కాఫీ మేలు చేస్తుందా ?

Sharing is Caring...

Dr. Yanamadala Murali Krishna……………………………………………

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రతి రోజు దాదాపు 200 కోట్ల కాఫీ కప్పులు తాగుతుంటారు. కాఫీ గురించి అనేక రకాలైన చర్చలు ఉన్నాయి. కొందరు కాఫీ మేలని, మరికొందరు ఆరోగ్యానికి హాని అని అంటుంటారు. సుదీర్ఘ కాలం పరిశోధన తర్వాత కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఒక పదార్థం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే విషయంలో దాని యొక్క మోతాదు ప్రధానమైనది అని అందరికీ తెలిసిందే.

ఆహారం కూడా అందరికీ ఏకరీతిగా ఉపయోగపడదు అనేది తెలిసిందే. ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకునే పాలు… లాక్టోజ్ ఇంటోలరెన్స్ వున్న కొంతమందికి సరిపడవు. అదేవిధంగా కొద్దిమందికి కాఫీ కూడా పడకపోవచ్చు. కాఫీలో ఉండే కెఫీన్ రసాయనం మెదడును ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది.

కెఫీన్ గురించి జరిగినంత చర్చ కాఫీలో ఉండే మిగతా రసాయనాల గురించి జరగలేదు. కాఫీ అనేది ఒక బెర్రీ. ఇథియోపియాలో వేలాది సంవత్సరాలుగా ప్రార్థన సమయాల్లో కాఫీ గింజలను నూరి వాటి కషాయాన్ని తాగుతూ ఉండే వారు. 18వ శతాబ్దంలో యూరోప్ లోకి ప్రవేశించిన కాఫీ అనతికాలం లోనే గొప్ప ప్రాచుర్యం పొందింది. అప్పటివరకు ఉదయపు ఆహారంలో తీసుకునే బీరు, వైను స్థానాన్ని కాఫీ ఆక్రమించింది.

ఒక కప్పు కాఫీలో ఉండే పీచు పదార్థం ఒక బత్తాయిలో ఉండే పీచు – ఫైబర్ పరిమాణానికి సమానం. రోజుకి మనిషికి అవసరమైన దానిలో మూడోవంతు ఫైబర్. పీచు పదార్థం మానవుని ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని పెద్ద ప్రేవుల్లో ఉండే ఉపయోగకర బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దాంతో ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే అనేక పోషక పదార్థాలు మానవుని ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పెద్ద ప్రేవుల్లో వుండే ఉపయోగకర బాక్టీరియా (గట్ ఫ్లోరా) వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ)లో కీలకం.

అలాగే కాఫీలో పోలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పోలీఫినాల్స్ మూలంగానే కాఫీకి రుచిలో చేదు, గమ్మత్తయిన వాసన, ముదురు రంగు వచ్చాయి. ఇవి ఆ వృక్షజాతి చీడపీడల బారిన పడకుండా కాపాడుతాయి. విచిత్రంగా ఇవే లక్షణాలు మనిషికి ప్రీతిపాత్రమైనవి.

కాఫీ తాగడం వ్యసనంగా మారే అవకాశం లేదు. కాఫీ ప్రాణాలను తీస్తుంది అని చెప్పడం కూడా అర్థం లేనిది. 150 కప్పుల కాఫీ తాగితే ప్రాణాపాయం కలుగుతుంది. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో కాఫీ తాగడం అసాధ్యం కదా. కాఫీ ఎంతవరకు సురక్షితం అనే దానిపైన విస్తృతమైన పరిశోధనలు, పరిశీలనలు జరిగాయి. 300 మిల్లీగ్రాముల కెఫీన్ వరకు కాఫీ వల్ల ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

ఆపైన తాగితే పెద్దగా ప్రయోజనాలు ఉండవు అని, కొంత వరకు ఇబ్బందులు కూడా ఉండవచ్చునని తెలిసింది. ఐదు కప్పుల కాఫీలో 300 మిల్లీగ్రాములు కెఫీన్ ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కాఫీ తాగడం వల్ల నిద్ర రావడానికి కొందరిలో మాత్రమే ఆలస్యం జరుగుతుంది. ఎక్కువ శాతం మందిలో కాఫీ నిద్రకు ఏమాత్రం భంగం కలిగించదు. కాఫీ మూత్రవర్థకం (డైయురెటిక్) గా పనిచేస్తుంది అనేది నిజం కాదు.

కొద్ది శాతం మందిలో మాత్రం, మూత్రపు సంచి (యూరినరి బ్లాడర్) ని కొంత ప్రేరేపితం చేస్తుంది. అటువంటి వారు ఒకటికి రెండుసార్లు మూత్రవిసర్జనకు వెళ్తారు. అయితే మొత్తం విసర్జించిన మూత్రపు పరిమాణంలో మాత్రం పెరుగుదల ఉండదు. అందువల్ల కాఫీ సేవించడం మూలంగా డీహైడ్రేషన్, నిస్సత్తువ రాదు.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ కాఫీ తాగడం మూలంగా గుండె జబ్బులు మరణాలు పెరుగుతాయని భావించేవారు. అదేవిధంగా గుండెలయ తప్పే (ఎరిత్మియా) అవకాశం హెచ్చుతుందని భావించారు. ఇటీవలి అధ్యయనాలలో క్రమం తప్పకుండా కాఫీ తీసుకునేవారిలో గుండెజబ్బులు తగ్గినట్లుగా గుర్తించారు. వాస్తవానికి కాఫీ అధికంగా సేవించే వాళ్ళల్లో పొగ – లిక్కర్ తాగే వాళ్ళు, శారీరిక శ్రమ చేయని వాళ్ళు ఎక్కువ మంది. వీరిని గురించిన అధ్యయనాల్లో కాఫీ తాగి వాళ్ళ లో గుండె జబ్బులు మరణాలు ఎక్కువ అని తేలింది.

అయితే అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్’ నిర్వహించిన అతిపెద్ద పరిశోధనలో కాఫీ తప్ప ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఏ ఇతర అలవాటు లేని వాళ్ళను సంవత్సరాల తరబడి పరిశీలించారు. నాలుగు లక్షల మందిని రెండున్నర సంవత్సరాల పాటు, లేదా రెండు లక్షల మందిని ఐదు సంవత్సరాలపాటు చూస్తే… 10 లక్షల కాఫీ తాగే సంవత్సరాలు అంటారు. వివిధ రకాలుగా 50 లక్షల కాఫీ సేవన సంవత్సరాలను విశ్లేషించారు.

దీనిలో కాఫీ తాగే వారిలో అన్ని రకాల మరణాలు స్త్రీలలో 15 శాతం, పురుషులలో 10 శాతం మేరకు తగ్గినట్టుగా గుర్తించారు. కాఫీ తాగే వారిలో గుండె పోటు, పక్షవాతం, డయాబెటిస్, అధిక రక్తపోటు, పార్కిన్సన్స్ (వృద్దాప్యపు వణుకు) వంటి జబ్బులు అన్నీ తక్కువగా తలెత్తాయి. ఆ మేరకు మరణాలు తగ్గాయి.

కాఫీ డికాక్షన్ లో పాలు చేర్చడం మూలంగా దానిలో ఉండే మంచి లక్షణాలు చెడిపోవు. అనగా బ్లాక్ కాఫీ అయినా, పాలతో కలిపిన కాఫీ అయినా ప్రయోజనం ఒక్కటే. అయితే పాలు కలపడం వలన అదనపు కేలరీలు చేరతాయి. రోజుకు మూడు కప్పులకు మించకుండా కాఫీ తాగడం మనిషి తనకు తాను ఆరోగ్య విషయంలో చేసుకోగల గొప్ప మేలు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!