పంచ్ విసిరారంటే .. ఫటాఫట్

Sharing is Caring...

V. Ramakrishna………………………………………. 

A different politician ……………………………………….

సౌమ్యానికి, సౌహృదయానికి, సహనానికి, పేరెన్నికగన్న రాజకీయ కురువృద్ధుడు రోశయ్య. ఆయనలో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అపారం. చమత్కారాలు, ఛలోక్తులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ప్రదర్శించే వాగ్ధాటి ఇంతా అంతా కాదు.

అయితే ఆయన ఆవేశమంతా ఆక్షణం వరకే! మరునిమిషంలో అదే ప్రశాంత వదనం. అదే చిరు మంద హాసం. అదే చమత్కారం. అదే బోళాతనం. కల్మషమెరుగని మనసు, కలుషిత మవని వ్యక్తిత్వం ఆయన సొమ్ము. పెద్దమనిషిగా అన్ని వర్గాల, అన్ని పార్టీల మనసు గెలుచుకున్న అజాతశత్రువు రోశయ్య.

ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా పార్టీమారని విధేయుడు, అధికారం ఉన్నా లేకున్నా గాంధీభవనం వదలని విశ్వాసపాత్రుడు, వినయశీలుడు, పరమగాంధేయవాది రోశయ్య. దాదాపు అన్ని ప్రధాన శాఖలకు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది.

అనుభవం పెరుగుతున్నా, తలపండిన నేతగా వాసికెక్కినప్పటికీ  ఒదిగి ఉన్న వ్యక్తిత్వం, సుకుమార మనస్తత్వం ఆయనది. ఆంధ్ర ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.

ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఆయన  విపక్ష నేతపై విసిరే పంచ్ లు అందరిని అలరించేవి. టీడీపీ నేతలు ఆయనను కదిలించి విమర్శల పాలయ్యే వారు. చంద్రబాబు నైతే  ఇక చెప్పనక్కర్లేదు. 2004 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక రోజు అసెంబ్లీ లో చంద్రబాబు మాట్లాడే అవకాశం కావాలన్నారు . అంతకు ముందే ఆయన మాట్లాడారు. స్పీకర్ మైక్ ఇవ్వలేదు. బాబు లేచి “ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు ప్రతిపక్ష నేత అడిగితే మైకు ఇవ్వక పోవడం చరిత్ర లోనే లేదు” అంటూ విమర్శలకు దిగారు.

అపుడు రోశయ్య లేచి “ఏమన్నావు బాబు… ప్రతిపక్ష నేత అడగగానే మైకు ఇవ్వక పొతే ప్రజాస్వామ్యానికి చీకటి రోజా ? నాడు ఎన్టీఆర్ తనను ఎందుకు దించేస్తున్నారు ? మాట్లాడే అవకాశం ఇవ్వండని మొత్తుకున్నా మాట్లాడే అవకాశం ఇవ్వని తమరా ? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది “అన్నారు. అంతే సభ చప్పట్లతో మారు మోగిపోయింది. చంద్రబాబు మారు మాట్లాడకుండా కూర్చున్నారు.

ఇంకోసారి ” రోశయ్యకు తెలివి తేటలు ఎక్కువ” అని బాబు వ్యంగ్యంగా మాట్లాడారు. రోశయ్య చప్పున లేచి “నిజంగా నాకే గనుక అన్ని తెలివి తేటలు ఉంటే రాజశేఖర్ రెడ్డి ని కత్తి తో ఓ పోటు పొడిచి సీఎం అయ్యే వాడిని.. చెన్నారెడ్డిని ఓ పోటు పొడిచి సీఎం అయ్యే వాడిని” అని  జవాబు ఇచ్చారు. అంతే … బాబు ఆమాటతో ఇక సైలెంట్ అయిపోయారు.

మరోసారి రోశయ్య అల్లుడు వైజాగ్ లో ఓ క్లబ్ లో పోలీసులకు దొరికిపోయారు..ఈ అంశంపై అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట సేపు గోల చేశారు. ఆ సందర్భంగా  రోశయ్య మాట్లాడుతూ  ‘ అధ్యక్షా, ఏం చేస్తాం… ఆ భగవంతుడు ఎన్టీ రామారావుకు నాకు మంచి అల్లుళ్ల ను ఇవ్వలేదు.. ఆయనకు వెన్నుపోటు అల్లుడిని  .. నాకు మరో రకం అల్లుడిని ఇచ్చారు ” అన్నారు. అంతే సభలో నవ్వులు విరిశాయి..  ఆ మాటతో  తెలుగు దేశం సభ్యులు ఇక గొడవ ఆపేశారు.

ఇలా ఎన్నో సందర్భాలలో రోశయ్య తన పంచ్ డైలాగులతో విపక్షాలను ఆడుకున్నారు.. ఎన్నో మార్లు సభలో వైఎస్ కి అండగా నిలిచారు.అందుకే ఆయనతో మాట్లాడేందుకు సభలో ఎవరూ సాహసించరు. ఒకసారి రోశయ్య కుమారుడి భార్య నంటూ ఒక మహిళ అసెంబ్లీ కొచ్చి మీడియాతో మాట్లాడింది. రోశయ్యను ఇరుకున పెట్టాలని ఆమెను  తెలుగుదేశం నేతలే అసెంబ్లీ కి తీసుకొచ్చారు. అయితే “నాకు తెలీదు .. సంబంధం లేద”ని రోశయ్య చెప్పారు. ఆ సందర్భంలో రోశయ్య కొంత ఇబ్బంది పడ్డారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!