డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !

Sharing is Caring...

డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !  అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు.  పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి పట్టుకుని చూసేవారు లేరు.

90 దశకంలో మా ఆవిడకు  చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చింది. ఒక పెద్ద హోస్పిటల్ కు తీసుకెళ్ళాను. అన్ని టెస్టులు చేశారు. చివరికి కొన్ని టాబ్లెట్స్ రాశారు. అవి వాళ్ళ హాస్పిటల్ ఫార్మసీ షాప్ లోనే  దొరుకుతాయి. వెళ్లి కనుక్కొంటే ఒక రకం టాబ్లెట్ ధర 20 రూపాయలు .. మరోరకం టాబ్లెట్ ధర 13 రూపాయలు అన్నారు. రోజుకి అవి రెండు … ఇవి రెండు టాబ్లెట్స్ వాడాలి. అంటే రోజుకి 66 రూపాయలు ఖర్చుపెట్టాలి.  అంటే సుమారుగా నెలకు 2000 ఖర్చు పెట్టాలి. అప్పటి నా జీతంలో సగమన్నమాట.  ఒక పది రోజులకు సరిపడా టాబ్లెట్స్ తీసుకున్నాను. పది రోజుల తర్వాత మళ్ళీ కనబడమన్నారు.

మళ్ళీ వెళ్లి కలిసాం. మళ్ళీ టెస్టులు రాశారు .. మరో వెయ్యి వదిలించారు. ఇప్పుడైతే 10 వేలు అవుతాయి. అంతకు ముందు రాసిన టాబ్లెట్స్ మళ్ళీ రాశారు. అపుడే డాక్టర్ ను “ఈ టాబ్లెట్స్ చాలా ధర ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తక్కువ ధరలో ఉండేవి రాయగలరా ?”అని నసుగుతూ అడిగాను. అతగాడు నాకేసి  అదో మాదిరి గా చూసాడు. “ఇష్టమైతే వాడండి .. లేకుంటే లేదు “అన్నాడు. ఆ మాట కొంచెం కటువుగా నే ఉంది. ఎందుకడిగానా ? అనిపించింది. మా ఆవిడకు అర్థమైంది. మొత్తం ఇరవై రోజులు టాబ్లెట్స్ వాడినప్పటికీ సుగుణం కనిపించలేదు.

పది రోజులయ్యాక వనస్థలిపురం లో ఒక ఆయుర్వేద డాక్టర్ ని కలిసాం. ఆయనకు మంచి పేరుంది. ఫీజు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. విషయం మొత్తం చెప్పాను. ఆయనే ఒక హార్ట్ స్పెషలిస్ట్ ని పిలిపించాడు. ఆయన పాత మందుల చీటీ చూసాడు. పేషంట్ ను పరీక్షించాడు. టాబ్లెట్స్ రాసిచ్చాడు. ఆయనకు ఫీజు 50 ఇచ్చినట్టు గుర్తు. ఆయన రాసిన టాబ్లెట్స్ మూడు రోజులు వాడగానే ఆవిడకు సుగుణం కనిపించింది. నెలరోజుల తర్వాత మామూలు మనిషి అయింది. ఆయన రాసిన టాబ్లెట్ ధర 20 పైసలే.  డాక్టర్ కి డాక్టర్ కి ఎంత వ్యత్యాసముందో చూసారా ? మంచి మందులు తక్కువ ధరల్లో దొరుకుతాయి.  పెద్ద హాస్పటల్స్ లో అవి రాయరు.

2015 లో మా ఆవిడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కొన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. దాదాపుగా లాస్ట్ స్టేజి లో ఉంది. అప్పటికే మా అమ్మాయి MBBS పూర్తి చేసింది.తను చెప్పేసింది మనం ఇక ఆశ వదులు కోవడమే అని. ఆ సమయంలో ఒక డాక్టర్  మా దగ్గరికి వచ్చాడు. పేషంట్ కి సిలిండ్రికల్ ట్రీట్మెంట్ చేద్దామని అన్నాడు. రోజుకి ఒక లక్ష ఖర్చు అవుతుందని చెప్పాడు. ఒకసారి ట్రీట్మెంట్ మొదలు పెడితే కనీసం అయిదారు రోజులు పడుతుందని .. మధ్యలో ఆపలేమని అన్నాడాయన. ట్రీట్మెంట్ చేస్తే గ్యారంటీ ఏమైనా ఉంటుందా అని అడిగాను. ‘లేదు’ అన్నాడు. మా అమ్మాయి కూడా పరిచయం చేసుకుని ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడింది. ఆ తరువాత ఆయన నాతో అన్నాడు. “మీ స్థానం లో నేనుంటే ఈ ట్రీట్మెంట్ కి ఒప్పుకోను” అనేసి వెళ్ళిపోయాడు. ఇండైరెక్టుగా ఆయన హింట్ ఇచ్చి వెళ్ళాడు. అతగాడి మనసులో ఏదో మూల కొంత మానవత్వం ఉంది. కొంత భయం ఉంది. అందుకే కాబోలు అలా చెప్పేసి వెళ్ళాడు అనుకున్నాను.కాబట్టి డాక్టర్లందరూ కమర్షియల్ అని తీర్మానించలేము. పెద్ద ఆసుపత్రులన్నీ దోపిడీ చేస్తాయని చెప్పలేం. 

————–KNMURTHY    

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!