కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి కొత్త రికార్డు సృష్టించారు. మేవాలాల్ చౌదరి 2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు మధ్యాహ్నం 2 గంటలకు రాజీనామా చేశారు, ఆయన కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే మంత్రిగా చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 72 గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నరు కూడా అంగీకరించారు. ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో మంత్రి రాజీనామా చేశారు.
మేవాలాల్ పై ఆరోపణలు చాలాఉన్నాయి. 161 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు … జూనియర్ శాస్త్రవేత్తల నియామకానికి సంబంధించి 2011 లో భాగల్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ గా మేవాలాల్ తన పదవిని దుర్వినియోగం చేశారు.బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2010 లో స్వయం ప్రతిపత్తి సంస్థగా స్థాపించబడింది. మేవలాల్ చౌదరిని ఐదు సంవత్సరాల కాలానికి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా నియమించారు. 2011 లో విశ్వవిద్యాలయం 281 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పట్లో బీహార్ గవర్నర్‌గా, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా ఉన్న రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. ప్రొఫెసర్ల ఇంటర్వ్యూల లో తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు అధిక మార్కులు ఇస్తున్నారని, మెరిటోరియస్ అభ్యర్థులకు తక్కువ మార్కులు ఇచ్చినట్లు గవర్నర్కు ఫిర్యాదులు అందాయి.
దీంతో రామ్‌నాథ్ కోవింద్ 2015 లో జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ మహ్మద్ మహఫూజ్ ఆలం చేత ఈవ్యవహారాలపై విచారణ చేయించారు. ఈ విచారణ లో మేవలాల్ చౌదరిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. విచారణ దరిమిలా మేవాలాల్ వైస్-ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో మేవాలాల్ తారాపూర్ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఫిబ్రవరి 2017 లో, ఛాన్సలర్ కోవింద్ ఆదేశాల మేరకు బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మేవలాల్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 466, 468, 471, 309, ౪౨౦,120 (డి) కింద ఆయనపై కేసు నమోదైంది, ఆ తర్వాత జనతాదళ్-యునైటెడ్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
బౌర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ క్యాంపస్‌లో భవనం నిర్మాణం విషయంలో కూడా మేవాలాల్ చౌదరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.మేవాలాల్ చౌదరి తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూనే ఉన్నారు.బీహార్‌లోని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ మేవాలాల్ కి మంత్రి పదవి ఇవ్వడం పై విమర్శలు గుప్పించింది. అవినీతి పరులకు సిఎం నితీష్ కుమార్ మంత్రి పదవులు బహుమతి గా ఇస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శలు చేశారు. కాగా మేవాలాల్ భార్య నీతూ చౌధురి 2019 లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె నివాసంలోనే పూర్తి స్థాయిలో శరీరం కాలిపోయి కనిపించారు. ఈ వ్యవహారంలో మేవాలాల్ పాత్ర కూడా ఉందని ఆర్జేడీ ఆరోపించింది. దీంతో రచ్చ కాకముందే మేవాలాల్ పదవి నుంచి తప్పుకున్నారు.