ఉగ్రవాదుల అడ్డాగా పీర్ పంజాల్ !!

Sharing is Caring...

The advancing army………………………….

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి.  పీర్‌పంజాల్‌ రేంజిల్‌లోని పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి.

పాక్‌ నుంచి సరిహద్దు దాటుకొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకమైనవి.

దాదాపు 15 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక అపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. ఇక్కడి పరిస్థితి అఫ్గానిస్థాన్‌లోని పర్వత శ్రేణుల్లా ఉంటుంది.  చిక్కటి అడవులు తోడు కావడంతో ఎంత పెద్ద దళానికైనా.. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవాలన్నా ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా అత్యంత సమీపంలోనే ఉంటుంది.

2003లో ఆపరేషన్‌ సర్పవినాశ్‌ చేపట్టిన  క్రమంలో .. పూంచ్ నుంచి పీర్‌పంజాల్‌ పర్వత ప్రాంతంలో భారీగా ఉగ్రస్థావరాలు ఏర్పాటు చేసుకొన్నట్లు గుర్తించారు. అప్పట్లో హిల్‌కాకా ప్రాంతంలో వందల సంఖ్యలో ఉగ్రస్థావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. వాస్తవానికి ఇక్కడి వేసవిలో గొర్రెలను కాచుకొనే తెగకు చెందిన వారు నిర్మించుకొన్న డోకే అనే నిర్మాణాలు ఉగ్రమూకలకు బాగా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు.

ఇప్పుడు అదే ప్రాంతంలో ఉగ్ర ఆపరేషన్లు పెరిగిపోయాయి. రాజౌరీ వద్ద చొరబాట్లను అడ్డుకోవడానికి సైన్యం దాదాపు 100 కిలోమీట్లరకు పైగా ఫెన్సింగ్‌ వేసింది. కానీ, హిమపాతం ఫెన్సింగ్‌ను ముంచేస్తుంది. దీనికి తోడు భౌగోళిక పరిస్థితులు కూడా ఉగ్రవాదుల చొరబాట్లకు అనుకూలిస్తున్నాయి.

ఇటీవల కాలంలో సైనిక దళాలు ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులు సాంకేతికత విషయంలో కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో టెర్రరిస్టులు ఒక ఇంట్లో స్థిరంగా ఆశ్రయం పొందేవారు. ఇప్పుడు తరచూ తమ స్థావరాలను మార్చేస్తున్నారు. దీంతో వారిని వేటాడం దళాలకు కష్టంగా మారింది.అనంత్‌నాగ్‌లో కూడా ఉగ్రవాదులు ఇంట్లో కాకుండా అడవుల్లో ఆశ్రయం పొందారు.

మరోవైపు వైఎస్‌ఎంఎస్‌ (YSMS) టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. 2016, 2019లో జరిగిన భారీ ఉగ్రదాడుల్లో కూడా దీన్ని వాడారు. ఈ టెక్నాలజీలో వెరీ హైఫ్రీక్వెన్సీలో ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పంపడంతో వీటిని ట్రాక్‌ చేయడం దళాలకు కష్టంగా మారింది. స్మార్ట్‌ఫోన్లను రేడియో సెట్లకు అనుసంధానించి అత్యవసర సందేశాలు పంపుతారు.  తమ లొకేషన్లను నాయకులకు  చేరవేస్తుంటారు. 

దీనికి తోడు స్థానికులను బెదిరించి వారి ఫోన్ల నుంచి ప్రత్యేక యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసి వాటి నుంచి అవసరమైన సమాచారాన్ని.. ఫోటోలను  పాక్‌కు పంపుతుంటారు. పీర్‌ పంజాల్‌ ప్రాంతంలో పాక్‌ సెల్యూలర్‌ సర్వీసుల సిగ్నల్స్‌ కూడా బలంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదులతో రోజుల తరబడి పోరాడాల్సి వస్తున్నది.  

ఈ వారంలో ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో ఒక కర్నల్‌, మేజర్‌, కశ్మీరీ పోలీసు డీఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లా నార్లా గ్రామంలో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ రోజులు గడుస్తున్నా ముగింపుకు రాలేదు.అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
అక్కడ ఉగ్రవాదుల కదలికలు తెలుసుకొని రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు.

లష్కరే కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ వీరిలో ఉన్నాడని భావిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన సమయంలో వారు అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఈ ఘటనలు మొత్తం పీర్‌ పంజాల్‌ రేంజ్‌లో పెరిగిన ఉగ్రవాదుల  కదలికలను తెలియజేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు అధికారులు డ్రోన్లు, ఐఈడీలను వాడుతున్నారు. దూకుడు పెంచుతున్నారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!