మాస్టారుకి ఆత్మాభిమానం ఎక్కువ !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………………

సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం స్లో అయినట్టుందే అని కామెంట్ చేశారట.

అదేం లేదులే అంటూనే రికార్టింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారట దుక్కిపాటి. ఇందాక మనకు కాఫీలిచ్చాడు చూడండి… బాయ్ సారు గారు … ఆయన కూడా అభిప్రాయం చెప్పాక అప్పుడు రికార్డింగు పెట్టుకుందాం అని చాలా వినయంగా రిప్లై ఇచ్చారట రాజేశ్వరరావు. ఈ సమాధానంతో పరిస్థితి అర్ధమైంది దుక్కిపాటికి. అంతే.. సారీ … ఏం పట్టించుకోవద్దండీ … మేం బయటకు వెళ్తున్నాం. మీరు రికార్డింగు ఎప్పుడు అనేది కబురు పెట్టండి చాలు అని అని మిత్రులను తీసుకుని బయటకు నడిచారట దుక్కిపాటి.

రాజేశ్వరరావు సగంలో వదిలేసిన సినిమాల సంఖ్య ఏడు. మాయాబజార్, నమ్మిన బంటు, సీతారామకళ్యాణం, ఆడపెత్తనం, వినాయక విజయం, కృష్ణవేణి, దానవీరశూరకర్ణ. మాయాబజార్ లో లాహిరి లాహిరి, నీవేనా నను తలచినది తో సహా నాలుగు పాటలు రాజేశ్వరరావు స్వరాలు కూర్చినవే.నమ్మినబంటులో చెంగుచెంగున గంతులు వేయండి రాజేశ్వరరావుదే. దాన వీర శూర కర్ణ సినిమాలో ఏ తల్లి నిను కన్నదో పాట రాజేశ్వరరావు కట్టిన ట్యూనులో వినిపించే పాటే .

అలాగే  ‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట ను  రికార్డింగుకు ముందు  ప్రాక్టీసు  చేస్తున్న ‌ సందర్భంలో భానుమతి ఆ పాటను  ఆయన చెప్పిన పద్ధతిలో కాకుండా తన దైన శైలిలోపాడుతున్నారట. రాజేశ్వరరావుకు ఆమె పధ్ధతి నచ్చలేదు. ‘అలలు కొలనులో గలగలమనినా’ చరణాన్ని ఇలా పాడాలి అని రాజేశ్వరరావు మరోసారి బాణీని స్వయంగా పాడి వినిపించారు. భానుమతికి ఉక్రోషం వచ్చింది.

‘నేనూ సంగీతంలో మాస్టర్నే’ అని పెడసరంగా అన్నారట.  దీంతో రాజేశ్వరరావు కు కోపమొచ్చి వెళ్లిపోయారట. ఇది జరినప్పుడు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి అక్కడ లేరు. తరువాత వచ్చి చూస్తే ఆర్కెస్ట్రా వాళ్లు మాత్రమే వున్నారు. రాజేశ్వరరావు కనపడలేదు. తబలా వాయిద్యకారుడు జరిగిన విషయాన్ని బి.ఎన్‌.కు వివరించి చెప్పాడు. బి.ఎన్‌. రెడ్డి వెంటనే రాజేశ్వరరావు ఇంటికి వెళ్ళారు.

‘ఈ సినిమా చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. భానుమతికి ఉందేమో కనుక్కోండి’ అంటూ రాజేశ్వరరావు తనదైన శైలిలో చెప్పారు. ఆ తర్వాత బి.ఎన్‌. భానుమతిని మందలించారు. పాట రికార్డు చేశారు. రికార్డింగ్‌ అయ్యాక అందరూ ఆ పాట వింటున్నారు. ‘అలను కొలనులో’ చరణం ముగిశాక భానుమతి లేచి వచ్చి రాజేశ్వరరావుకు ప్రణామం చేసింది. ‘ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది మీరు నన్ను ఎందుకు హెచ్చరించారో?’ అన్నదట. 

 అలాగే  ‘మాయాబజార్‌’ (1957) సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా నియమించింది రాజేశ్వరరావునే. అందులో ‘చూపులు కలసిన శుభవేళా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది’, ‘నీ కోసమే నే జీవించునదీ’ పాటలకు స్వరాలు  కూర్చింది రాజేశ్వరరావే. అయితే మ్యూజిక్‌ సిట్టింగులలో చక్రపాణి ప్రమేయం ఎక్కువగా ఉండటంతో ఆయన సైలెంట్ గా తప్పుకున్నారట.

కొన్ని కొన్ని విషయాలను రాజేశ్వరరావు జీర్ణించుకోలేకపోయారు. ఆయన  విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరామపురం గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించారు. 200 సినిమాలకు పైగా సంగీతం సమకూర్చారు.  ఆయన హిట్ సాంగ్స్ లిస్ట్ చాలా పెద్దదే.  సాలూరి వారి కుటుంబం లో సంగీత కళాకారులు చాలామందే ఉన్నారు.  రాజేశ్వరరావు అన్న సాలూరు హనుమంతరావు కూడా తెలుగు,

కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పనిచేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ధ పియానో, ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ధ గిటారిస్టు. ఈయన మూడవ, నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు (కోటి) ప్రముఖ సంగీత దర్శకులు టీ.వీ.రాజు కోడుకైన సోమరాజుతో కలసి “రాజ్-కోటి ” పేరుతో ఎన్నోసూపర్ హిట్  సినిమాలకు సంగీతం అందించాడు. తరువాతి కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.

 

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>>>>>>>>> ” గుండమ్మకథ ” వెనుక ముచ్చట్లు !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!