సీక్వెల్ కాదు ..కానీ చూడొచ్చు !

Sharing is Caring...

‘మనీ మనీ’ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ క్రియేషన్స్ బ్యానర్ పై తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై హిట్ అయిన ‘మనీ’ సినిమాకి అది సీక్వెల్. ‘మనీ మనీ’ సినిమా ను కృష్ణవంశీ డైరెక్ట్ చేసినప్పటికీ తన పేరు వద్దనడంతో టైటిల్స్ లో ‘మనీ’ సినిమా దర్శకుడైన శివనాగేశ్వరరావు పేరు వేశారు.

ఇక ‘మనీ మనీ మోర్ మనీ’ సినిమా(2011) టైటిల్ చూసి ఇది కూడా ఆసినిమాలకు సీక్వెల్ అనుకుంటారు ఎవరైనా. ఖాన్ దాదా, చక్రి అనే రెండు క్యారెక్టర్లను మాత్రమే తీసుకుని స్టోరీ తయారు చేసుకున్నాడు జె డి చక్రవర్తి. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలకు దీనికి ఏ మాత్రం పోలిక లేదు.

ఇది జెడి హిందీ లో తీసిన ‘దర్వాజా బంద్ రఖో’ కి  రీమేక్. అలాగే హాలీవుడ్ సినిమా ‘అటాక్ ది గ్యాస్ స్టేషన్’ ప్రేరణతో రాసుకున్నకథ. తెలుగులో కూడా చక్రవర్తే డైరెక్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నలుగురు నిరుద్యోగ యువకుల (జెడి చక్రవర్తి, బ్రహ్మాజీ, కెవిన్ దేవ్, ముకుల్ దేవ్) చుట్టూ కథ తిరుగుతుంది. ఈజీగా  డబ్బు సంపాదించడానికి ఒక ధనవంతుని కుమార్తెను కిడ్నాప్ చేస్తారు.

దివాళా తీసిన  రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాన్ దాదా (బ్రహ్మానందం) ఇంట్లోకి కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకొస్తారు. ఇక అక్కడ నుంచి ఆ ఇంటికి వచ్చిన వాళ్లందరిని బంధిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

త్రిష సేల్స్ గర్ల్ (గజాల),శంకర భరణం పిజ్జా గై (వేణు మాధవ్),కానిస్టేబుల్ (రాజీవ్ కనకాల), ఫైనాన్షియర్ శెట్టి (జీవా) పాత్రల్లో బాగానే నటించారు. ఆయా నటులకు నటించేందుకు పెద్ద స్కోప్ లేదు. తారా అలీషా ను గ్లామర్ డాల్ గా వాడుకున్నారు.

కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగుంది. రచయిత మరుధూరి రాజా సంభాషణలు చాలా వరకు గిలిగింతలు పెడతాయి. మంచి డైలాగులే పడ్డాయి. బ్రహ్మానందం కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. క్లైమాక్స్ లో తుపాకీ తన చేతికి దొరినపుడు అందరిని బెదిరించే సన్నివేశాలలో కామెడీ బాగుంది.

రమాప్రభ ఇంగ్లీష్ అర్ధం కాక బ్రహ్మి తల గోడకేసి కొట్టుకునే సన్నివేశాలు బాగా పండాయి. పశువుల డాక్టర్ కామెడీ ఆకట్టుకుంటుంది. కథ పవర్ ఫుల్ గా లేకపోవడం,సాగ దీత అనిపించడంతో మధ్యలో సినిమా కొంత బోర్ అనిపిస్తుంది.

సినిమా మొత్తం ఒకే లొకేషన్ లో సాగుతుంది. చక్రవర్తి .. బ్రహ్మాజీ  పెర్‌ఫార్మెన్స్‌బాగుంది. గజాల బ్రహ్మాజీల మధ్య చిన్న రొమాన్స్ వెరైటీ గా ఉంటుంది. వేణు మాధవ్ చాలా కష్టపడి నవ్వించాడు. కెవిన్ దేవ్ ఆ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. స్టోరీ లైన్ చాలా వీక్…ఒక్కొక్కరిని బంధించే సన్నివేశాలను ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు.  

సినిమాలో బ్రహ్మి పాత్రకు ఖాన్ దాదా పేరు అనవసరంగా పెట్టారు. ఆ క్యారెక్టర్‌కి బ్రహ్మి పాత్ర స్వభావానికి పోలిక లేదు.మరి అంత అధ్వాన్నపు సినిమా కాదు కానీ చూడొచ్చు. సంగీత దర్శకుడు చక్రి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. చక్రవర్తి డైరెక్షన్ అంత గొప్పగా ఏమీలేదనే చెప్పుకోవాలి. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్ళు చూడొచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!