సిమ్ డీ యాక్టీవేట్ చేసి బ్యాంక్ లో సొమ్ము దోపీడీ !!

Sharing is Caring...

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగి పోతున్నాయి.  ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. పలు అక్రమవైబ్‌సైట్లు,టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హెూల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి.

అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు….  అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్ లో వన్ టైమ్ పాస్‌వర్డ్  ద్వారా రెండు రకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

బాధితుల సెల్ ఫోన్ సిమ్ ను  డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని యాక్సెస్ చేస్తున్నారు. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్ తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు.

తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడికి  ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. లేకపోతే కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

అక్రమ వెబ్‌సైట్లు టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్‌సైట్లు , టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి.
సిమ్ కార్డు డి యాక్టీవేట్ అయినట్టు  తెలియగానే .. సర్వీస్ ప్రొవైడర్సైను ..పోలీస్ అధికారులను సంప్రదించండి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!