Nobel Peace Prize for Women’s Rights Activist…………………………….
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize).. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మది (Narges Mohammadi)ని వరించింది.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మానవ హక్కుల కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నర్గిస్.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
ఈ ఏడాది ఈ పురస్కారం కోసం మొత్తం 351 నామినేషన్లు నార్వే నోబెల్ కమిటీకి అందాయి. ఇందులో 259 మంది వ్యక్తులు కాగా.. 92 సంస్థల పేర్లున్నాయి.సంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్ లాంటి దేశంలో పుట్టిన నర్గిస్.. చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కుల కోసం పోరాటం మొదలెట్టారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆమె కొంతకాలం పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ తొలిసారి అరెస్టయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత డీహెచ్‌ఆర్‌సీలో చేరినందుకు గానూ మరోసారి అరెస్టయ్యారు.
2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్టు చేసి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన ఆమె.. ఇరాన్‌లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రపంచంలోనే ఏటా అత్యంత ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేపట్టారు. దీంతో 2015లో మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నర్గిస్ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. అక్కడ కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో జైలు అధికారులు ఆమెకు కఠిన ఆంక్షలు విధించారు. ఆమె ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకుండా, కలవకుండా నిషేధం విధించారు.
2022 సెప్టెంబరులో హిజాబ్ ధరించనందుకు మాసా అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనూ నర్గిస్ తన గళాన్ని వినిపించారు.
అంతేకాదు.. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ తదితర పత్రికల్లో వచ్చాయి. అంతకు ముందు కూడా నర్గిస్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి. 51 ఏళ్ళ నర్గిస్ కు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆ ఇద్దరూ కవలలు.