కేంద్ర ఎన్నికల సంఘం పై కోర్టులు మండి పడుతున్నాయి. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కి ఎన్నికల కమీషనే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి .. విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు ప్రాసిక్యూట్ చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈ సి ఆప లేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినా మిన్నకుండిపోయిందని ఈ సి పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 30 లోగా ఓట్ల లెక్కింపు పై ప్లాన్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇక ఇదే తీరులో నాలుగు రోజుల క్రితం కలకత్తా హైకోర్టు కూడా కేంద్ర ఈసీ పని తీరుపై అక్షింతలు వేసింది. అసంతృప్తి వ్యక్తం చేసింది.మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ శేషన్ చేసిన దాంట్లో కనీసం పదోవంతు కూడా చేయడం లేదని ఆక్షేపించింది. కరోనా కల్లోల సమయంలో ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఊరకే సర్క్యులర్లు ఇవ్వడం .. సమావేశాలు పెట్టడం ఒక్కటే ఈసీ డ్యూటీ కాదని .. వాటిని అమలు చేయడం కూడా ఈ సి భాద్యత అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో రోడ్ షోలు , భారీ ర్యాలీలపై నిషేధం ఎందుకు విధించలేదని కోర్టు ప్రశ్నించింది.
కాగా కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయడం లో తప్పేమి లేదు. ఈసి పనితీరుపై సర్వత్రా అసంతృప్తి ఉన్నది. కరోనా ను గమనంలోకి తీసుకోవడం పై ఈ సి అధికారులు విఫలమయ్యారు.మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని చూసి కూడా స్పందించకపోవడం మరీ ఘోరం. మద్రాస్ హైకోర్టు నిజంగా ఈసీ అధికారులపై మర్డర్ కేసులు బుక్ చేయాలి. కరోనా సమయం లో బెంగాల్ లో 294 సీట్లకు గాను 8 దశల పోలింగ్ ఎవరైనా పెడతారా ? మహా పెట్టినా రెండు దశలు ..మూడు దశల్లో పోలింగ్ పెడతారు. ముందు చూపు లేకుండా ఈసీ వ్యవహరించింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 6,7,8 దశల పోలింగ్ ను ఒకేసారి నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. కోర్టు అక్షింతలు వేశాక కూడా ఈసీ అధికారుల్లో చలనం లేదు.ప్రజల ప్రాణాలు పోవడానికి ఈసీ కూడా బాధ్యత వహించాలని కోర్టు వ్యాఖ్యానించడం సబబే.