేపు ఏడిచాను.నాన్న పోయిన తర్వాత తమకు అండగా తనకు తోడుగా ఉంటాడని భావించి అమ్మఅతగాడిని జీవితంలోకి ఆహ్వానించింది. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. మారు తండ్రిగా కూతురి అచ్చటముచ్చట తీర్చాల్సిన అతను ఇలా మృగం లా మారతాడని ఊహించలేదు.  ఆ సంఘటన మానసికంగా నాకు ఓ పెద్ద షాక్ .

ఇవన్నీ అమ్మకు  ఎలా చెప్పాలి?ఏమని చెప్పాలి ?నీ మొగుడు నా మీద కన్నేశాడని తల్లితో కూతురు ఎలా చెప్పగలదు?దేవుడా..  ఎవరికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. మొదట్లో అతను బాగానే ఉండేవాడు.ఇటీవలే వికారపు చేష్టలు మొదలు అయ్యాయి. అమ్మ ఇంట్లో లేని సమయంలో అతని ప్రవర్తనలో ఏదో తేడాఉంటుంది. ఎందుకైనా మంచిదని దూరంగానే ఉంటున్నాను. స్నానం చేసాక బెడ్ రూం లో కొచ్చి బట్టలు మార్చుకోవడం  అలవాటు.
అదే సమయంలో ఏదో సాకుతో లోపల కి రావడం. తలుపు చాటు నుంచి తొంగి చూడటం. వెకిలి గా నవ్వడం.బెడ్ రూం లోకి పిలవడం … కూర్చో అనడం. ఇవన్నీ అతని పట్ల అసహ్యాన్ని, అనుమానాన్నిపెంచాయి.నాకేసి  కేసి అదోలా చూస్తుంటాడు … ఆ చూపుల్లో ఏదో తేడా. అతను అలా చూస్తుంటే  ఒళ్ళంతా తేళ్ళు ,జెర్రులు పాకిన ఫీలింగ్. తండ్రి లాంటి వాడు కూతురి  గుండెలకేసి  చూస్తే  ఆ ఆడపిల్లకు ఎంత ఇబ్బంది ? అవసరం లేకపోయినా పనికట్టుకుని భుజాలపై చేతులు వేయడం, వీపు నిమరడం,హత్తుకునే ప్రయత్నాలు చేయడం నాకెందుకో నచ్చలేదు.

ఆ స్పర్శలో పిల్లల పట్ల ఉండాల్సిన ప్రేమ కనిపించడం లేదు. అమ్మ మొగుడని అన్నిభరించాను.ఇంత వయసొచ్చి ఇదేం బుద్ధి ? ఇవన్నీ అమ్మ కెలా చెప్పాలి?చెబితే ఏమనుకుంటుందో? అమ్మ కూడా అంత సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అతగాడు ఈ మధ్య రోజూ అమ్మతో  గొడవ పడుతున్నాడు. కారణం ఏంటో అర్ధం కావడం లేదు.  ఇరువురి వైఖరి బట్టి చూస్తుంటే వారి మధ్య అంత సఖ్యత ఉన్నట్టులేదు.


అమ్మ కూడా తప్పు చేసిందేమో అనిపిస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోవాలి. అతగాడితో ఎప్పటికైనా ప్రమాదమే. అమ్మకు చెబితే ఏమంటుందో ?ఇద్దరూ గొడవ పడితే?ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో? ఏది ఏమైనా అమ్మకు చెప్పడమే మంచిదేమో. లేదంటే ఇక ఒకటే మార్గం. అనుకుంటూ యాదృచ్చికంగా కిటికీ వైపు చూసాను. అక్కడ ఎవరో నిలబడినట్టు  నీడ… అది నన్నే చూస్తున్నట్టుగా  అనిపించింది. నా చూపు అటు పడగానే క్షణంలో అది మాయమైంది.
………………………………………………………………………………………….
సరోజ 
……..
సత్య చెప్పిన విషయం వినగానే కాళ్ళ క్రింద భూమి కంపించినట్టు అయింది.ఒక్కసారిగా బీపీ పెరిగింది. శేషు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా?  కూతురు మీద కాముకత చూపుతాడా?ఛీ.. ఛీ .. వీడు మనిషి కాదు పశువు. కొద్ది రోజులుగా సత్య లో ఏదో తేడా కనబడుతోంది.మనిషి ఎందుకో డల్ గా ఉంటోంది. అప్పటికి ఒకసారి రెండు సార్లు అడిగేను “ఏమి లేదు అమ్మా” అంటూ విషయం దాటేసింది.
తను ఎవరినైనా  ప్రేమిస్తుందా ?లేక ఎవరైనా వెంట పడి  వేధిస్తున్నారా ?టీనేజ్లో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి. మొదటినుంచి పిల్లలను ఒక పద్ధతి ప్రకారం పెంచాను. సత్య  పెద్దది ఇంజనీరింగ్లో చేరింది ఈ మధ్యనే.అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. ఆయన  అయిదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకుముందే శేషు  పరిచయం అయ్యాడు భర్త స్నేహితుడిగా.విశాల్ చనిపోయినపుడు శేషు దగ్గరుండి అన్ని చూసాడు.
కొంత కాలం జరిగేక అతనే పెళ్లి విషయం ప్రతిపాదించాడు. ఎంతో ఆలోచించిన తర్వాత ‘ఒకే’అన్నాను.సింపుల్ గా గుళ్ళో దండల పెళ్ళిచేసుకున్నాం. పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పేమో. అతని గురించి ఏమి వాకబు చేయలేదు. తను పెళ్లి జరిగినట్టు రిజిస్టర్ చేయించమని గొడవ. ఎందుకో నాకు అలా చేయాలనిపించలేదు.దాటేసాను. మొదట్లో బాగానే ఉండే వాడు. పిల్లలను చక్కగా చూసుకునే వాడు. కానీ రాను రాను అతన్ని భరించడం కష్టమై పోతోంది. ఏడాది కూడా కాక ముందే అతగాడి ప్రవర్తన పట్ల విసుగొచ్చేసింది.
చిన్న విషయాలకు అబద్దాలు చెప్పేవాడు. మనిషికి బద్ధకం ఎక్కువ. ఆ కారణం గానే  ఉద్యోగం పోయింది.మరో ఉద్యోగం చూసుకోవచ్చు.కానీ ఆ ప్రయత్నమే చేయడం లేదు.నేను చేస్తోన్న ప్రైవేటు జాబు తోనే ఇల్లు గడవడం కష్టంగా ఉంటోంది. అదే విషయం అడిగేను. సమాధానం లేదు.ఆ మధ్య లక్షరూపాయలు కావాలన్నాడు. లేవని చెప్పాను.అప్పటినుంచి మనిషిలో మార్పు మొదలైంది. పైగా తరచుగా తాగి వస్తున్నాడు.రాత్రిళ్ళు నరకం చూపేవాడు.
ఒకరోజు అతనికి సహకరించలేదని చేయి చేసుకున్నాడు. నేను కూడా ఎదురు తిరిగి చెంప పగల గొట్టాను. అ రోజునుంచి దూరంగా దూరంగా ఉంటున్నాడు.ఇన్ని జరుగుతున్నా పిల్లలకు తెలీకుండా జాగ్రత్త పడ్డాను.ఈ గొడవల్లో వాళ్ళు నలిగి పోకూడదని.  ఈ మధ్య అతని మొదటి భార్య గురించి విషయాలు తెలిసాయి.

శేషు మొదటి భార్య “రాజీ” కిరోసిన్ పోసుకోని ఆత్మహత్య చేసుకుందని ఒకరు.,ఇతనే చంపాడని మరొకరు చెప్పారు. కోర్టులో కేసు కూడా నడుస్తోందట. ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచాడు. ఒక రోజు ఆ విషయం ప్రస్తావిస్తే  ‘నువ్వు అడగలేదు..నే చెప్పలేదు’ అన్నాడు.ఎందుకో  అతని వ్యవహార శైలి  నచ్చడం లేదు. అతనితో కలసి ఉండాలని అనిపించడం లేదు. ఇంతలో ఈ సంఘటన. ఇవాళ అటో ఇటో తేల్చి పారేయాలి. ఇంకా తాత్సారం చేస్తే పిల్ల పై ఏ అఘాయిత్యమైనా జరగొచ్చు. ఎలాగైనా ఈ దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిదేమో.
………………………………………………………………………………………….
శేషు
……..
ఏంటో టైం బాగాలేదు.అన్నీ అవమానాలే. జీవితంలో ఇలాంటి అవమానం ఎపుడూ ఎదురు కాలేదు.ఏదో చిన్న తప్పు చేసానని ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుందా సరోజ. అసలు దాంతో ఉండటమే పెద్ద తప్పు. ఎన్నెన్ని మాటలు అన్నది.దాంతో ఒక సుఖమూ లేదు . సరదా లేదు. థూ దీనెమ్మ జీవితం. పాత ఇంటికి వచ్చి కూర్చున్నా.
సాయంత్రం  నుంచి ఒకటే తాగుడు.విస్కీ నరనరాలలోకి ఎక్కిందేమో రక్తం కుత కుత లాడుతోంది.సరోజ మాటలే చెవిలో జోరీగల్లా రోదపెడుతున్నాయి. అది ఒట్టి జడ పదార్ధం.ఉప్పు కారం తినే వాడిని ఎంత కాలం సర్డుకుపోగలను.  అదే మాట సరోజతో  అంటే తిట్టి పోసింది. తిక్క రేగి చేయి చేసుకుంటే …తిరగబడి కొట్టింది. లం …ఎంత పొగరు ?ఆ విశాల్ గాడు ఎలా కాపురం చేసాడో ఏమో. ఈ సరోజ కంటే  “రాజీ” యే నయం. చెప్పు కింద తేలులా పడి ఉండేది.
తన చెల్లెలుతో సంబంధం పెట్టుకున్నానని తెలిసినా నోరు మెదప లేదు. తన టైం బాగా లేక మాడి మసి అయిపొయింది. పాపం పిచ్చిది . సరిగ్గా ఈరోజుకి ఏడాది అవుతోంది.నేను తాగితే మనిషి ని కాను అని తెలిసి ఆ రోజు గొడవకి దిగింది. అంతకు ముందు రోజే పుట్టింటికి వెళ్ళివచ్చింది. వాళ్ళ అన్నే దాన్ని రెచ్చగొట్టి పంపాడు.ఆ రోజు డబ్బు అవసరమై చేతికున్న గాజులు ఇవ్వమని అడిగేను. “చచ్చినా ఇవ్వను”అంది.  ఎపుడూ ఎదురు తిరగని మనిషి ఎదురు తిరిగేసరికి తిక్క లేచింది.
వెంటనే  వెళ్లి కిరోసిన్ డబ్బా తెచ్చి రాజీ పై కుమ్మరించాను. “అయితే చావు” అంటూ అగ్గిపుల్ల గీసి పడేశా కసిగా.  చచ్చి ఊరుకుంది. అదిక్కడే దెయ్యమై తిరుగుతోందని వాళ్ళూ వీళ్ళూ అంటున్నారు.ఇక్కడ అద్దెకి ఉన్నవాళ్ళు కూడా ఆ భయం తోనే ఇల్లు ఖాళీ చేసిపోయారు.మనకైతే కన్పించిన దాఖలాలు లేవు. అయినా నేనే పెద్ద దెయ్యాన్ని.నా జోలికెవరోస్తారు ?ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో సరోజ ఒకరోజు అడిగింది.ఏదో చెప్పి తప్పించుకున్నాను కానీ అప్పటినుంచి సరోజలో మార్పు వచ్చింది. దగ్గరకు రానివ్వడం లేదు.
బయట వాళ్ళతో ఇకిలించుకుంటూ మాట్లాడుతుంది.నన్ను చూడగానే రుసరుస లాడుతుంది.పెళ్లి రిజిష్టర్ చేద్దామంటే వద్దంటుంది. నామీద ఏదో అనుమానం ఉన్నట్టుంది.పొరపాటో గ్రహపాటో  ఉన్న ఉద్యోగం ఊడింది. కొత్తది చూసుకోవాలి కదా. ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? ఏదైనా వ్యాపారం చేస్తాను..లక్ష రూపాయలు ఇవ్వమంటే “పైసా కూడా” ఇవ్వనంది. ఎంత కొవ్వు? ఇక తల్లికి మించింది కూతురు. దాని షోకులు అది … పెద్ద ఖతర్నాక్. వయసుకి మించిన మాటలు చెబుతుంది.
దానికి ఇంత చిన్న వయసులోనే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అట. ఇక పెద్ద అయితే ఎంత మందో ?ఏదో అందంగా ఉందని…తన వంక చూస్తే…. అదొక తప్పా?నామీద ఫిర్యాదు చేస్తుందా తల్లికి. పిల్ల ఏపుగా పెరిగింది.ముద్దోచ్చింది కదా అని ముద్దు పెట్టు కున్నాను.దానికే అంత రెచ్చి పోవాలా? దానికేమైనా నేను కన్నతండ్రినా?అదేదో మహాపరాధం లా నన్ను పట్టుకునినిలదీస్తుందా సరోజ. ఇంటి నుంచి వెళ్లిపో అంటుందా? సైతాన్.దాని  సంగతి అటో ఇటో తేల్చి పారేయాలి.లేపేస్తే ఒక పని అయిపోతుంది.
కనీసం ఇన్సురెన్స్ అయినా వస్తుంది.నాలో ఆవేశం పెరిగి పోతోంది.ఏదో చేయాలన్న కసి పుట్టుకొస్తోంది.పెగ్గు మీద పెగ్గు పోసుకుని గడ గడ తాగేసెను.అప్పటికే ఫుల్ బాటిల్ ఖాళీ చేసేసాను.కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం మత్తులో జోగుతోంది. ప్రతీకారపు తాలుకు ఆలోచనలు ఒక పట్టానా తెగడం లేదు.ఇంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం.
 “ఎవరు “అరిచాను … జవాబు లేదు.తర్వాత మళ్ళీ అదే పనిగా తలుపు కొడుతున్న శబ్దం. “తలుపు తీసే వుంది…. రండి ” మళ్ళీ అరిచి చెప్పేను.మళ్ళీ టక్ టక్ శబ్దం ….. తిక్క లేచి “ఎవడ్రా అది ” అంటూ విసురుగా లేవ బోయాను.సరిగ్గా అదేసమయంలో ఎవరో వెనుకనుంచి తోసినట్టు అనిపించింది.శరీరం అదుపు తప్పి బొక్క బోర్లా పడ్డాను.
తోసింది  దెయ్యం కాదు కదా? అనుకునే లోగానే.ఎవరో నామీద స్పిరిట్ లాంటి ద్రవం ఏదో పోశారు.అగ్గిపుల్ల గీసి పడేసారు. నా శరీరంపై భగ్గుమంటూ   మంటలు లేచాయి. క్షణాల్లో అంతా జరిగిపోయింది. లీలగా తెలుస్తూనే ఉంది. కానీ అరిచే ఓపిక లేదు .కళ్ళుతెరుచుకోవడం లేదు.
అంతే…. ఆపై ఏమి జరిగిందో ?????????????????
………………………………………………………………………………………………… 
“గో తెలుగు . కామ్” లో ప్రచురితం    by  KNMURTHY
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!