Regional discrimination …………………………..
భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తుంటారు. దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వ సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ 1969 లో ఏర్పాటు చేసింది.
వివిధరంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన కమిటీ ఈ అవార్డుకి అర్హులైన వారిని ఎంపిక జేస్తుంది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు.1969లో తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు.
భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు. తర్వాత కాలంలో కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన పేరు మీద అవార్డు ప్రదానం చేయడం మంచి సంప్రదాయమే. అభిలషణీయమే.
అయితే ఈ పురస్కారానికి అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయడంలో కొంత ప్రాంతీయ వివక్షత చోటు చేసుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందీ పరిశ్రమ లో నటులకు ,గాయకులకు ,సంగీత దర్శకులకు కూడా ఈ అవార్డులు ఇచ్చారు.
తెలుగు లో ఇప్పటివరకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974) పైడి జైరాజ్ (1980) ఎల్.వి.ప్రసాద్ (1982) బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986) అక్కినేని నాగేశ్వరరావు (1990) డి.రామానాయుడు (2009) కె. విశ్వనాథ్ (2016)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మరెందరో అద్భుత ప్రతిభ కనపరిచిన కళాకారుల వైపు కమిటీ కన్నెత్తి చూడలేదు
నటులు చిత్తూరు నాగయ్య , ఎస్వీ రంగారావు,ఎన్టీ రామారావు , నటీమణులు భానుమతి , సావిత్రి, జమున, గాయకులు ఘంటసాల , గాయనీమణులు జానకి ,సుశీల, ఎస్. వరలక్ష్మి , రచయితలు దాశరధి , కృష్ణశాస్త్రి ,శ్రీశ్రీ , ఆత్రేయ ,సినారే ,ముళ్ళపూడి, సంగీతదర్శకులు రాజేశ్వరరావు, పెండ్యాల ,సుసర్ల,ఆదినారాయణరావు, దర్శకులు కేవీ రెడ్డి ..సీఎస్ రావు , ఆదుర్తి , కమలాకర కామేశ్వరరావు , బాపు వంటి అద్భుత కళాకారులు కమిటీ సభ్యులకు కనిపించకపోవడం శోచనీయం. వీరంతా అసమాన ప్రతిభ గలవారే.
హిందీ కళాకారులకు ఏ మాత్రం తీసి పోరు. ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఇవ్వలేదు అనుకోవచ్చు. నాగయ్య , ఎస్వీఆర్ లను కూడా వారు గుర్తించకపోవడం బాధాకరం. తెలుగు సినీ ప్రముఖులకైతే న్యాయం జరగలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.వారిలో కొందరికైనా కనీసం మరణాంతర పురస్కారం కూడా ప్రకటించకపోవడం దారుణం.
ఇప్పటివరకు అవార్డులకు ఎంపిక చేసిన కళాకారుల జాబితా చూస్తే రాజకీయాలు,పక్షపాతం చోటు చేసుకున్నాయని ఎవరైనా అంటారు. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉంటే ఏడాదికి ఒక్కరినే ఈ అవార్డు కి ఎంపిక జేయడం కూడా కష్టమే అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఎంతటి ప్రతిభావంతులైనా అధికారపార్టీలో చేరి పార్టీ కి సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వడం శోచనీయం
చిత్ర పరిశ్రమ చిన్నదిగా ఉన్నపుడు పెట్టిన ఈ అవార్డు ని ఇపుడు పరిశ్రమ విస్తృతమైన నేపధ్యం లో అవార్డు ను రెండుగా చేసి సౌత్ లో ఒకరికి , నార్త్ లో ఒకరికి ఇస్తే కొంతైనా న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.
———KNMURTHY