‘భగ్నప్రేమికుడు’ అంటే ఆయనే గుర్తుకొస్తారా ?

Sharing is Caring...

No one else can do those roles  ………………….

ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు.

ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర జనంపై అంత ముద్ర వేసింది.దేవదాసు చిత్ర నిర్మాణం గురించి దర్శకుడు వేదాంతం రాఘవయ్య తీసుకున్నజాగ్రత్తలు గురించి.. ఇప్పటికి కథలు కథలు గా చెప్పుకుంటారు.

ఆ సినిమా షూటింగ్ రాత్రుళ్ళే ఎక్కువ చేశారట. ఇందువల్ల నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు.కొంతమంది అయితే ఒక పెగ్ లాగించి సహజమైన ఆ ఫీల్ రావడానికి అక్కినేని ప్రయత్నించే వారని అంటారు. ఏది ఏమైనా ‘భగ్నప్రేమికుడి’ గా అక్కినేని నటన అపూర్వం.

అలాంటి పాత్రలకు ‘ఆయనకు ఆయనే సాటి’ అని దేవదాసుతో ఒక ముద్ర పడిపోయింది. ఇక దేవదాసు పాటలు అన్ని సూపర్ హిట్ .. ‘జగమే మాయ…  కుడి ఎడమైతే’, వంటి పాటలు అజరామరంగా నిలిచి పోయాయి. ఆ పాటల్లో అక్కినేని నటన ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. గుండెల్లో బాధ కలిగిస్తుంది. 

దేవదాసు కంటే ముందు లైలా మజ్నూలో అక్కినేని కైస్ పాత్రలో నటించారు. అది కూడా భగ్నప్రేమికుడి కథే. లైలామజ్నూ లో ఇద్దరినీ పెద్దలు విడదీస్తారు. ఆ ఎడబాటు తట్టుకోలేక ముందు లైలా తర్వాత మజ్నూ మరణిస్తారు. ఈ చిత్రం కూడా బాగా ఆడింది. ఇందులో పాటలు కూడా బాగుంటాయి ‘ ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా’ పాట ఇప్పటికి వినబడుతుంటోంది.

ఆ రెండు సినిమాల తర్వాత ‘అనార్కలి’ 1955 లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా అక్కినేని భగ్న ప్రేమికుడి పాత్రలో నటించారు. ‘సలీం’ గా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పించారు. వరుసగా మూడు ట్రాజెడీ చిత్రాల్లో అక్కినేని భగ్న ప్రేమికుడిగా చేయడం విశేషం. ఈ సినిమాకు కూడా వేదాంతం రాఘవయ్యే దర్శకుడు. సినిమా ప్రియులను అలరించింది ఈ అనార్కలి.

ఈ సినిమాల తరువాత ‘భగ్న ప్రేమికుడు’ అంటే ‘అక్కినేని’ ని మాత్రమే ప్రేక్షకులు ఊహించుకునే వారు.ముఖ్యంగా దేవదాసు తర్వాత అలాంటి పాత్రలున్న కథలతో నిర్మాతలు ఆయనను కలిసే వారు. దీంతో  తన ఇంటి పేరు ‘అక్కినేని’కి బదులు ‘తాగుబోతు’గా మారిపోతుందనే భయం కూడా కలిగింది.అందుకే అలాంటి కథలను ఆయన అంగీకరించలేదు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక సందర్భంగా మీడియాకు చెప్పారు. ఇక 1961 లో రిలీజ్ అయిన ‘బాటసారి’ లో మౌన ప్రేమికుని పాత్ర ను అక్కినేని అద్భుతంగా పోషించారు. నటనలో తనదైన బాణీ పలికించారు. ఆ తర్వాత కాలంలో అక్కినేని కొన్ని సినిమాల్లో ప్రేమికుని పాత్రలు చేశారు. అయితే అవన్నీ ట్రాజెడీలు కాదు.

దేవదాసు మళ్ళీ పుట్టాడు, ప్రేమనగర్, ప్రేమ మందిరం , ప్రేమాభిషేకం, ప్రేమలు పెళ్లిళ్లు చిత్రాల్లో ప్రేమికునిగా తనదైన శైలితో నటించి మెప్పించారు. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే.

ప్రేమనగర్, ప్రేమాభిషేకం సూపర్ హిట్ చిత్రాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఆరెండు సినిమాల్లో అక్కినేని పాత్రలను దర్శక రచయితలు విభిన్నం గా మలిచారు. అక్కినేని కూడా పాత్రకు తగ్గట్టు అభినయించి  ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు.   

‘మనసు గతి ఇంతే’ … ‘వందనం పాదాభివందనం’.. ‘అమరం అమరం’ .. ‘మనసులేని దేవుడు,
మనిషి కెందుకో మనసు ఇచ్చాడు’ వంటి పాటలు అద్భుతంగా ఉంటాయి. అంతే అద్భుతంగా వాటిని తెరకెక్కించారు దర్శకులు. ఆ పాటల్లో అక్కినేని నటన ను చూస్తే .. అది ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పుకోక తప్పదు. 

——–KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!