Taadi Prakash ……………………………
ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల మంది జనం వచ్చి సరిహద్దులోని ఆ ఆస్పత్రిని చూసి వెళ్లారు.
రెండు నెలల్లోనే 30 వేల సైన్యంతో జపాన్ ఆ ప్రాంతంపై విరుచుకుపడింది. ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చైనాసైన్యం బెతూన్కి చెప్పింది. బెతూన్ బృందం గుర్రాలపై ఆ గ్రామం విడిచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయింది. గ్రామాలనీ, ఆస్పత్రినీ శత్రు సైనికులు ధ్వంసం చేశారు. మరో చోట వైద్యసేవలు ప్రారంభించారు. గాయపడ్డ సైనికులు మన దగ్గరకు రావడం కాదు, మనమే గాయపడ్డ వారి దగ్గరికి వెళ్లాలని బెతూన్ చెప్పారు.
గుర్రాల మీద పర్వతాలు దాటడం, ఎక్కడికక్కడే వైద్యం చేయడం, ఒక గ్రామంలో వున్న చిన్న ఆస్పత్రిలాంటి దాన్ని ఆపరేషన్ థియేటర్లా మార్చాడు. ప్రజల ఇళ్ల మధ్య శత్రువుకి కనిపించకుండా వుండేది. ఆపరేషన్లు సరిగ్గా చేయడం కోసం గుమ్మడికాయలకి `క్షవరం` చేసి వాటికి గాట్లు పెట్టాలని విద్యార్థులకు చెప్పేవాడు. మత్తు మందు ఇవ్వడం ఎలాగో నేర్పేవాడు. నేరుగా యుద్ధరంగంలోకే వెళ్లడానికి సంచార వైద్యబృందాలని సిద్ధంచేశాడు.
ఐడియా యిచ్చిన గాడిద!
ఓ రోజు ఓ గ్రామీణుడు ఓ గాడిద మీద రెండు వెదురు బుట్టలేసుకుని వచ్చాడు. తక్షణం బెతూన్కి ఐడియా తట్టింది. ఆపరేషన్ గదికి, కట్లు కట్టే కేంద్రానికి కావాల్సిన వస్తువులన్నీ సరిపోయేలా కలిసి వుండే రెండు చెక్కపెట్టెల్ని తయారు చేయించాడు. అది పరిస్తే కట్టుకట్టే బల్లవుతుంది. రెండు పెట్టెల్ని మడత పెడితే, గాడిద మీద అటూ యిటూ వేసి మరో చోటికి తీసుకుపోవచ్చు. గెరిల్లా పోరులో చివరి సంవత్సరం 1939 ఫిబ్రవరిలో హోపెయ్ రాష్ట్రంలో. యుద్ధం భీకరంగా జరుగుతోంది.
గుర్రాలపై బయలుదేరిన బెతూన్ వైద్యబృందం హోపెయ్ చేరుకుంది. యుద్ధరంగానికి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న ఆస్పత్రి. నిర్విరామంగా వైద్యం చేస్తూనే వున్నాడు. రెండు రాత్రులు, రెండు పగళ్లు అవిశ్రాంతంగా పని. ఇంతలో దగ్గర్లోనే బాంబు పేలింది. ఆస్పత్రి వెనకగోడ కూలిపోయింది. ఎక్కడైనా దాక్కోవాలని సూచించారు మిత్రులు. ఇక్కడ నా రక్షణ ముఖ్యం కాదు. నాకు సౌఖ్యం అవసరంలేదు అని పని కొనసాగించాడు.
అలా బెతూన్ వైద్యం వల్ల కోలుకున్న వందలమంది తిరిగి యుద్ధరంగానికి వెళ్లారు. ఓ రోజు గాయపడ్డ సైనికుణ్ని తీసుకొచ్చారు. అతనికి కాలు తీసివేయాలి. రక్తం అవసరం. చాలా మంది రక్తం ఇస్తామన్నారు. మీరంతా ఇప్పటికే రెండు మూడుసార్లు రక్తం యిచ్చి వున్నారు. నాది `ఒ` గ్రూపు రక్తం. ఎవరికైనా సరిపోతుంది అని బెతూన్ తన రక్తం యిచ్చారు. అంతా సంభ్రమంతో బెతూన్‌ని చూస్తుండి పోయారు.
మరో గ్రామం, మరో ఆస్పత్రి. గబగబా వైద్యసేవ. శత్రుసైన్యం వస్తోందని తెలిసినా తెగించి పనిచెయ్యడం, శత్రువు దగ్గరికి రాగానే గుర్రాలెక్కి వేగంగా వెళిపోవడం, సరిహద్దులో, నదుల పక్కన, కొండవాలుల్లో ఒకటీ రెండూ కాదు. వంద సాహసాలు చేశాడు బెతూన్. రాత్రిపూట దీపం పట్టుకుని వార్డుల్లో తిరిగేవాడు. సైనికుల్ని పలకరించేవాడు. చైనా సైన్యానికి నిధులు, మందులు తీసుకురావడానికి కెనడా వెళ్లాలనుకున్నాడు బెతూన్.
అప్పటికి ఆయన వయస్సు 49 సంవత్సరాలు. 1939 అక్టోబర్ 20న వెళ్ధామనుకున్నాడు. జపాన్ దాడులు మహోగ్రరూపం దాల్చాయి. ప్రయాణం వాయిదా పడింది. చర్మవ్యాధి వున్న ఒక సైనికుడికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బెతూన్ వేలికి గాయమై, ఇన్ఫెక్షన్ సోకింది. వద్దన్నా వినకుండా గుర్రం ఎక్కి యుద్ధరంగానికి బయల్దేరాడు. బలహీనంగా వున్నప్పటికీ మరో 16 గంటలపాటు వైద్యం చేశాడు.
నవంబర్ 9న బెతూన్ ఆరోగ్యం క్షీణించింది. వెనక్కి వెళిపోదాం, మీకు చికిత్స అవసరం అని మిత్రులు బెతూన్‌ని ఒప్పించారు.గుర్రాల మీద చలిలో ప్రయాణిస్తూ నవంబర్ 10వ తేదీకి మారుమూల పచ్చరాయి గ్రామానికి బెతూన్‌ని చేర్చారు. ఆయన్ని రక్షించుకోవడం కోసం చైనా డాక్టర్లు వచ్చారు. బెతూన్ చేతికి గాంగ్రిన్ అయ్యింది. చెయ్యి వెంటనే తీసేయాలి. బెతూన్ ఒప్పుకోలేదు. ఆయన మెలకువగానే వున్నాడు.
“ఇక వైద్యసేవ చేయలేనందుకు బాధగా వుంది అన్నాడు. నాకు వచ్చింది సెప్టీ సేమియా-నన్నెవరూ రక్షించలేరు. విజయం సాధించబోయే కొత్త చైనాని చూడలేకపోతున్నాను“ అన్నారు. నవంబర్ 11న మిలటరీ కమాండ్ అతి కష్టమ్మీద ఒక ఉత్తరం… “చైనాలో నేను గడిపినవి అర్థవంతమైన సంవత్సరాలు. కెనడా కమ్యూనిస్టు పార్టీకి, అమెరికా ప్రజలకూ యీ నా మాటలు తెలియజేయండి“ అని రాశారు.
1939 నవంబర్ 12న గెరిల్లా డాక్టర్ హెన్రీ నార్మన్ బెతూన్ కన్నుమూశాడు. మావో ఒక ప్రత్యేక సంతాప సందేశంలో బెతూన్కి నివాళులర్పించారు. ART OF HEALING WAS HIS PROFESSIONHIS EXAMPLE WAS AN EXCELLENT LESSON అన్నారు మావో.బెతూన్ అంతిమయాత్రబెతూన్ మృతదేహాన్ని తీసుకుని సైనికులూ, పార్టీ కామ్రేడ్స్ మంచు కప్పిన కొండల గుండా ఒక వూరేగింపుగా నాలుగు రోజులు నడిచి వెళ్లారు.
షాన్సి అనే ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. కెనడా జెండా లేకపోవడ వల్ల అమెరికా జాతీయ పతాకాన్ని బెతూన్ మీద కప్పి, ఖననం పూర్తి చేశారు. 1952లో బెతూన్ అస్తికలను సేకరించి రాజధాని బీజింగ్‌కి 300 కి.మీ దూరంలోని విప్లవవీరుల శ్మశానవాటికకు తరలించారు. దానికి దగ్గర్లోనే బెతూన్ అంతర్జాతీయ శాంతి ఆస్పత్రి నిర్మించారు. అందులోనే బెతూన్ స్మారక మందిరం వుంది. ప్రతీయేటా వేలమంది దానిని సందర్శిస్తూ వుంటారు.
LAST WORDS న్యూయార్క్ శానిటోరియంలో చనిపోతాననే దిగులుతో, ఒక మ్యూరల్ కింద బెతూన్ రాసిన కవిత ఇది:Sweet death, thou kindest angel of them allIn thy soft arms, at last, O, let me fallBright stars are out, long gone the burning sunMy little act is over and the tiresome play is done.
కష్టాల్లోవున్న ఇతరుల సహాయం చేయడమే జీవితానికి అర్థం అని .. బెతూన్ ఆదర్శం మనకి చెబుతోంది. ఎక్కడి కెనడా? ఎక్కడి చైనా? త్యాగం కాగడా అయి వెలిగిన జీవితం వేలమందికి ప్రాణదానం చేసింది.
Read also నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది…