మరొకరు ఆ ‘దాసీ’ పాత్రలో ఒదిగి పోలేరేమో !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………..

వందేళ్ళ కింద మన సమాజంలో పాతుకుపోయిన దుర్వ్యవస్థలలో ఒకటి దాసీ వ్యవస్థ . ‘1925 తెలంగాణ నల్లగొండ జిల్లా నారాయణపురం’ అని సినిమా ప్రారంభం అవుతుంది . నైజాం నవాబు పాలనలో ఆయనకు కప్పం కడుతూ గ్రామాలలో దొరలు తమ గడీలలో చేసిన మానవ దోపిడీ అంతా ఇంతా కాదు .

ఒసేయ్ రాములమ్మా , రాజన్న లాంటి సినిమాలు దొరల అఘాయిత్యాలను చూపితే రజాకార్ లాంటి సినిమాలు రజ్వీ స్వంత సైన్యం ఎలాంటి దౌర్జన్యాలు చేసాయో కళ్ళకు కట్టినట్లు చూపాయి .ఆ కోవ లోనిదే 1988 జూన్లో వచ్చిన గొప్ప ఆర్ట్ ఫిలిం , ట్రాజిక్ క్లాసిక్ ఈ దాసి సినిమా .

దొరల కుటుంబం లోనే పుట్టి గడీల లోనే పెరిగిన బి నరసింగరావు ఈ సినిమాకు తెర వెనుక కర్త , కర్మ , క్రియ.. తెర మీద అంతా తానై నిశ్శబ్ద విజృంభణ చేసింది అర్చన . చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అర్చన .

ఈ సినిమాలో ముఖ్యంగా చివరి గర్భ విఛ్ఛిన్నం సీనులో అత్యద్భుతంగా నటించింది. ఈ సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది . బి నరసింగరావుకు ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది.

కన్యాశుల్కానికి కక్కుర్తి పడి ఆడపిల్లలను అమ్మిన మగానుభావులు ఉన్న మన సమాజంలో ఎందరో ఉన్నారు. ఇరవై రూపాయలు కోసం ఓ దొరకు అమ్మివేయ బడుతుంది కామాక్షి పాత్రలో అర్చన . దొర కూతురు పెళ్ళయాక దొరసానితో పాటు ఆమె భర్త గడీకి చేరుతుంది అర్చన. అక్కడ అన్ని పనులతో పాటు దొరకు , దొర బావమరిదికి , వచ్చీపోయే అతిధులకు మరదలు పిల్ల అయిపోతుంది ఆ దాసి .

ఓ మర మనిషిగా ఒంటిని అప్పచెపుతూ ఉంటుంది . గర్భం వస్తే బిడ్డను కనాలని కోరుకుంటుంది . కానీ , దొరసాని గర్భ విఛ్ఛిన్నం చేయించి ఆమె కలని భగ్నం చేయడంతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది . ఇదీ టూకీగా కధ .

సినిమా గొప్పతనం ఏమిటంటే వందేళ్ళ కింద గ్రామీణ తెలంగాణ ఎలా ఉండేది , అనాటి కట్టు బొట్టు , కట్టుబాట్లు , వగైరా అద్భుతంగా చూపారు . మంత్రగాళ్ళ మాయా తీర్ధం వంటి మూడ నమ్మకాలు , వీధి నాటకాలు , కర్రసాము , భట్రాజుల పొగడ్తలు , వగైరా ఆనాటి కళలు , ఆచారాలను సినిమాలో చక్కగా చూపారు . గడీలలో ఉపయోగించే సామాన్లు , వస్తువులు , దుస్తులు , వగైరా బాగా చూపారు. కాస్ట్యూమ్స్ డిజైనర్ సుదర్శనుకు కూడా జాతీయ అవార్డు వచ్చింది .

18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అర్చనతో పాటు ఆనాటి రంగ స్థల , సినిమా నటుడు , ఎన్టీఆర్ కన్నా ముందు కృష్ణుడిగా ప్రేక్షకుల మన్నలను పొందిన ఈలపాట రఘురామయ్య కుమార్తె రూప దొరసానిగా చాలా బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో భూపాల్ రెడ్డి , కె యన్ టి శాస్త్రి , ఆనంద చక్రపాణి , శిల్ప , బి నరసింగరావులు , జూనియర్ ఆర్టిస్టులు చాలామంది నటించారు.

ఆనాడు బ్రిటిష్ ఇండియాలో , ముఖ్యంగా అభివృద్ధి నోచుకోని కొన్ని సంస్థానాలలో , దాసీతనం , వెట్టి చాకిరీ సాధారణమే . ఇప్పటి తరానికి అవి తెలియక పోవచ్చు . భారత రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నో హక్కులను నోరు లేని అనామకులు కూడా ఈరోజు అనుభవిస్తున్నారు .

ఉత్తమ సినిమాటోగ్రఫీ , ఉత్తమ కళా దర్శకత్వంతో సహా మొత్తం అయిదు జాతీయ అవార్డులను పొందిన మొదటి సినిమా ఇదేనేమో . మాస్కోలో డిప్లొమా ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్టుని పొందింది . 12వ IFFI లో ప్రదర్శితమైంది. రాజన్న ,ఒసేయ్ రాములమ్మా వంటి సినిమాల్లాగా స్పీడుగా ఉండదు . డ్రైగా , పాసెంజర్ బండి లాగా నడుస్తుంది . అయినా అర్చన నల్లందం , లేడి కళ్ళు , ఆనాటి తెలంగాణా గ్రామీణ వాతావరణం ఆసక్తికరంగానే ఉంటాయి .

బి నరసింగరావు అందించిన బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది . ఈనాటి ఢాంఢాం గార్లు తప్పక చూసి నేర్చుకోవాలి . ఇంత డ్రై సినిమాకు అంత ఆహ్లాదకరమైన నేపధ్య సంగీతాన్ని ఎలా అందించవచ్చో నేర్చుకోవాలి . మనకు సాహిత్యాలలో అభ్యుదయ , విప్లవ , దిగంబర సాహిత్యాలు ఉన్నట్లు సినిమాలలో కూడా ఇవన్నీ ఉంటాయి .

కె విశ్వనాధ్ బలాత్కార ఆక్రమణలు లాగా ఉండవు బి నరసింగరావు గారి బలాత్కార ఆక్రమణలు అనబడే రేపులు . ఓ రకంగా చెప్పాలంటే దిగంబర సాహిత్యం వంటి సినిమా అని చెప్పవచ్చు .ఈతరం వారు తప్పక చూడాలి . మళయాళ సినిమాలతో సమానంగా తెలుగులో కూడా ఇలాంటి ఆర్ట్ ఫిలింస్ చాలా ఉన్నాయని తెలుస్తుంది . సినిమా నిడివి 94 నిమిషాలు మాత్రమే .

Tharjani   —————-

ఈ దాసి సినిమా కోసం మరికొందరితో కలసి దర్శకుడు నరసింగరావు చాలా రీసెర్చ్ వర్క్ చేశారు.
తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనలో వాళ్లకి సహాయకులుగా జాగిర్దార్లు ఉండేవాళ్లు. వారి కింద ఊరికో దొర పెత్తనం. ఆ దొరల దయాదాక్షిణ్యాల మీదే ప్రజల బతుకులు సాగేవి.

దొరగారికి పెళ్లయితే, వధువు వెంట తోడులాగ ఓ దాసీ వస్తుంది. ఇంటిపని, వంట పని, చివరకు ఒంటి పని కూడా చేయాల్సిందే.. అడిగినవారికి అడిగిందల్లా ఇవ్వడమే దాసీ పని. 24 X 7 పనే .ఈ దాసీ వ్యవస్థ ఎలా ఉందొ తెలుసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. అంత వరకు బాగానే సాగింది ..

అయితే దాసీ పాత్రకు ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్ధంకాక మల్లగుల్లాలు పడ్డారు. చాలామంది నటీమణులను పేర్లు అనుకున్నారు. సరిగ్గా అదేసమయంలో బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన తమిళ సినిమా ‘వీడు’లో నటించిన ‘అర్చన’కు ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు.

ఆమె ఫొటో చూడగానే ‘దాసి’ పాత్రకు తాను నూరు శాతం ఫిట్ అవుతుందని నరసింగరావు భావించారు. వెంటనే కూపీ లాగారు. సంప్రదించారు. అర్చనకు ఇలాంటి పాత్రలంటే మక్కువ ఎక్కువ. ఆమె ఒకే అంది. షూటింగ్ కి సిద్ధమయ్యారు.

నల్గొండ జిల్లాలో చింతపల్లి అనే ఊళ్లో ఓ గడీ ఉంది. గడీ అంటే దొర నివాస భవనం అన్నమాట. సినిమా అంతా అక్కడే షూటింగ్ చేశారు .అప్పట్లో పదకొండున్నర లక్షలుఅయింది . దీనికి మ్యూజిక్కూ నరసింగరావే సమకూర్చారు . ‘దాసి’ పక్కాగా ముస్తాబు చేసి విడుదల చేశారు. జాతీయ అవార్డులు గెలుచుకుంది.

దర్శకుడు నరసింగరావు మా భూమి (1979)రంగుల కల (1983) దాసి (1988) మా భూమి (1979) మట్టి మనుషులు (1990)వంటి సినిమాలు తీశారు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ కి చెందిన నరసింగరావు తీసిన సినిమాలు తక్కువే ప్రత్యేక గుర్తింపు పొందాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!