జైల్లో ఆమరణ దీక్ష చేయబోతున్నసాయిబాబా !

Sharing is Caring...

నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల  21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష‌ చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వడం లేదు. ఖైదీల ప్రాథమిక హక్కులైన చదువుకోవడానికి పుస్తకాలు, రాసుకునే వస్తువులు, అవసరమైన మెడిసిన్ కావాలని ఎప్పటి నుండో సాయిబాబా కోరుతున్నప్పటికీ జైలు అధికారులు పట్టించుకోవడం లేదు.  కుటుంబ సభ్యులు అందజేసిన పుస్తకాలను కూడా సాయిబాబాకు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 21 నుండి ఆమరణ నిరాహార దీక్ష‌ చేయబోతున్నారు.

2014 నుండి క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా అనేక అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  తగిన వైద్య చికిత్స చేయించక పోవడం వల్ల అతని అవయవాలు పని చేయని స్థితికి చేరుకుంటున్నాయి. నెల రోజులనుంచి తన ఫోన్ కాల్స్ ను కూడా  అనుమతించడంలేదని  సాయిబాబా సతీమణి వసంతకుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాయిబాబాకు పెరోల్ లేదా వైద్యం కోసం బెయిల్‌ను అడిగితే పదేపదే తిరస్కరించడం జరుగుతోంది. తల్లి చనిపోతే అంత్యక్రియలకు (ఆగస్టు 2020) హాజరు కావడానికి కూడా సాయిబాబాకు పెరోల్ ఇవ్వలేదు . ఖైదీకి ఉన్న హక్కులు కూడా అమలు కావడం లేదు. 
ప్రతి ఖైదీకి న్యాయ సలహాదారుడితో మాట్లాడే హక్కును కూడా కరోనా పేరిట అధికారులు కాలరాస్తున్నారు. అతనికి నెలకు రెండు కంటే ఎక్కువ కాల్స్ చేయడానికి అనుమతి లేదు. కేసు విషయంపై తన న్యాయవాదులతో చర్చించే అవకాశం లేదు. జైలులో గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన ఈ ప్రాథమిక హక్కులు కల్పించాలని సాయిబాబా డిమాండ్ చేస్తున్నారు.
ఈ సదుపాయాలను కల్పించడంలో జైలు అధికారుల వైఫల్యం కారణంగానే  ఆయన  ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిని కల్పించిన జైలు అధికారుల చర్యలపట్ల సాయిబాబా రక్షణ , విడుదల కమిటీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. కమిటీ చైర్మెన్ ప్రొఫెసర్ జి. హరగోపాల్, తెలంగాణ కన్వీనర్ కె. రవిచందర్ లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.   
——  KNMURTHY
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!