ఎన్టీఆర్ పౌరోహిత్యం నెరపిన పెళ్లి !

Sharing is Caring...

ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవకోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ తనకు సన్నిహితులైన వారి ఇళ్లలో జరిగే ముఖ్యమైన కార్య క్రమాలకు మాత్రమే హాజరవుతారు.

నాగభైరవ కోటేశ్వరరావు చేత  ఎన్టీఆర్ “బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమాకు మాటలు రాయించారు. ఆ సందర్భంగా కవి గారితో స్నేహం కుదిరింది.ఎన్టీఆర్ రచయితలతో మొదటినుంచి సన్నిహితంగా ఉండేవారు. సీనియర్ సముద్రాల గారితో  చాలా సఖ్యంగా ఉండేవారు. ఆయన సూచనమేరకే “సీతారామ కళ్యాణం” సినిమా తీశారు.

పౌరాణిక కథలపై సముద్రాల వారికీ మంచి పట్టు ఉంది . తన భావాలను ఆయనకు చెప్పి ఎన్టీఆర్ అందుకు అనుగుణంగా సినిమా స్క్రిప్ట్ రాయించుకునే వారు. రావణుడు రామాయణంలో ప్రతి నాయకుడు అని మనకు తెల్సిందే. కానీ ఆ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా మౌల్డ్ చేస్తూ, రావణుడే ప్రధాన పాత్రగా ఎన్టీఆర్  ” సీతారామ కళ్యాణం ” తీశారు. 

ఆతర్వాత దుర్యోధనుడి పాత్ర ను  హైలైట్ చేస్తూ “దానవీర శూరకర్ణ” తీశారు. కర్ణ సినిమాకు కొండవీటి వేంకటకవి చేత  స్క్రిప్ట్ రాయించారు. ఆయన తో కూడా ఎన్టీఆర్ సన్నిహితంగా  ఉండేవారు. కొండవీటి వేంకటకవి  చేత వరుసగా మూడు సినిమాలకు స్క్రిప్ట్ రాయించుకున్నారు. అందులో కర్ణ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే “బ్రహ్మర్షి విశ్వామిత్ర”కు నాగభైరవ కోటేశ్వరరావు గారిచేత డైలాగ్స్ రాయించారు. దాదాపు మూడు నెలలు ఎన్టీఆర్  ఆయనతో కలసి పని చేశారు. అలా వారిద్దరికీ పరిచయం. నాగభైరవ కోటేశ్వర రావు గారి  ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ అలా ఆ పెళ్ళికి వచ్చారు. 

ఆరోజు ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున జనం కూడా వచ్చారు. అందరూ ఎదురు చూస్తుండగానే  ఎన్టీఆర్ పెళ్లి మండపం లోకి వచ్చారు . వస్తూనే నాగభైరవ గారి చెవిలో ఏదో చెప్పారు. ఆయన వెళ్లి వేదికపై ఉన్న పురోహితుడు కి ఏదో చెప్పారు. ఆయన సీన్ లో నుంచి పక్కకు తప్పుకున్నారు.

ఎన్టీఆర్ మైక్ అందుకుని ” సంస్కృతంలో ఉండే పెళ్లి మంత్రాల అర్ధం వీరికి తెలీదు . వాటి అర్ధం వివరించి నేనే ఈ పెళ్లి జరిపిస్తాను” అని ప్రకటించారు. జనం అంతా ఏమిటీ చిత్రం అని ఆశ్చర్యపోయారు. వారు అలా చూస్తుండగానే భార్యాభర్తల అన్యోన్యత , దాంపత్యం గురించి వివరించే పెళ్లి మంత్రాల గురించి ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడుతూ వివరించారు. 

త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన  “వివాహ విధి “గ్రంధం ఆధారంగా నాడు ఎన్టీఆర్ పెళ్లి మంత్రాల అర్ధాన్ని వివరిస్తూ వధూవరుల చేత ప్రమాణాలు చేయించారు. ఒక పురోహితుడి మాదిరిగా పెళ్లి తంతు మొత్తం జరిపించేసారు. ఆరోజు ఆ పెళ్లి కి వెళ్లిన అప్పటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఏవీఎస్ ఈ వార్తను కవర్ చేశారు.

తర్వాత ఏవీఎస్ సినిమా రంగంలోకి ప్రవేశించి హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తీసిన “శ్రీనాథ కవి సార్వభౌముడు”  చిత్రం లో ఏవీఎస్ ఒక పాత్రలో కూడా నటించారు. అపుడు ఏవీఎస్ ఈ పెళ్లి  విషయాన్నీ, తాను న్యూస్ కవర్ చేసిన సంగతిని  ఎన్టీఆర్ కి గుర్తుచేశారట.  ఎన్టీఆర్ ఆనాటి సంగతులను తలచుకుని సంతోషపడ్డారట. ముఖ్యమంత్రి హోదాలో మరెవరు ఇలాంటి పనులు చేయలేదు . అది ఒక్క ఎన్టీఆర్ కె చెల్లింది. ఎన్టీఆర్ అలా పెళ్లి చేయడం అదే మొదటి సారి … అదే ఆఖరిసారి. 
 
(దివంగత మిత్రుడు,నటుడు  ఏవీఎస్ ఎపుడో  చెప్పిన విషయాలు ఆధారంగా )

————— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు October 29, 2020
error: Content is protected !!