లంకేశుడంటే మక్కువ ఎక్కువ !

Sharing is Caring...

రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడిన ధీశాలి. మహా శివభక్తుడు. ఈ పాత్రను తనదైన ప్రత్యేక శైలితో నటించి ప్రేక్షకుల,విమర్శకుల ప్రశంసలు పొందారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ రావణబ్రహ్మ అనగానే మనకి ‘భూకైలాస్’ (1958), ‘సీతారామ కల్యాణం’ (1961) చిత్రాల్లోని పాత్రలు గుర్తుకొస్తాయి. రెండు సినిమాల్లో ఎన్టీఆర్ అదర గొట్టేసారు. రావణుడి పాత్రలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. రెండు సినిమాల్లో కథ వేరే అయినప్పటికీ రావణుడి చుట్టూనే కథ నడుస్తుంది. ప్రతినాయక లక్షణాలు కనిపించవు.

సీతారామ కళ్యాణం లో అయితే హీరో రావణాసురుడా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆపాత్రను అలా మలిచారు. ఆసినిమాకు ఆయనే దర్శకుడు. రచయిత సముద్రాల మాస్టారు. వారిచేత తనకు కావాల్సిన విధంగా ఆ పాత్రకు డైలాగ్స్ కూడా రాయించుకున్నారు. ఆంగిక, వాచికాభినయాలలో ఎన్టీఆర్ సాటిలేని మేటి కాబట్టి రావణుడి పాత్ర తెరపై అద్భుతంగా వచ్చింది.

భూకైలాస్ లో రావణుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. సీతారామ కళ్యాణం లో కూడా లంకేశుడు గ్లామరస్ గా ఉంటారు. దానవీరశూర కర్ణ లో దుర్యోధనుడిని గ్లామరస్ గా చూపెట్టారు. డ్యూయెట్ కూడా పెట్టేసారు.”కథానాయకుడి వేషాలే వేయడం చాలామందికి గొప్ప. కాని ప్రతినాయకుడి పాత్రలను కూడా మంచి వాటిగా మలిచి జనాదరణ పొందింది ఒక్క ఎన్టీఆరే” అని ఆరోజుల్లో నటుడు అక్కినేని ఎన్టీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.

అప్పట్లో చాలామంది పౌరాణికాలపై పట్టున్న దర్శకులు కూడా ఎన్టీఆర్ సాహసాన్ని విమర్శించలేదు. దర్శకుడు కేవీ రెడ్డి ని ముందు దర్శకుడుగా పెడదామని ఎన్టీఆర్ అనుకున్నారు. కేవీ రెడ్డి తో మాట్లాడారు.అయితే ఆయన ‘”నిన్ను కృష్ణుడిగా చూసాను . అదే కంటితో రావణుడి గా చూడలేను … కాబట్టి మరో దర్శకుడిని చూసుకో”మన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తానే సీతారామ కల్యాణానికి దర్శకత్వం వహించారు.

చిత్ర పరిశ్రమలో రావణ, దుర్యోధన వంటి ప్రతి నాయక పాత్రలు ధరించి అందరి మెప్పూ పొందిన ఏకైక నటుడు రామారావు ఒక్కరే. శ్రీ రామ పట్టాభిషేకంలో రాముడు, రావణుడు రెండూ ఎన్టీఆర్ తనే చేశారు. రావణ పాత్ర మీద తనకున్న ప్రత్యేక ఇంట్రస్ట్ ను మరోసారి చాటుకున్నారు.

రామ రావణ యుద్దానికి రాముడి విజయాన్ని ఆకాంక్షిస్తూ…రావణుడే ముమూర్తం పెట్టడం. లక్ష్మణుడికి రావణుడు రాజనీతి బోధించడం లాంటి సన్నివేశాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నా… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన ధైర్య శాలి మాత్రం రామారావే.

రావణుడు పెట్టిన ముహూర్తబలం వల్లే రాముడు యుద్దం గెల్చాడని ఆడియన్స్ కన్విన్స్ అయ్యే లా దృశ్యాలు నడుపుతారు రామారావు. రావణుడి గొప్పతనాన్ని సాక్షాత్తు రాముడితోనే చెప్పిస్తాడు. రావణుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ మండోదరితో ఓ పాట కూడా పాడించారు. ఇవ‌న్నీ ఒకెత్తైతే శూర్ప‌ణ‌ఖ ముక్కుచెవులు క‌త్తిరించిన సంఘ‌ట‌న‌కు స్పందిస్తూ రావ‌ణుడు చెప్పే డైలాగులు … కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి.

ఆ ముని మ్రుచ్చుల ప్రేర‌ణ‌తో మా ద్ర‌విడ జాతిని నాశ‌నం చేయ‌డానికి ఆర్య జాతి చేస్తున్న ముష్క‌ర ప్ర‌య‌త్నంగా అభివ‌ర్ణిస్తాడు. పౌరాణిక పాత్రల్లో రావణ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ ఎక్కువ శ్రమించారు. అందుకు తగిన ఫలితాలను అందుకున్నారు.

రావణ పాత్రని తీగెల వేంకటేశ్వర్లు (సీతా కల్యాణము – 1934), మునిపల్లె సుబ్బయ్య (సతీ సులోచన – 1936), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (మైరావణ – 1939), ఎం.వి. సుబ్బయ్యనాయుడు (భూకైలాస్ – 1940), రాజనాల (మైరావణ – 1964), కైకాల సత్యనారాయణ (సీతా కల్యాణం – 1976), నాగబాబు (శ్రీరామదాసు – 2006)లో వంటి నటులు పోషించారు.వారెవరికీ ఎన్టీఆర్ కొచ్చిన పేరు రాలేదు.

నటుడు మోహన్ బాబు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావణ బ్రహ్మ పేరిట సినిమా తీస్తానని పదేళ్ల క్రితం ప్రకటించారు. కానీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం చేసే ఆలోచనలో లేరని పరిశ్రమ వర్గాల సమాచారం.

(కొంత సమాచారం రంగవజ్జల భరద్వాజ గారి ఆర్టికల్స్ నుంచి తీసుకోవడంమైనది)

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!