మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వర్గం .. మంచు విష్ణు వర్గం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్ రాజ్ మంచు విష్ణు పై మండి పడ్డారు. ‘నేను తెలుగువాడిని కాదు. ఒప్పుకుంటా . కర్ణాటకలో పుట్టాను.
తమిళ .. తెలుగు భాషలలో నటుడిగా ఎదిగాను. తెలుగు వాడిని కానంత మాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదా ?అలా అని ‘మా’ నియమ నిబంధనల్లో ఉందా? నేను రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాను . 9 నందులు తీసుకున్నాను . ఆ స్థాయి వాళ్ళు అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా? ఇదే అంశంపై చర్చ పెడితే జనం నవ్వుతారు.
నాపై ఏవో విమర్శలు చేయడం సబబు కాదు.తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం తెలుగు మాట్లాడినంత మాత్రాన తెలుగువారు అయిపోరు. ప్రముఖ రచయితలు ఆత్రేయ, చలం, తిలక్ ఇలా ఎవరి గురించి అయినా చర్చ పెడితే మాట్లాడతా.. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు దేని గురించి అయినా మాట్లాడే సత్తా నాకుంది. అవతలి ప్యానెల్‌లో ఆ సత్తా ఒక్కరికైనా ఉందా ? ఉన్నవాళ్లు దమ్ముంటే ఎన్నికల్లోపోటీ చేయాలి ” అని సూచించారు.
‘మా’ ఎన్నికల్లోకి ఏపీ సీఎం జగన్‌ను లాగొద్దు. ఆయన పాదయాత్ర చేసి, ప్రజల ఆదరణతో సీఎం అయ్యారు. ఈ ఎన్నికల గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమం చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆయనకు చాలా పనులున్నాయి. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారు” అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు.
తాను అనని మాటలను అన్నట్టు ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్ధాలు చెబుతున్నారని … ఇది సరికాదని నరేష్ మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ప్రకాశ్‌రాజ్ హితవు పలికారు. ‘మీరు పవన్‌కల్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని మంచు విష్ణు ప్రశ్నించడం సరికాదు. పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అంటూ ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ఆ విషయంలోకి నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండని స్పష్టం చేశారు. ఒళ్ళు దగ్గర బెట్టుకుని మాట్లాడాలని ప్రత్యర్థి వర్గానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.