నా భర్తే నన్నువ్యభిచారంలోకి దించాడు !

Sharing is Caring...

నా పేరు “బబిత” మైనర్‌గా ఉండగానే నాకు పెళ్లి అయింది. నా భర్తకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అత్తగారింటికి వెళ్లేవరకూ ఆయన గురించి నాకేమి తెలియదు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆయనకు చికిత్స చేయించే ఆర్ధిక స్తోమత మాకు లేదు. దీంతో ఎక్కువ వడ్డీ రేటు కు మనీలెండర్ వద్ద అప్పు తీసుకున్నాం.

ఫలితంగా  కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. ఇదే సమయంలో తక్షణమే అప్పు తిరిగి చెల్లించాలని అప్పు ఇచ్చిన వ్యక్తి వత్తిడి తెచ్చాడు. అధిక వడ్డీ కి సొమ్ము ఇచ్చిన ఆ వ్యక్తి   ‘రికార్డు డాన్సర్ గా నువ్వు పనిచేస్తే అప్పు సులభంగా తిరిగి చెల్లించవచ్చు’ అని మభ్యపెట్టి నన్ను డాన్సర్ గా మార్చేశాడు.

నాకు 16 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత ఈ వేదింపులు, కష్టాలు నుంచి తప్పించుకోవాలి అనుకున్నా. అందుకు మార్గం పెళ్లి అని భావించా. ఎక్కడో నన్ను డాన్సర్ గా చూసి… ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడిన  ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాను.

పెళ్లి అయిన మూడేళ్లలోనే  నా నిర్ణయం తప్పు అని గ్రహించాను.  నా భర్త జూదరి, మద్యానికి బానిస, తాను తన వ్యసనాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి డబ్బు సంపాదించమని ప్రతి రోజు నన్ను కొట్టడం, తిట్టడం చేసేవాడు. అతని అప్పులు వడ్డీలతో కలిసి రూ.10 లక్షల వరకు అయింది. ఒక రోజు తన స్నేహితుల వద్దకు నన్ను పంపి వ్యభిచారం చేయించాడు.

నాకు అప్పటికే ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఆ తరువాత రోజూ డబ్బులు తెస్తేనే పిల్లలకు భోజనం అంటూ చావ చితకగొట్టేవాడు. అలా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన తెచ్చే విటులకు ఒళ్ళు అప్పగించేదాన్ని. చివరికి నా భర్త వేదింపులు భరించలేక పారిపోయి పిల్లలతో హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నా తల్లి దగ్గరకు తిరిగి వచ్చాను.

నేను ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే నా తండ్రి అనారోగ్యం తో మరణించాడు, నా కుటుంబాన్ని పోషించడానికి మరో అవకాశం లేక మళ్ళీ రికార్డు డాన్సర్ గా మారాను. అపుడే “విముక్తి “సంస్థ సభ్యులు నాకు పరిచయం అయ్యారు. సెక్స్ వర్కర్ల , అక్రమ రవాణాకు గురైన మహిళ ల పునరావాసం కోసం విముక్తి సంస్థ పనిచేస్తోంది.

నాలాంటి వారికి అండగా నిలుస్తోంది. ఈ సంస్థను హెల్ప్ అనే ఎన్జీవో ప్రమోట్ చేసింది. ఆ సంస్థ ఆశయాలు నచ్చి నేను కూడా సభ్యురాలిగా చేరిపోయాను.  బాధిత మహిళల సాధికారత కోసం పని చేస్తున్న సంస్థలో చేరగానే నాకు ధైర్యం వచ్చింది. నాలాగా మోసపోయిన మహిళలకు మేము ధైర్యం చెప్పి .. వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తున్నాం. విముక్తి లో సభ్యురాలిగా నా ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ  ఒక నాయకురాలు స్థాయి కి ఎదిగాను.

మేము అక్రమ రవాణా,  వాణిజ్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా  పోరాడుతున్నాం. సెక్స్ వర్కర్లు, వారి పిల్లల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాం.  ఎవరూ తిరిగి వ్యభిచారంలోకి బలవంతంగా రాకుండా చూస్తున్నాం. నేను కూరగాయలను విక్రయించే చిన్న వ్యాపారాన్ని కూడా ప్రారంభించాను.  

మరో పక్క “విముక్తి” లో రాష్ట్ర  కార్య నిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. విముక్తి సంస్థ పేరిట  రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూనే జాతీయ స్థాయిలో అక్రమ రవాణా బాదితులు తో ఏర్పాటు అయిన “ఇండియన్ లీడర్స్ ఫైటింగ్ అగనిస్ట్ ట్రాఫికింగ్” – (ILFAT) తో  చేతులు కలిపాము.  

ఈ “ఇల్ఫాట్” ద్వారా జాతీయ స్థాయిలో  అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం పోరాటం చేస్తున్నాం. అలాగే బాధితుల రక్షణ, నష్ట పరిహారం చెల్లింపు, పునరావాసం కోసం, మెరుగైన పునరావాసం,అక్రమ రవాణాదారులకు శిక్షలు పడేలా ఉన్న చట్టాల అమలు కోసం డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!