రూమ్ నం . 7      ( చిన్న కథ )

Sharing is Caring...

అప్పారావుకి సగం రాత్రి వేళ సడన్ గా మెలకువొచ్చింది. పక్కన నిద్రపోతున్న కనకం కర్ణ కఠోరంగా గురక పెడుతోంది.  కనకం గురక పెట్టదే … ఇవాళ ఏమిటో చిత్రంగా ఉంది. లేచి మంచినీళ్లు తాగి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నాడు.
అటు ఇటు దొర్లుతున్నాడే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు.సెల్లో టైమ్ చూసాడు.. రెండు దాటింది.
చీ దీనెమ్మ ..అందుకే గెస్ట్ హోజ్ ల్లో దిగకూడదంటారు.

వీటికి వాస్తు పాడు ఏమి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ కడతారు. అంతలోనే దూరంగా ఎక్కడి నుంచో పాట వినిపించింది.అది సినిమాల్లో దెయ్యాలు పాడే పాట. అప్పారావుకి ఒక్కసారిగా వెన్నులో నుంచి చలి పుట్టుకొచ్చింది. 
కొంప దీసి ఇక్కడ దెయ్యాలు లేవు కదా అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అనుకుంటూ లేచి లోపలికి  వెళ్లి పడుకుందామనుకున్నాడు .

వచ్చి చూస్తే బెడ్ రూమ్ తలుపులు వేసి ఉన్నాయి.హాల్లోకి వచ్చేటపుడు తాను తలుపులు వేయలేదు.ఇపుడు ఎవరు వేశారబ్బా ? ఇక్కడ ఏదో జరుగుతోంది. పక్కనే ఉన్న కిటికీ తలుపు తిన్నగా నెట్టి లోపలికి చూసాడు .అక్కడ దృశ్యం చూడగానే ఒక్క క్షణం గుండె ఆగింది. బెడ్ పై ఓ పక్క ఓ లావుపాటి ఆడమనిషి … మరో పక్క మరో లావు పాటి మగ మనిషి కనిపించారు. 
ఇద్దరూ కర్ణ కఠోరంగా గురక పెడుతున్నారు . డబ్బాలో గులకరాళ్లు వేసి కదిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గురక శబ్దం.  వీళ్లెవరు ? ఇందాక లేరుగా ! ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారు ? అన్నట్టు కనకం ఏమైంది ?”
బుర్ర పరి విధాల ఆలోచిస్తోంది. 
అప్పటికే రావుకి వళ్లంతా చెమటలు పట్టేసింది.భయంతో కాళ్ళు వణుకుతున్నాయి.
“నో డౌట్ ….అవి … దెయ్యాలే !”
“ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. బయట పడటం మంచిది” అనుకున్నాడు మనసులో.అంతలోనే కరెంట్ పోయింది. చీకట్లోనే చిన్నగా నడుచుకుంటూ వెళ్లి తలుపు తీయబోయాడు. అది ఓపెన్ కాలేదు. బయట ఎవరో గడి పెట్టినట్టున్నారు.తలుపులపై దబ దబా బాదాడు.

అంతలో కరెంట్ వచ్చింది. తలుపులు కూడా తెరుచుకున్నాయి. వాచ్ మేన్ లోపలికొచ్చి “ఏంటి సార్” అని అడిగేడు. జరిగిందంతా చెప్పాడు.

“రాత్రి మీరు 6 నెంబర్ గదిలో దిగారు. మీరు పడుకున్నాక వేరే వాళ్ళు వచ్చి 7 నెంబర్ గదిలో దిగారు. మీరు కంగారులో ఆ గదిలోకి చూసి భయపడ్డారు ” చెప్పాడు నింపాదిగా.

“నిజమా ?” అంటూ 6 నంబర్ గదిలోకి వెళ్లి చూసాడు. కనకం ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. బయట కొచ్చి “ఒకే ఒకే … నిద్ర మత్తులో ఏదో పొరపాటు జరిగింది” అన్నాడు.” సరే … లోపల గడి పెట్టుకోండి ” అంటూ వెళ్ళిపోయాడు వాచ్ మేన్.అయినా అనుమానం తీరక పక్క గది కిటికీ లోనుంచి లోపలికి చూసాడు.లావుపాటి దంపతులు గాఢనిద్ర లో ఉన్నారు. అమ్మయ్య అనుకుని తన గదిలో దూరి తలుపులు బిగించుకున్నాడు.

>>>>>>>>>>>>>>>>

పొద్దున్నే వాచ్ మేన్ భార్య తలుపులు కొడితే వెళ్లి తీసాడు. అప్పటికే 7 గంటలు దాటింది.చకచకా ఫ్రెష్ అప్ అయి లగేజ్ సర్దుకొని కనకంతో సహా బయటికి వచ్చారు.వస్తూ … యాదృచ్చికంగా రాత్రి చూసిన ఆ లావుపాటి దంపతులున్న గది వైపు చూసాడు.అక్కడ గది లేదు … తలుపులు లేవు … కిటికీ అసలే లేదు.

ఒట్టి గోడ మాత్రమే కనిపించింది. అంటే ???

>>>>>>>>>>>>>>>>>

( ఇది కేవలం కల్పిత కథ మాత్రమే )

 

Read also    వసంత 

—— KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!