ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ..నెహ్రు ఆర్ట్ గ్యాలరీ లో ఏర్పాటు చేస్తున్నారు. 22 వతేదీ ఉదయం 11 గంటల నుంచి 24 వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.మోహన్ అభిమానులు అందరూ రావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
Ramachandra Sarma Gundimeda ……………………………
ఎక్కడో ఏలూరులో పుట్టి, ఏకలవ్యుడిలా అన్నీనేర్చేసుకున్నాడు. గీతలతో ఆడుకుంటూ, పసిపిల్లవాడిలా ఆ గీతలను చూసి మురిసిపోతూ, నిరంతరం పుస్తకాల్లో తలదూర్చేస్తూ అలా అలా గడిపేస్తూ… విజయవాడ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నవాడు.
హైదరాబాద్ చేరాక జర్నలిస్టు అవతారం నుండి పూర్తిగా కార్టూనిస్టుగా మారిపోయి పొలిటికల్ కార్టూనిస్టులకు గురువయ్యాడు… బాపూమెచ్చిన కార్టూనిస్టుగా, సామాన్యుడు మెచ్చిన గీతా మోహన్ గా నిలిచి అందరినీ తనవారిగా చూసుకున్నాడు… యానిమేషన్ రంగమే మంచి ఉపాధిని పేరును తెచ్చిపెడుతుందని 24 ఏళ్ళ కితమే బలంగా చెప్పిన దార్శనికుడు. ఆయన పేరే తాడి మోహన్ .
పొలిటికల్ కార్టూనిస్టుగా మోహన్ తెలుగు పత్రికా రంగం పై విశేష ప్రభావాన్ని చూపారు. ఆయన కార్టూనులు చూసి ఎంతోమంది అదే టైపు లో కార్టూనులు వేసేవారు. వ్యంగ్య చిత్రాలు గీయడంలో మోహన్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన బొమ్మలు కార్టూన్లు తెలుగు నాట విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.
ఉదయంలో మోహన్ వేసిన కార్టూన్లు చూసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నవ్వుకుండేవారట. కొన్ని వందల పొలిటికల్ కార్టూన్లు ఆయన గీశారు. అన్ని కూడా ఆదరణ పొందినవే. ఎవరిపై అయినా ధైర్యంగా ఆయన కార్టూన్ వేసేవారు. ఏనాడు భయపడింది లేదు.
ఎందరో ఏకలవ్య శిష్యులున్న కార్టూనిస్ట్ మోహన్ ఏనాడూ, ఎప్పుడూ కూడా ఎవరినీ చేయి చాచలేదు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు.. తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ , దాన్ని మనసులోనే దాచుకున్నారు. తన ఆశయాన్ని ముందుకు తీసుకు వెళ్లే తన శిష్యు కార్టూనిస్టులు, జర్నలిస్టులు, రచయితల సంక్షేమం కోసమే ఎక్కువగా శ్రమించారు.
ఒక కార్టూనిస్టును విధుల నుండి యాజమాన్యం తొలగిస్తే… నేనున్నానంటూ మోహన్ చేస్తున్నకార్టూనిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి అతనికి ఉద్యోగాన్ని ఇప్పించిన మహానుభావుడు.ఏ రచయిత ఏ పుస్తకం రాసినా ముందుగా మన మోహన్ నే సంప్రదించేవారు.
ఏ చిత్రకారుడు బొమ్మ వేసినా కూడా, మోహన్ నే సంప్రదించి ఎలా వుందని అడిగేవారు. ఆ రచనలను… కార్టూన్లను, బొమ్మలను పరిశీలించి అనేక తప్పొప్పులను గమనించి మోహన్ తన అభిప్రాయం చెప్పేవారు. ఒక బాలుడు వచ్చి ఈ బొమ్మ ఇలాగ వేశారు ఏమిటని ప్రశ్నిస్తే ఆ బొమ్మకు సంబంధించిన అంశాన్నివిశదీకరించారు కూడా.
అంతర్జాతీయ కార్టూనిస్టుగా ఎదిగినప్పటికీ ఏనాడు కూడా ఎటువంటి భేషజాలూ లేకుండా చిన్న పిల్లాడి నుండి వయో వృద్ధుల వరకు వారికి సంబంధించిన వివరాలు అడిగితే చెప్పేవారు. ఒక విధంగా మోహన్ ది చిన్నపిల్లల మనస్తత్వం… ఉదయం 4 గంటలకే లేచి, నిరంతరం పుస్తక పఠనం చేస్తూ సమాజపోకడలను కార్టూన్ల ద్వారా తెలిపేవారు. కార్టూనిస్టు మోహన్ మరణించలేదు… బ్రష్ ఉన్నంత వరకు మోహన్ జీవిస్తూనే వుంటారు… ఎన్నటీకీ మరణం లేదు.