మధ్య మహేశ్వరుడి ని దర్శించడం కష్టమే!

Sharing is Caring...

This is one of the Panch Kedara temples………………….

“మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు.

పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి.  ఇక్కడ శివలింగం నాభి ని పోలి ఉంటుంది. భక్తులు యాత్రకు వెళ్ళినపుడు కేదారనాథ్, మధ్యమహేశ్వర్,తుంగనాథ్ ,రుద్రనాథ్ ,కల్పేశ్వర్ ఆలయాలను తప్పనిసరిగా దర్శిస్తారు. ఇవన్నీ శివుని ఆలయాలు. ఈ ఆలయాల చుట్టూ ఏదో దైవ శక్తి ఉన్నట్టు భక్తులు చెబుతుంటారు. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి అందాలు యాత్రికులను అబ్బురపరుస్తాయి.

ఈ పంచ కేదార ఆలయాలను  పాండవులు నిర్మించారని అంటారు. అందుకు సంబందించిన కథనమొకటి ప్రచారంలో ఉంది. మహాభారతం యుద్ధం తర్వాత కృష్ణుని సలహామేరకు పాపకర్మల నుంచి విముక్తులు అయ్యేందుకు శివుడిని దర్శించాలని పాండవులు అక్కడికి వస్తారు.

మహాభారత యుద్ధం తో సంభవించిన వినాశనం మూలంగా శివుడు కలత చెంది పాండవులకు కనిపించకుండా ఎద్దు రూపంలో సంచరిస్తుంటాడు. భీముడు శివుణ్ణి గుర్తించి వెంటపడతాడు. అతగాడి నుంచి తప్పించుకోవడానికి శివుడు తన శరీరాన్ని ఐదు ముక్కలు గా విభజిస్తాడు. అవి ఐదు ప్రాంతాల్లో వెళ్లి పడతాయి. ఎద్దు రూపం లో  ఉన్న శివుని జుట్టు కల్పేశ్వర్ వద్ద , ముఖం రుద్రనాథ్ వద్ద , మొండెం మధ్య మహేశ్వర్ వద్ద , మూపురం కేదార్నాథ్ వద్ద, నాలుగు కాళ్ళు తుంగనాథ్ వద్ద పడ్డాయట.

దీంతో భయపడిపోయిన పాండవులు శివుడిని ప్రార్ధిస్తారు.  శివుడు కరుణించి దర్శనమిచ్చి ఆ ఐదు ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించమని … పాపాల నుంచి పరిహారం పొందమని సూచించారట. శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఐదు ఆలయాలను పాండవులు నిర్మించారు. భీముడు ఈ ఆలయాన్ని కట్టించారు. పాప పరిహారం .. మోక్షం కోరుకునే వారు ఈ ఐదు దేవాలయాలను దర్శిస్తారు.

మధ్యమహేశ్వర్ కు  విమానం ద్వారా డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం  చేరుకోవాలి. అక్కడ నుంచి కార్లలో వెళ్ళవచ్చు. లేదా హరిద్వార్ వరకు రైలులో చేరుకొని అక్కడనుంచి ఊఖిమత్ వరకు క్యాబ్స్ లో వెళ్ళవచ్చు. ఊఖిమత్ నుంచి రాన్సి చేరుకున్నాక  ఆలయం వరకు 16 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి.  లేదా గుర్రాలపై వెళ్ళవచ్చు. 

బంటోలి నుంచి ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. రాన్సి లో హోటల్స్ ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవచ్చు.ఈ పర్యటన మొత్తం ఆహ్లదకరంగా ఉంటుంది.  ఫిబ్రవరి, మార్చి మాసాల్లో యాత్ర బాగుంటుంది. నడక అలవాటు లేని వారు, ఆరోగ్యం సరిగ్గా లేని వారు  వెళితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఫిట్ నెస్ ఉండి.. నడక అలవాటు ఉన్నవారు ఈజీగా వెళ్ళవచ్చు. వాతావరణాన్ని బట్టి .. నడిచే వేగాన్ని బట్టి రెండు, మూడు రోజుల్లో మద్య మహేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. మధ్య మహేశ్వర్ లో రెస్ట్ రూమ్స్, భోజనం అందుబాటులో ఉంటాయి.. స్థానికులు సమకూరుస్తారు. 

———— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!