Nature lover………………………………….
ప్రకృతి అంటే అతగాడికి మహా ఇష్టం. ఎపుడూ కొండలు ..కోనలు .. అడవుల్లో తిరుగుతుంటాడు. పూర్తిగా అతను ప్రకృతి తో మమేకమై పోయాడు. నిత్యం ప్రకృతిలోకి వెళ్లడం అక్కడ మూలికలు .. ఆకులు .. ఇతర దినుసులు తీసుకొచ్చి వైద్యం కూడా చేస్తుంటాడు. అతగాడి పేరు కొమెర జాజి. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని కారంపూడి గ్రామం జాజిది. ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అంతా అతనికి కరతలామలకం.
ఏ దారిలో వెళ్ళాలి .. ఎటు వెళితే ఏమొస్తుంది ? ఏ చెట్టు ? ఏ పుట్ట ఎక్కడుంది అనే విషయాలు బాగా తెలుసు. మధ్యలో ఉన్న గిరిజన గ్రామాలు కూడా చూసి వస్తుంటాడు. అక్కడి పిల్లలకు .. పెద్దలకు జాజి బాగా తెలుసు. వెళ్లిన వాడు ఊరకనే రాడు. తనకు తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకుంటాడు. పిల్లలను కాసేపు ఆడిస్తాడు. జాజి నిత్యకృత్యం అదే.
ఈ ప్రకృతి ప్రేమికుడు ఇటీవల ప్రకృతి పాఠశాల పేరిట కొత్త కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. ప్రకృతి ప్రాధాన్యతను పిల్లలకు వివరించడం. ప్రకృతి పట్ల వారికి అవగాహన కల్పించడం .. వారు ప్రకృతిని ప్రేమించేలా చేయడం…. అవే అతని కార్యక్రమ లక్ష్యాలు. ఇవన్నీ వినడానికి.. చెప్పడానికి సింపుల్ గా ఉన్నప్పటికీ.. వాటిని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. కానీ జాజి సంకల్పం గొప్పది.
ముందుగా ఒక ప్రకృతి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. కర పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. వెళ్లి స్కూల్ పెద్దలను కలుస్తున్నాడు. అనుమతి తీసుకుని పిల్లలకు పాఠం చెప్పినట్టే ప్రకృతి గురించి చెబుతున్నాడు. పనిలో పనిగా వనమూలికలు వాటి ఉపయోగాలు గురించి కూడా వివరిస్తున్నాడు. ఏపీ వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడమే జాజి ప్రాధమిక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో జాజి దూసుకుపోతున్నాడు.
గ్రామస్తులు జాజికి సహకరిస్తున్నారు. రైతులకు మేలు చేసే మొక్కలు గురించి చెబుతూ .. అవి మానవాళికి ఎలా ఉపయోగపడతాయో వివరించి వారితో మొక్కలు కూడా నాటిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగం గానే కొమెర జాజి కోటి మొక్కలు నాటించాలని సంకల్పించాడు. ప్రకృతి సంరక్షణ సేవా సంస్థ పేరు మీద ఒక ఎన్జీవో ను కూడా ప్రారంభించాడు.
కారంపూడి సమీపంలోని అడవిలో ప్రకృతి ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసాడు. అన్నట్టు జాజికి village life journey పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీని ద్వారా వనమూలికల గురించి వీడియోలు చేసి జనంలోకి తీసుకెళుతుంటాడు. వాటికి ఆదరణ కూడా బాగుంది. లక్షమంది చందాదారులున్నారు. అందుకు గాను యు ట్యూబ్ ఛానల్ వారు సిల్వర్ ప్లే బటన్ అవార్డు కూడా ప్రకటించారు.
ఈ జాజి అసలు పేరు అంకారావు. వయసు 38 ఏళ్ళు. వివాహితుడు.ఇద్దరు పిల్లలున్నారు. జాజి బీఏ వరకు చదువుకున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో డిప్లొమా చేసాడు. ప్రస్తుతం ఎమ్మే చేస్తున్నాడు. ఒక వైపు కుటుంబాన్ని పోషిస్తూనే మరోవైపు ప్రకృతి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 3వేల మంది పిల్లలకు అవగాహన కల్పించాడు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 300 పాఠశాలల్లో .. లక్ష మందికి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల ఆసియా వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు వనమూలికల సేకరణలో జాజి చేస్తున్నకృషికి మెచ్చుకుంటూ సన్మానం చేశారు. గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు.
జాజి తర్జని తో మాట్లాడుతూ “ప్రతి కుటుంబం తమ ఇంటిముందు లేదా ఇంటి వెనుక నాలుగైదు వనమూలిక మొక్కలను నాటితే భవిష్యత్తులో డాక్టర్ల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. తాను కలిసిన వారందరితో ఇదే చెబుతున్నానని .. తన ప్రచారంలో ఇదొక భాగమని వివరించారు. జాజి తన లక్ష్య సాధనలో విజయం సాధించాలని తర్జని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతోంది.
———-KNM