Priyadarshini Krishna ………………………………………….
Religion is a psychological necessity- Ayan Rand
మతం అనేది మానసిక అవసరం …. సాధారణమైన జీవనంలో మనిషి చెయ్యలేని కొన్ని అంశాలు, సాధించలేని కొన్ని విషయాలు మతం వల్ల ఆచార వ్యవహారాల వల్ల సాధించగలుగుతాడు.కొన్ని చిక్కుముడులకు సమాధానాలు మతాచారాలతో తీర్చుకుంటాడు. ఆటవిక జాతి అయినా నాగరీకులైనా…!
తనకు కావలసిన సమాధానాన్ని మతంలో వెతుక్కుని స్వాంతన పొందుతాడు. రిలీజ్ రోజునుండి సంచలనం రేపుతున్న కన్నడ సినిమా కాంతారా గురించి ఇప్పటికే ఎంతో మంది రాయగా మనం చదివాము. మీ అందరికీ తెలిసినట్లే కేవలం కథ గురించే కాకుండా మిగతా అన్ని విషయాల గురించి నేను నా వ్యాసాల్లో చర్చిస్తా అని.
‘కాంతారా- అడవిగాధ’ ఇప్పటికే హిందీ తెలుగు తమిళంలో డబ్ అయి రిలీజై కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది.
కథ నేపథ్యం :
కర్నాటక, కొంకణ్ లోని కొంత భాగం,ఉత్తర కేరళ, పడమటి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవత పూజా విధానాలలో ‘కోల’ అనేది ఒక నర్తన విధానం. దీనినే కోలకట్టడం అని కూడా అంటారు. కేరళకు చెందిన ‘తెయ్యుం’ నాట్యరీతి ప్రభావం ఈ ‘కోల’ మీద చాలా ఎక్కువే ఉంటుంది. మగ వారు మాత్రమే ఆచరించే ఈ పద్ధతిలో ఆహార్య (గెటప్) చాలా వైవిధ్యంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
కేరళ నృత్యరీతులైన తెయ్యుం, కుడియాట్టంలోని కొన్ని మెరుగైన అంశాలను తనలో ఇముడ్చుకుని పరిణామం చెందినట్లనిపిస్తుంది. ముఖ్యంగా ముఖాభినయం,హస్తాభినయాలకు చాలా సారూప్యత ఉంటుంది. కోలం ప్రదర్శనలో వాడే వాద్యాలు కూడా తెయ్యుం కుడియాట్టంలో వాడిన ‘చెండ’ ( డోలు లాంటి చర్మవాద్యం) లాంటిదానినే వాడుతున్నదాఖలాలున్నాయి.
అయితే ఈ ‘కోల’ అనేది ఇతర నృత్యరీతుకు కాస్తభిన్నమైనదిగా ఉంటుంది. అనువంశికంగా ఒక కుటుంబంలోని తొలిసంతానమే ఈ కోలంకట్టే అర్హత కలిగివుంటారు . కానీ, నృత్యం కేవలం మనోరంజనకు మాత్రమే పరిమితమైనదికాదు. ఇది తమ గ్రామదేవత వార్షిక పూజల్లో జరిగే ఒక తంతు.
మన (తెలంగాణ)కు సంబంధించిన భోనాలప్పటి ‘రంగం’ ఎక్కడం లాంటిదే… అంటే పూజలు నృత్యాలు క్లైమాక్స్ దశకి చేరుకునేటప్పటికి పంజుర్లీ దేవర కోసం ‘కోల కట్టిన’ గుళిక మీదకి దేవర పూనడం ఆ సంవత్సరానికి రాబోయే మంచి చెడులను ప్రఫిసీ చెప్పడం, అదే దైవవాక్కుగా గ్రామస్థులు భావించి తు చ తప్పక పాటించడం పరిపాటి.
అలాంటి ఒకానొక జానపదుల జీవన గాధే ఈ ‘కాంతారా’. కాంతారా కథని నేను చర్చించబోవట్లేదు. ఇప్పటికే చాలామంది చూసేవుంటారు. సింగిల్ లైన్లో చెప్పాలంటే బ్రతుకుతెరువుకోసం తమ భూమికై పోరాడే జానపదుల సంఘర్షణ. ఇందులో మన జనరల్ కమర్షియల్ కథల్లోలాగానే హీరో-విలన్ : చెడుపై మంచి గెలుపు వుంది – అదే యూనివర్సల్ ఫార్ములా !
అయితే…ఈ కోలంకట్టే పంజుర్లీ దేవర గుళిక తన భక్తజనాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే కథనం. ఈ కథనానికి పూర్తిగా దైవకోలం నృత్యరీతిని సమంజసంగా, ప్రతిభావంతంగా వాడుకున్నారు. అదే ఈ కాంతారా సక్సెస్ ఫార్ములా !
కథ కథనం స్క్రీన్ ప్లే డైలాగ్స్…..
ముఖ్య భూమిక హీరోగా వేసిన రిషబ్ శెట్టినే ఈ కథని సమకూర్చుకుని స్క్రీన్ ప్లే కూడా రాశాడు. సినిమా మొత్తం చూసినప్పుడు ఈయనకి నృత్యరూపక రీతులైన ‘యక్షగానం’ ‘తెయ్యుం, కుడియాట్టం, కోల’ మీద మంచి అవగాహన వుందని పూర్తి అధ్యయనం తరువాతే సినిమా తియ్యడానికి ఉపక్రమించాడని అర్థమవుతుంది.
సినిమాని యక్షగాన రీతిలో- అంటే సూత్రధారుడు ఉపోధ్ఘాతాన్ని కథని పాత్రలని ప్రేక్షకునికి పరిచయం చేసే పద్ధతిలోనే మొదలెట్టాడు. సూత్రధారుడు వాయిస్ ఓవర్‌తో మనల్ని కథలోకి తద్వారా ఉడుపి, పడమటి కనుమల్లోకి తీసుకెళ్ళి కేరడిలో వదులుతాడు.
పంజుర్లీ దేవర గుళిక కోసం కోలంకట్టే తెగలో పుట్టిన తొలిచూలుమగబిడ్డైన హీరో శివ తన తండ్రి అదే కోలం కట్టి పంజుర్లీలో ఐక్యమయిపోవడాన్ని చిన్ననాటే చూసి షాక్ గురైన విషయం మనకు పదే పదే చెపుతాడు, విజువల్ గా !
తరువాతి తరంలో ఈ కోలాన్ని తానే కట్టల్సివస్తుందని తప్పించుకుని జులాయిగా తిరగడం తనకు కోలం పట్ల ఉన్న విముఖతని మొదటినుండి మన మైండ్‌లో నేరుగా ఇంజెక్ట్ చేస్తాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా తానైతే ఆ గుళిక- కోలం జోలికి పోయేదే లేదనే మొండితనాన్ని నమ్మబలికి చివరకు తనవారిని కాపాడుకునేందుకు కోలంకట్టి తనుకూడా పంజుర్లీలో అంత్ధానమయి తనో హీరో అని చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ కథ నడిపిన తీరుకి హేట్సాఫ్ !
సీరియస్ గా నడిచే ప్రతి సన్నివేశపు ముగింపు చిన్న కామెడీ డైలాగుతో లేదా కామెడి వ్యవహారంతో ముగించి మనల్ని తరువాతి గంభీరమైన ఇంకో సీను కోసం సన్నద్దం చేస్తాడు. ఇదే స్క్రీన్‌ప్లే పై పట్టు డైలాగ్స్ పై పట్టును చెబుతోంది ! తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ రాసిన గణేష్ ది కూడా మెచ్చుకోదగిన పెన్నే.
సినిమాటోగ్రఫీ ……..
ఇక అరవింద్ కష్యప్ ఈ సినిమాకి డిఓపీగా వ్యవహరించారు. సినిమాకి ఎంచుకున్న టోన్ ఆహ్లాదంగా అదే సమయంలో సీరియస్ సీన్లలో గుబులు కలిగించేదిగా వుంది. వానలో తడిసి ముద్దైన పడమటి కనుమల హొయలను చక్కగా చూపించారు. రాత్రి చిక్కటి చీకటిని , వానవెలిసిన ఉదయాన్ని, అడవిలోని గుడ్డి వెలుతురును అధ్బుతంగా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు.
పంజుర్లీ ముందు కోలకట్టిన సన్నివేశాల్లోని వెలుతురు చాలా సహజంగా వుంది. సినిమా ఆరంభంలో వచ్చే ఎద్దుల పోరు కూడా చాలా సహజం గా కాప్చర్ చేసారు.. డే లైట్స్ రిఫ్లెక్టర్స్ వాడినా మొత్తం సహజమైన వెలుతురులోనే తీసిన అనుభూతినిచ్చారు.
ఎక్కడ VFX అవసరమో అక్కడే అంతే మోతాదులో వాడారు. మిగతా అంతా ఉన్నంతలో సహజంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ‘దేవర గుళిక’ కనపడే సీన్లు, పంజుర్లీ – ఆదివాసీల వారాహిదేవత కనపడే సీన్లను చాలా బాగా కంపోస్ చేసారు. ప్రేక్షకుల్లో కుతూహలం ఎక్కడా తగ్గకుండా నడిపించారు.
ఆర్ట్ డైరెక్షన్………………………
పడమటి కనుమల్లో చిక్కటి అటవీప్రాంతం. అందులో ఎక్కడో విసిరేసినట్లుండే ఒక తండాని రియలిస్టిక్‌గా రీక్రియేట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ పనితనం మెచ్చుకోదగింది. క్రెడిట్స్ మిస్సయ్యా. కోలం సమయంలో వాడే అన్ని ప్రాప్స్ ఆకట్టకునేలా వున్నాయి.
మ్యూజి క్….
సినిమాకి నేపథ్య సంగీతం ఆయువుపట్టు. ఎంచుకున్న ఏ కథనైనా దాని భావాన్ని సీన్లలోని మూడ్‌ను ఎలివేట్ చేసేదే బాగ్రౌండ్ స్కోర్. జానపద నృత్యరీతినే ముఖ్యమైన కాంపొనెంట్‌గా ఉన్న ఈ సినిమలో అంతే ముఖ్యాకర్షణ ఈ BGM. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న అంజనీష్ లోక్నాధ్ అద్భుతమైన స్కోర్ ఇచ్చారు.
జానపద నృత్యమైన కోలం వచ్చే సందర్భంలో, ఉపోద్ఘాతంలో వచ్చే రాజు కథలో మామూలుగా ఐతే జానపదరీతిలో జానపద ట్యూన్స్ వాడేవారు. కానీ దర్శకుని క్రియేటివిటీ ఇక్కడే తెలుస్తుంది. పైన చెప్పుకున్న సీన్లలో అందుకు భిన్నంగా కర్ణటిక్ శాస్త్రీయ సంగీతం ఫ్యూషన్ జోడించి ఇచ్చారు.
అందువల్లే వాటి ఎలివేషన్ మరింత పెరిగింది, వైవిధ్యంగా వుంది. ఫైట్ సన్నివేశాల్లో డ్యూయెట్లలో కూడా సందర్భోచితమైన నేపథ్యాన్ని అందించడం వల్ల ప్రేక్షకులు కనెక్టయ్యారు. క్లైమాక్స్‌లో వచ్చే ‘దేవరకోలం’ కోసమే దాని రిజర్వ్ గా పెట్టుకున్నారనిపించింది. చివరిగా వచ్చే ఈ సీనే మొత్తం సినిమాకి గుండె.
దీనికి ఇచ్చిన BGM అచ్చమైన కోలంలో వాడేదే, దానికి కొంత ఫ్యూషన్ మేళవించడంతో రోమాంచితమైంది. ఒక్క క్షణం కూడా కళ్ళు పక్కకు తిప్పకుండా చెవులు కిక్కించి వినేలా చేసారు టీం మొత్తం. ఇది చూసి తీరాల్సిందే….! హేట్సాఫ్ టీం !!
నటులు నటన ……..
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు మూడు. శివ- హీరోపాత్ర- రిషబ్‌శెట్టి, మురళి- ఫారెస్టాఫీసర్ – కిషోర్, దేవేంద్ర- ఊరిపెద్ద- అచ్యుత. మొత్తం సినిమాలో ఎన్నో పాత్రలు సందర్బోచితంగా వస్తాయి పోతాయి . కానీ సినిమా నుండి ఇంటికి బైలుదేరే టైంకి బుర్రంతా వ్యాపించేది మాత్రం శివ!
కిషోర్ అచ్యుతు తమదైన శైలిలో ఆయా పాత్రలను సునాయాసంగా చెయ్యడమేకాకుండా వారి మార్కుని వదిలారు. కానీ, రిషబ్ శెట్టి మాత్రం అందరిని నమిలి మింగేసాడు. మొదటి పది నిముషాలు దర్శకుడు ఆవరిస్తే ఆఖరి పదినిమిషాలు నటుడు ఆక్రమించాడు….!
ఒక దర్శకునిగా, ఒక నటునిగా, ఒక కేరడీ ప్రాంతవాసిగా రిషబ్ ఈ సినిమాను ‘కోలం’కు ఇచ్చిన కానుక !
రాబోయే కాలంలో అవార్డులకు వందశాతం అర్హత కలిగిన సినిమా …!
మై స్పెషల్ నోట్ : మనకి (తెలుగువారికి) కూడా జానపద నృత్య రూపకాలు వీరగాధలున్నాయి. బుర్రకథ ఒగ్గుకథ బైండ్లకథ పిచ్చకుంట్ల కథ వగైరాలు… మనం కూడా చిందు భాగవత యక్షగాన నాట్యవిధానంలో హీరోయిజాన్ని మేళవించి సినిమా తీస్తే ఒక సెక్షన్ ఆఫ్ సోషల్‌మీడియా రియాక్షన్ ఏంటా అని కుతూహలంగా వుంది….!