భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందని విమర్శలు వెల్లు వెత్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద చూస్తే కరోనా కేసుల్లో సగం పైగా భారత్ నుంచి నమోదు అవుతున్నాయి. మరణాలు వేల సంఖ్య కు చేరుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు . ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కొందరు ఆక్సిజన్ దొరక్క మరణిస్తున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు క్యూలో ఉంటున్నాయి.
ఈ పరిణామాలు అందరిని కలవర పెడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మీడియా తూర్పారా పడుతోంది. మొన్నటి వరకు విదేశాలకు కీలకమైన మందులను అందించి , తర్వాత వ్యాక్సిన్ సరఫరా చేసి మంచి పేరు తెచ్చుకున్న ఇండియా బాధ్యతా రహిత దేశంగా మారిపోయింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దిష్టమైన ప్రణాళికలు లేకుండా .. ముందు చూపు లేకుండా పోయింది. వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన కొన్నాళ్లకే కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల 250 రూపాయలకు చేయాల్సిన టీకా బ్లాక్ లోకి వెళ్ళిపోయింది. ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఆందోళనలో పడిపోయారు. కొందరైతే భయంతోనే చనిపోతున్నారు. ఇలాంటి విపత్తును జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన ప్రభుత్వం సరైనరీతిలో వ్యవహరించడం లేదని దేశీయ మీడియా కూడా విమర్శలు గుప్పిస్తున్నది.
ఈ క్రమంలోనే కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చి సరిహద్దులు దాటి ప్రపంచమంతా వ్యాపించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ది గార్డియన్, వాల్ స్ట్రీట్, జర్నల్, టైమ్ మ్యాగజైన్, బిబిసి, ది ఎకనామిస్ట్, అల్ జజీరా, టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతున్నాయి. ముందే తెలిసిన సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. భారత్ మీడియా కూడా ఎన్నికలు .. ర్యాలీలు , కుంభమేళాల పట్ల మెతక వైఖరిని ప్రదర్శించిందని చురకలు తగిలించింది. మోడీ ప్రధాని అయ్యాక ఈ తరహా విమర్శలు రావడం ఇదే మొదటి సారి. విదేశాలన్ని సెకండ్ వేవ్ పై అప్రమత్తమై .. దానిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే మోడీ,అమిత్ షా లు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలపై దృష్టి పెట్టారని ఘాటైన విమర్శలు వచ్చాయి. ఇందుకు నిదర్శనం మోడీ 20, అమిత్ షా 30 ర్యాలీలలో పాల్గొనడమే అని వ్యాఖ్యానించాయి. మోడీ వైఫల్యాలను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని ఆ పత్రికలు రాశాయి.