Thopudu Bandi Sadiq ………………………………
ప్రతిమనిషి జీవితంలో…స్కూల్ బ్యాగ్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.దానితో ముడిపడ్డ జ్ఞాపకాలు,అనుభూతులు జీవితాంతం పదిలంగా ఉంటాయి.ఏళ్ళు గడిచి పెద్దవాళ్ళం అయినా ఎక్కడైనా పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే బాల్యపు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరల్లా అలా మనసుని తాకి వెళ్తుంటాయి.స్కూల్ బ్యాగ్ తో నా బాల్యపు అనుభవాలు మీతో పంచుకోవాలని ఇక్కడ రాస్తున్నాను.
ఏడో తరగతి వరకు కూడా స్కూల్ బ్యాగ్ అనేది నా తీరని కల. పుస్తకాలు భుజం మీద పెట్టుకునే కిలోమీటర్ నడిచి బడికి వెళ్ళేవాణ్ణి.మూడేళ్ళ పాటు పోరితే అమ్మ సిఫార్సుతో మా నాన్న పాత కిట్ బ్యాగ్(రిజర్వ్ పోలీసులది) ఒకటి నా స్కూల్ బ్యాగ్ గా మారింది.అదేమో అవసరానికి మించి పెద్దగా ఉండేది.నా పుస్తకాలు పెట్టుకోగా ఇంకా బోలెడు ఖాళీ ఉండేది.ఆ ఖాళీయే…నా జీవితాన్ని మార్చేసింది.
అదే సంవత్సరం నాన్న కాన్సర్ తో మంచాన పడ్డాడు.ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు.వచ్చే సగం జీతం ఆయన వైద్యానికి సరిపోయేది కాదు.ఇల్లు గడవటం దుర్భరంగా మారింది.ఆ సమయంలోనే నా బ్యాగ్ నా ఆపద్బాంధవుడిగా మారింది.మా పెరట్లో రెండు జామచెట్లు,ఒక మునగచెట్టు ఉండేవి.పొద్దున్నే అమ్మ కొన్ని జామకాయలు కోసి బ్యాగ్ లో వేసేది.అవి తీసుకొని అరగంట ముందే బడికి వెళ్ళేవాణ్ణి.
గేటు బయట నిలబడి మా స్కూల్ పిల్లలకు అమ్మేవాణ్ణి. ఇంకొన్ని మిగిలేవి.వాటిని ఇంటర్వెల్ లో అమ్మేసేవాణ్ణి.నా ఇంటి పరిస్థితి తెలిసిన మా ప్రిన్సిపాల్ గారు,టీచర్లు దయతో నాకు జామకాయలు అమ్ము కోవటానికి అనుమతి ఇచ్చేవాళ్ళు.అలా రోజుకు రూపాయి,రూపాయిన్నర వరకు సంపాదించేవాణ్ణి.
మళ్లీ సాయంత్రం స్కూల్ అయ్యాక పుస్తకాలు బయట పెట్టి బ్యాగ్ లో ములక్కాయలు పెట్టుకొని కూరగాయల మార్కెట్ కు వెళ్లి అక్కడ అవి అమ్మేసి మరో రూపాయి వరకు సంపాదించేవాణ్ణి. అలా నా బ్యాగ్ నా పదో తరగతి అయ్యేవరకు (తొమ్మిదిలో ఉండగానే నాన్న చనిపోయాడు)నా కుటుంబానికి ఆధారంగా నిలబడింది.
సో….ఏ బ్యాగ్ ఎవరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియదు.ఇప్పుడు తోపుడుబండి ఇస్తున్న బ్యాగ్ లు పిల్లల్లో బోల్డంత ఆనందాన్ని ఇస్తున్నాయి.ఇవి ఎవరెవరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో….?
చేయూతనివ్వండి
ఈసారి జరగబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించటానికి,మంచి విద్యాసంస్థల్లో సీట్లు సాధించటానికి ఎలా సంసిద్ధం అవ్వాలి?దానికి పిల్లలకు ఏమేమి అవసరం?వాటికి ఏమేమి సమకూర్చుకోవాలి?కోచింగ్,స్టడీ మెటీరియల్,ఈవెనింగ్ స్నాక్స్,కోచింగ్ తర్వాత రాత్రి కాస్త ఆలస్యమైతే ఇంటికి ఎలా చేర్చాలి?
తదితర అంశాలపై పిల్లలతో చర్చించి ఉపాధ్యాయ బృందంతో సమాలోచన చేసి దానికి తగిన ప్రణాళిక రూపొందించాం.మొత్తం భారాన్ని తోపుడుబండి భుజాన వేసుకుంది. ఈ మహాయజ్ఞం లో పాలు పంచుకోవాలనే ఆలోచన మీకుంటే మీరు ఏదో ఒక సహాయం చేయవచ్చు. కింది నంబర్లలో సంప్రదించండి.
9346108090,7330033330