చంద్రుడిపై పోటాపోటీగా పరిశోధనలు !!

Sharing is Caring...

Ravi Vanarasi………..

చంద్రుడిపై పరిశోధనలు పోటాపోటీగా జరగనున్నాయి.ఒక పక్క చంద్రుడిపై చైనా,రష్యా అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆర్టెమిస్ (Artemis) ప్రాజెక్టు చేపట్టింది.

చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్‌ ప్రాజెక్టు.. ఇందులో భాగం గా  ఆర్టెమిస్‌ మిషన్ 1 ను ఇప్పటికే ప్రయోగించింది.  ఆర్టెమిస్ మిషన్ 2 లాంచింగ్ కి నాసా సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 2026  లోపు అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్థావరాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఈ రెండు కార్యక్రమాలు (ILRS ..  Artemis) ఒకే ప్రాంతంపై దృష్టి సారించడంతో, భవిష్యత్తులో చంద్రుని పై కార్యకలాపాల జోరు పెరగవచ్చు. వనరుల వినియోగంపై అంతర్జాతీయ చర్చలు, సమన్వయం అవసరం అవుతుంది. మరిన్ని దేశాలు ముందుకు రావచ్చు.   

1960లలో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా ‘అపోలో’ ప్రాజెక్టును చేపట్టింది. అయితే  అప్పట్లో  సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్ పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అమెరికా వీటిని నిర్వహించింది.జాబిలి పైకి 1969లో మొదలైన మానవ సహిత యాత్రలు 1972లో ముగిశాయి.

ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై గడపలేదు.అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి శాస్త్రవేత్తలకు పెరిగింది.చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు అవకాశాల అన్వేషణకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా వచ్చే పదేళ్లలో చంద్రుడిపై పై దీర్ఘకాల ఆవాసాలను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. ఈ క్రమంలోనే పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి.  ఇక అంతరిక్షంలో అణు శక్తి వినియోగం ఇప్పటికే ఉన్న అంతరిక్ష ఒప్పందాలు, ముఖ్యంగా బాహ్య అంతరిక్ష ఒప్పందం (Outer Space Treaty) పరిధిలోకి వస్తుంది.

ఈ ఒప్పందం బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలని.. ఏ దేశం కూడా చంద్రుడిపై లేదా ఇతర గ్రహాలపై సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేయరాదని చెబుతోంది.

అణు విద్యుత్ కేంద్రాల భద్రత, అంతరిక్ష పర్యావరణంపై వాటి ప్రభావం, ప్రమాదాలు సంభవించినప్పుడు బాధ్యత వంటి అంశాలపై అంతర్జాతీయంగా స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. చైనా, రష్యా ప్రణాళికలు ఈ చర్చలను మరింత వేగవంతం చేయవచ్చు.

కొంతమంది విశ్లేషకులు రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో, రష్యా తన అంతరిక్ష కార్యక్రమాలకు చైనాపై మరింత ఆధారపడుతుందని భావిస్తున్నారు. ఈ అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సహకారంలో భాగంగా చూడబడుతోంది.

ఏదేమైనా, చంద్రుడిపై నిరంతర శక్తి వనరును సృష్టించాలనే ఈ ప్రణాళిక, చంద్రుడిని కేవలం తాత్కాలిక సందర్శన ప్రదేశం నుండి దీర్ఘకాలిక పరిశోధనా కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!