Subramanyam Dogiparthi………………..
శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా ఇది. 1974 లో విడుదలైన ఈ ఖైదీ బాబాయ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకున్నారు.
ఒక లారీడ్రైవర్ (శోభన్ బాబు) తాగి లారీ నడుపుతూ యాక్సిడెంట్ చేస్తాడు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. ఆవ్యక్తి కుటుంబానికి ఆధారం లేకుండా పోతుంది. లారీడ్రైవర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోర్టు తీర్పు చెబుతుంది. ఈ క్రమంలో సహాయపడటానికి వెళ్లిన డ్రైవర్ ను మృతుని భార్య (షావుకారు జానకి) అంగీకరించదు. ఆకుటుంబానికి డ్రైవర్ ఎలా దగ్గరయ్యాడు అనేది చిత్రకథ.
సినిమాలో ఏ సీనునూ , డైలాగుని కట్ చేయాలని అనిపించదు . బొల్లిముంత శివరామకృష్ణ డైలాగులు వ్రాసారు. దర్శకుడు టి కృష్ణ. ఇండస్ట్రీలో ఇద్దరు టి కృష్ణలు ఉన్నారు . ఒకరు ఈ టి కృష్ణ. వరంగల్ కు చెందినవారు . మరొక టి కృష్ణ ప్రకాశం జిల్లా వారు.
కృష్ణ , బాలయ్యలు నటించిన నేరము శిక్ష సినిమా లాంటిదే ఇది కూడా . ఖైదీ బాబాయ్ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది . వాణిశ్రీ , గుమ్మడి , నిర్మలమ్మ , సుమ , రమాప్రభ , సత్యనారాయణ , నాగయ్య , సాక్షి రంగారావు , అల్లు రామలింగయ్య , పద్మనాభం , రామకృష్ణ , చంద్రమోహన్ , కె వి చలం , ముక్కామల ప్రభృతులు నటించారు.శోభన్ బాబు తనదైన శైలిలో బాగా నటించారు. వాణిశ్రీ హీరోయిన్గా తన పరిధిలో పాత్రకు న్యాయం చేసింది.
సినిమా టైటిల్సులో నేరెళ్ళ వేణుమాధవ్ పేరు వేసారు . సినిమాలో ఏ పాత్రలో నటించారో నాకు తెలియలేదు . ఆయన మొత్తం మూడు సినిమాలలో మాత్రమే నటించారు . గూఢచారి 116 , దేవుని గెలిచిన మానవుడు , ఖైదీ బాబాయ్ .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి. ఎక్కడి వాడో గాని చక్కనివాడే , ఓరబ్బీ చెపుతాను ఓలమ్మీ చెపుతాను , బైస్కోప్ పిల్లొచ్చింది , ఒట్టంటే మాటలు కాదు చిలకమ్మా పాటలు హిట్టయ్యాయి.. తమిళంలోకి నీతి అనే టైటిల్ తో రీమేక్ అయింది . శివాజీ , జయలలిత , జానకి నటించారు . కన్నడంలోకి హోస తీర్పు అనే టైటిల్ తో రీమేక్ అయింది . అంబరీష్ నటించారు.
మంచి సందేశాత్మక , సంస్కరణాత్మక మాస్ సినిమా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడతగ్గ చిత్రం.
Tharjani ……….
ఈ సందర్భంగానే దర్శకుడు టి. కృష్ణ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. ఈయన వరంగల్ కి చెందిన వాడు. ఆయన అసలు పేరు టి.కృష్ణమాచారి.వరంగల్ జిల్లా రాయపర్తిలో పుట్టారు. బీఏ పూర్తి చేసాక ఓవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే గోల్కొండ పత్రికలో సినిమా సమీక్షలు రాసేవాడు. హైదరాబాద్ ఆలిండియా రేడియోలో తెలంగాణ యాసలో గ్రామీణ వార్తలు చదివేవారు.
మద్రాస్ వెళ్లి హెచ్ఎం రెడ్డి ని కలిశారు. ఆయన సలహా మేరకు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. అటు డైరెక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నారు.ఆదుర్తి దర్శకత్వంలో 1961లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాతో ఎడిటర్ అయ్యారు కృష్ణ.
మంచి మనసులు, మూగమనసులు, తేనె మనసులు, కన్నెమనసులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, దాగుడు మూతలు, తోడునీడ, వెలుగు నీడలు, పూలరంగడు, , సుడిగుండాలు., మరో ప్రపంచం ఇలా ఆదుర్తి పనిచేసిన అన్ని సినిమాలకు కృష్ణనే ఎడిటర్ గా పనిచేశారు.
ఉపాయంలో అపాయం అన్న సినిమాతో తొలిసారి దర్శకుడయ్యారు కృష్ణ. ఆ సినిమాను 21 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఆ సినిమా శతదినోత్సవాన్ని జరుపుకుంది. తర్వాత మళ్లీ ఎడిటర్‌గా కొనసాగారు. ఆ సమయంలోనే ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే ఉర్దూ నవలను చదివారు కృష్ణ. దాన్ని సినిమాగా తీయాలని భావించారు.
అయితే అప్పటికే దాన్ని’దుష్మన్’ పేరుతో హిందీలో తీస్తున్నారని తెలుసుకుని నిరాశ పడ్డారు. హిందీ సినిమా నిర్మాత తెలుగు హక్కులు ఇస్తామని చెప్పడంతో కృష్ణ ఖైదీబాబాయ్ నిర్మాణానికి పూనుకున్నారు. కృష్ణ మిత్రులు మార్కండేయ, ఆంజనేయులు, లక్ష్మణ్‌రావు, బాబుల్‌నాథ్‌లు నిర్మాతలగా మారి బాలాజీ చిత్ర పతాకంపై దుష్మన్‌ను తెలుగులో ఖైదీబాబాయ్‌గా తీశారు. శోభన్ బాబు అప్పటికే పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నారు. కృష్ణ తో పరిచయం ఉండటం .. కథ నచ్చిన కారణంగా శోభన్ ఈ సినిమాకు పారితోషకం తక్కువ తీసుకున్నారు.