పశ్చాత్తాపమూ లేదా ప్రాయశ్చితమూ..అను ఒక పురాతన అజ్ఞాన విశేషము !

Sharing is Caring...

Taadi Prakash ………………………………………………. 

1976. అది ఎమర్జన్సీ కాలం.  విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నా.మారుతీ నగర్ లో మా ఇల్లు.శ్రీశ్రీనీ, తిలక్ నీ, చెలాన్నీ చదవడం. ఫిలిం సొసైటీ సినిమాలు చూడటడం..

సీపీఐ వారి స్టూడెంట్ వింగ్ ఏఐఎస్ఎఫ్ లో తిరగడం,విశాలాంధ్రకీ, ఊరేగింపులకీ, ధర్నాలకీ వెళ్లడంరేపోమాపో రాబోయే విప్లవం కోసం ఎదురుచూడ్డం. హాపీ గో లక్కీ లైఫ్. 1976 అక్టోబర్ 18 ఉదయం తొమ్మిది గంటలకు మా వీధిలో హడావుడిగా వుంది. వచ్చే పోయే జనం.. కార్లూ పోలీసులూ.. రద్దీ…  ఏమైందీ రోజు?

అని కనుక్కుంటే, విశ్వనాధ సత్యనారాయణ గారు చనిపోయారని తెలిసింది. గొప్పవారూ, మహానుభావులూ చనిపోతే పోతారు. నాకేంటి సమస్య? అదే అసలు విషయం. విశ్వనాధ వారి పక్క యిల్లే మాది. చిన్న ప్రహరీ గోడ మాత్రమే అడ్డు. ఎప్పుడు గోడ మీది నుంచి చూసినా, ఇంటి బయట, కింద, గచ్చు మీద కూర్చున్న విశ్వనాధ కనిపించేవారు. చొక్కా లేకుండా, నీరు కావి పంచెతోనే ఉండేవారు.

వాళ్లబ్బాయి పావని శాస్త్రి నాకు బాగానే తెలుసు.రమ్మని ఇంట్లోకి తీసికెళ్లేవాడు. విశ్వనాధని దాటుకుని పక్కన మెట్లెక్కి పైకి వెళితే, చక్కని హాలు.  కొంచెం ఎక్కువ లావు వుండే పావని శాస్త్రి ఏదో గమకం వేస్తూ రాగం తీస్తూ తబలా వాయించేవాడు. కబుర్లు చెప్పేవాడు. కాఫీ ఇచ్చేవాడు. స్నేహంగా ఉండేవాడు. విశ్వనాధలాంటి వాడికి ఇంత మంచి కొడుకు పుట్టాడేమిటో… అనుకునేవాణ్ణి!

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి పూర్తి అధికార లాంఛనాలతో ‘స్టేట్ ఫ్యునరల్’ కావడంతో ప్రవాహంలా వస్తున్న పెద్దలు, శిష్యులూ ప్రభుత్వ అధికారులతో మారుతీ నగర్ కిటకిటలాడిపోతోంది. ఈ సనాతన, ఛాందస, చాతుర్వర్ణ, రివైవలిస్టు రచయిత అంతిమ సంస్కారానికి నేనెందుకుండాలి?

శుద్ధ దండగ, అని గట్టిగా అనుకుని,కొద్దిసేపట్లోనే గబగబా ఒక కాలేజీ మిత్రుడి ఇంటికి వెళ్లిపోయాను. రోజంతా అక్కడే గడిపి, రాత్రి లేటుగా వచ్చి.. హమ్మయ్య అనుకుంటూ నిద్రపోయాను. అప్పటికి విశ్వనాధ కోకిలమ్మ పదాలు,రెండు మూడు కథలు చదివి ఉన్నాను.అవి బాగా నచ్చాయి కూడా.  
చనిపోయే నాటికి ఆయనకు 81 ఏళ్లు. నాకు అప్పుడు 18 ఏళ్లు. పాపం ఆ మహా పండితుడికీ నాకూ ఎలాంటి పేచీ లేదు.

విశ్వనాధ  మనవరాలితో ఆడుకుంటూ వుండటం చాలాసార్లు చూశాను. అయితే చొరవ చేసి ఆయనతో ఏనాడూ మాట్లాడలేదు. ఈ శ్రీశ్రీ అనేవాడు వున్నాడు చూశారూ… అస్సలు తిన్నమైన వాడు కాదు. కొంటె కోణంగి. ‘‘విశ్వనాధ వారు వెనక్కి వెనక్కి నడవగా వేదకాలం ఇంకా వెనక్కి పోయిందట’’ అని వెక్కిరించారోసారి.

భలేగా అన్నాడు శ్రీశ్రీ అని ఎవరికైనా అనిపిస్తుంది. ఐనా, విశ్వనాధ సత్యనారాయణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. ఆ మాట కొస్తే ఆయన ఒకటి కాదు. రెండు. 1. రామాయణ కల్పవృక్షం 2. వేయి పడగలు. సిప్రాలీలో శ్రీశ్రీ ‘ఏకవీరడు’ అని ఓ వ్యంగ్య బాణం వేశాడు. శ్రీమాన్ విశ్వనాధ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కావ్యం రోజూ పారాయణ చేసే వాళ్లెవరూ లేరా ?  ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారాయన.

అదీ వరస. నవ్వొస్తుంది కదా మరి. ఆగండాగండి. కుర్రతనమూ, ప్లస్ అరకొర కమ్యూనిజమూ…ఎంత ప్రమాదకరమో కొద్ది సేపట్లోనే మీకు తెలుస్తుంది. విరసం కొత్తగా ఎర్రజండాతో ఎగిరెగిరి పడుతున్న రోజుల్లో..  హోం మంత్రి వెంగళరావుతో విశ్వనాధ కాంటాక్ట్ లో వున్నారని తెలిసి, శ్రీశ్రీ రెచ్చిపోయి…  
‘‘విస్సిగాణ్ణి నమ్ముకున్న వెర్రివెంగళప్పయా ..సాహిత్యం మీద చెయ్యి వెయ్యబోకు తప్పయా’’ అని రాసిపారేశాడు.

చూశారా విశ్వనాధ అంతటివాణ్ణి పట్టుకుని ‘విస్సిగాడు’ అనేశాడు. ఇలాంటివి చదివితే విశ్వనాధ మీద చిన్నచూపు కలుగుతుంది కదా! అయిపోయిందా… లేదు.వేయి పడగలపై పడ్డాడు శ్రీశ్రీ.
“వేయి పడగలు… లక్ష పిడకలు… లక్క పిడతలు….. కాగితప్పడవలు… చాదస్తపు గొడవలు” అనేశాడు. తిట్టు కవిత. రిథం ఎంత బావుందీ, గుర్తుండి పోతుంది కదా!

దాంతో, నేను వేయి పడగలూ చదవలేదు. కల్పవృక్షాన్నీ ముట్టుకోలేదు. పైగా పెద్ద పుడింగులాగా ఆయన అంతిమయాత్రను బహిష్కరించడం! కొసమెరుపు ఏమిటంటే శ్రీశ్రీ, విశ్వనాధా ఎంతో బాగా పలకరించుకుని, సఖ్యంగా వుండేవారు. ఒకసారి శ్రీశ్రీ విశ్వనాధ యింటికి వెళ్తే, చిన్నారి మనవరాలిని శ్రీశ్రీ చేతిలో పెట్టి‘‘దీనికి నువ్వే పేరు పెట్టాలి’’ అన్నారు విశ్వనాధ.

శ్రీశ్రీ క్షణం కూడా ఆలోచించకుండా దీనిపేరు ‘నక్సలైట్’ అన్నారు. ఆ రోజు, శ్రీశ్రీ వెళ్లిపోయాక, విశ్వనాధ,  మనవరాల్ని చేతుల్లోకి తీసుకుని, “శ్రీశ్రీ నిన్ను నక్సలైట్ అన్నాడే… నక్సలైట్ అన్నాడు..’’ అంటూ మురిసి ముక్కలయిపోయారు. మా పక్క వీధిలో ఉండే రచయిత పెద్దభొట్ల సుబ్బరామయ్య గారు నాకీ విషయం చెప్పారు.
 * * *  * * *
ఇదంతా ఇపుడు రాయడం వెనుక కారణమేమంటే…’ సముద్రపు దిబ్బ’ అనే విశ్వనాధ వారి పాత నవల చదువుతున్నాను. 1961లో విజయవాడ దేశీ ప్రెస్ వాళ్లు పబ్లిష్ చేసిన ఈ 590 పేజీల ఈ నవల వెల ఎనిమిది రూపాయలు. సముద్రపు దిబ్బలో మానవ జీవితం గురించి ఆయన చెప్పే పద్ధతీ…చెలియలి కట్ట దాటని సముద్ర కెరటాల్లాంటి గంభీరమైన ఆయన శైలీ…చదువుతుంటే ఎంత పరవశమో…!

ఆ సముద్రపు దిబ్బ మీద విశ్వనాధ వారి అక్షరాల ముత్యపు చిప్పల్ని ఏరుకుంటున్నాను రెండు రోజులుగా. ఈ నవల చదవడం పూర్తి చేస్తే ప్రాయశ్చిత్తము   జరిగినట్టేనని నాకొక మూఢ నమ్మకము.
ఆ నవల గురించి మరోసారి….

పార్టింగ్ కిక్: శ్రీశ్రీలాంటి పెద్దల రాడికల్, ఇంటలెక్చువల్ గేమ్స్ వల్ల మా కుర్రకారు మిస్లీడ్ అయ్యారు. కొందరు మిస్ గైడెడ్ మిసైల్స్ గానే మిగిలిపోయారు. బెంగాలీ డిటెక్టివ్ నవలా రచయిత పాంచకడీదేవ్, రవీంద్రనాధ్ టాగూరు కంటే ఎంతో గొప్పవాడని శ్రీశ్రీ ప్రచారం చేసినప్పుడూ, గుడ్డిగా టాగూరునీ, ఆయన రచనల్నీ చాలా కాలం ఇగ్నోర్ చేశాను. టాగూరు గీతాంజలి, ఫ్రూట్ గేదరింగ్ (ఫల సేకరణ- అని చలం), పోస్ట్ మ్యాన్ బాగా లేటుగా చదివాను.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!