ఒక వేణువు వినిపించెను! 

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………….

ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. ఆ లోటును భర్తీ చేసిన వాడు జి.ఆనంద్.గాయకుడుగా ప్రవేశించి సంగీత దర్శకత్వమూ చేసి, ఫేస్బుక్ లో మనతో స్నేహం చేసిన ఆనంద్ గాన ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.

శ్రీకాకుళం జిల్లా నుంచి గాయకుడు కావాలనే తపనతో ప్రయాణం మొదలుపెట్టారు జి.ఆనంద్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.వి.మహదేవన్ లు న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్న ఓ పాటల పోటీలో పాట పాడారు ఆనంద్. బహుమతి గెల్చుకున్నారు.
వేదిక మీదే సినిమాల్లో అవకాశమిస్తానని వాగ్దానం చేశారు మహదేవన్. అన్నట్టుగానే అవకాశం ఉన్నప్పుడల్లా ఆనంద్ లో పాడించారు.

సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పింది మామే అయినా…ఆనంద్ కి తొలి ఛాన్స్ ఇచ్చింది మాత్రం ఆయన కాదు. ఘంటసాల రోజుల్లో బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రోత్సహించిన కోదండపాణే…బాలు దున్నేస్తున్న టైమ్ లో ఆనంద్ కీ చేయూతనిచ్చారు.
పండంటి కాపురం చిత్రంలో ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి పాటలో ఇతర గాయకులతో కల్సి పాడే ఛాన్సిచ్చారు.ఆనంద్ లాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు శరత్ బాబు. తొలి రోజుల్లో తను చెప్పదగ్గ ప్రతి చోటా ఆనంద్ గురించి చెప్తూ వచ్చారాయన. అలా అమెరికా అమ్మాయి టైమ్ లో దర్శకుడు సింగీతం, సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ల దృష్టికి తెచ్చారు. అయితే అదే సమయంలో చంద్రమోహన్ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో ఆనంద్ పాట విన్న నవతా క్రుష్ణంరాజుగారు కూడా సై అనడంతో ఆనంద్ ని పిలిపించారు. పాట పాడించారు. ఆ ఇద్దరికీ నచ్చింది. అంతే అమెరికా అమ్మాయిలో గోపి రచన ఒక వేణువు…వినిపించెను…పాట పాడే ఛాన్స్ ఇచ్చేశారు.

డెబ్బై దశకంలో ఇండస్ట్రీని ఏలేసిన ఐదుగురు హీరోలకీ బాలు మాత్రమే పాడాలనే నిబంధన ఉంది. దీంతో చిన్న హీరోలకు ఆనంద్, మాధవపెద్ది రమేష్ లు పాడేసేవారు. బాలయ్యకు తొలినాళ్లలో రమేష్ పాడేవారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి తొలి పాట పాడే అవకాశం ఆనంద్ కు దక్కింది. ప్రాణం ఖరీదు చిత్రంలో ఎన్నియల్లో ఎన్నియల్లో ఆనంద్ కు పేరు తెచ్చిన పాటల్లో ఒకటి.చిరంజీవి బిగ్ హీరో అవుతున్న దశలో కూడా ఆనంద్ పాటలు పాడారు. ముఖ్యంగా మనఊరి పాండవులు తర్వాత వచ్చిన చిత్రాల్లో ఆనంద్ వాయిస్సే వినిపించేది. జి.కె.వెంకటేశ్, మహదేవన్ లు మాత్రమే కాదు…చక్రవర్తి కూడా ఆనంద్ ను బాగా ఎంకరేజ్ చేశారు. సురేష్ మూవీస్ లో తను చేసిన తొలి చిత్రం కక్షలో ఆనంద్ తో పాట పాడించారు చక్రవర్తి. క్రాంతికుమార్ కి పనిచేసిన కల్పనలో దిక్కులు చూడకు రామయ్యా పాటే కాదు … మురళీమోహన్ కు చాలా పాటలు ఆనందే పాడేవాడు. అతనికి ఇతని వాయిస్సే నప్పుతుందని దర్శకులు అనుకోవడం కూడా కారణం కావచ్చు.

డెబ్బై దశకం మధ్యలో చాలా సినిమాల్లో ఆనంద్ గళం వినిపించేది. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దానవీరశూరకర్ణలోనూ ఆనంద్ తో పాట పాడించారు పెండ్యాల. జయీ భవా అంటూ వచ్చే ఎన్టీఆర్ ఎంట్రన్స్ గీతం బాలుతో కలసి పాడారు ఆనంద్.
ఇద్దరు హీరోలున్న చిత్రాల్లో ఒక హీరోకి తప్పనిసరిగా ఆనంద్ తో పాడించేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినిపించే గీతాలకు కూడా ఆనంద్ నే ప్రిఫర్ చేసేవారు. చిన్న హీరోలకైతే బాలు కోసం వెయిట్ చేయడం కన్నా ఆనంద్ తో పాడించేసుకోవడమే బెటరనుకునేవారు. అలా వచ్చిన పాటల్లో ఒకటి దీపారాధన చిత్రంలో వినిపిస్తుంది.వర్ధమాన కథానాయకులు అగ్రనాయకులుగా ఎదిగిన క్రమంలో ఆనంద్ తో పాడించుకోడానికి ఇబ్బంది పడ్డారు. మురళీమోహన్ సొంత చిత్ర నిర్మాణం ప్రారంభించాక బాలుతోనే పాడించుకునేవారు. అలాగే చిరంజీవి కూడా స్థాయి పెరిగి పేరు ముందు సుప్రీం హీరో అనే ట్యాగులైన్ వచ్చాక బాలుతో తప్ప మరొకరితో పాడించుకోడానికి ఇష్టపలేదు.

అలా హీరోల కెరీర్ ప్రారంభంలో పాడే సింగర్ గా మాత్రం పాపులార్టీ సాధించారు.అలాగే ఆనంద్ పాడిన చాలా పాటలు సినిమాల్లో ఉంటే రికార్డుల్లో వచ్చేవి కాదు .. రికార్డుల్లో వచ్చినవి సినిమాల్లో ఉండేవి కాదు… ఇంకొన్ని ఆఖరి నిమిషంలో హీరోల ప్రమేయంతోనో మరొకరి జోక్యంతోనో సినిమాల్లో ఉండేవి కాదు …ఓ సారి … చక్రవర్తి సంగీత దర్శకత్వంలో జూదగాడు సినిమాలో ఆనంద్ పాడిన మల్లెల వేళా అల్లరి వేళా పాట చాలా బావుంటుంది … అయితే చక్రవర్తిగారిని బాలసుబ్రహ్మణ్యంనూ బతిమాలాడు … పాట బాగా వచ్చింది … ఇదే ఉంచండి అని .. ఇద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కోరినా … ఆ పాట నీదే ఉంచుతాం అని హామీ ఇచ్చారు. అయితే శోభన్ బాబు కోసం రికార్డు చేసిన ఆ పాటను సినిమాలో శ్రీధర్ మీద చిత్రీకరించడం ఆనంద్ ను కాస్త నిరుత్సాహపరచింది. ఇలాంటి అనుభవాలు అనేకం అతని జీవితంలో .. దీంతో సంగీత దర్శకుడుగా మారారు ఆనంద్. గాంధీనగర్ రెండో వీధి లాంటి సినిమాలకు సంగీతం చేశారు. తనూ బాలుతోనే పాడించుకున్నారు. కానీ ఆనంద్ అనగానే చిన్న సినిమాలు…అందమైన ఆహ్లాదకరమైన పాటలే గుర్తొస్తాయి. అంతే కాదు … బడ్జట్ లో బ్లాక్ అండ్ వైట్ లో తీసిన చలిచీమలు లాంటి సినిమాలు కూడా గుర్తొస్తాయి.

గాయకుడుగా ఆనంద్ పేరును చిరస్థాయిగా నిలబెట్టే పాటల్లో ఒకటి చక్రధారి చిత్రంలోని విఠలా విఠలా. ఆత్రేయ రాసిన ఆ గీతానికి కూడా జి.కె వెంకటేశే స్వరం కట్టారు. అప్పటికి ఇంకా రామకృష్ణ ప్రభ నడుస్తోంది. చిత్రంలో హీరో కాక మరో పాత్రకు పాడే పాట కావడంతో ఆనంద్ ని తీసుకున్నారు.కెరీర్ ప్రారంభం నుంచీ ఆనంద్ కేవలం గాయకుడుగానే కాక తనను తానో సాంస్కృతిక సైనికుడుగా మలచుకున్నారు. ఆర్కెస్ట్రా నిర్వహించేవారు. చాలా మందికి తెలియని విషయం … నటుడు రచయిత పాత్రికేయుడు రావికొండలరావు గారు గాయకుడు కూడా. ఆయన శ్రీకాకుళంలో సుకుమార్ ఆర్కెస్ట్రా నిర్వహించేవారు. తర్వాత తను మద్రాసు వచ్చేశాక చిట్టిబాబు లాంటి వాళ్లు దాని బాధ్యతలు చూసేవారు. ఆ ఆర్కెస్ట్రా నుంచీ వచ్చిన ఆనంద్ దాన్నే ప్రేరణగా తీసుకుని … తను ఒక ఆర్కెస్ట్రా ఆర్గనైజ్ చేసి … కచ్చేరీలు చేస్తూ కథ నడిపించేవాడు.

అమెరికా అమ్మాయిలో పాట పాడే సమయంలో అక్కడకి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన ఓ ఔత్సాహిక గాయని సుజాతతో పరిచయమై … తనతో పాటు వేదిక మీద పాటలు పాడాలని కోరాడు. ఆవిడ అంగీకరించారు. అలా మొదలైన పరిచయం ప్రణయంగా మారి పెళ్లాడేశారు. తర్వాత ఇంటి నిర్వహణ కోసం కచ్చేరీలతో పాటు అనేక అంశాలపై ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉండేవారు ఆనంద్ . అలాగే విదేశాల్లో కచేరీలు ఆర్గనైజ్ చేసేవారు.ఈ కచ్చేరీల మధ్యే దొరకిన అవకాశాలను వదలకుండా పాడేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రావడం తప్పేనేమో అనుకునేవారాయన. కాస్త స్వర గ్నానం తో వచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది తన పరిస్థితి అని ఆయన చివర వరకు బాధ పడేవారు. గాయకుడుగా ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో కూడా ఆనంద్ పాడారు. రజనీకాంత్ తొలిసారి హీరోగా చేసిన తెలుగు సినిమా చిలకమ్మ చెప్పిందిలో వాణీజయరాంతో కలసి పాడిన ఆత్రేయ పాట ఎందుకు నీకీ దాపరికమూ పాట చాలా బావుంటుంది .. నాకు చాల ఇష్టం ఆ పాట …
ఆనంద్ పాడిన సినిమా పాటల్లో అనేక సూపర్ హిట్స్ ఉన్నాయి. దూరాన దూరాన తారా దీపం లాంటి మెమరబుల్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆనంద్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే దిక్కులు చూడకు రామయ్యా తో పాటు పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు లాంటి అనేక పాటలు గుర్తొస్తాయి. పాటలకు సంబంధించి సినిమా సంగీతానికి సంబంధించి ఏదైనా పోస్టు రాస్తే … తక్షణం స్పందించేవారాయన. ఎఫ్బీలో అంత చురుగ్గా ఉంటారని నాకు తెలియదు. మెసెంజర్ కాల్ చేసి అప్పుడూ ఇలా జరిగేది .. ఈ సంగీత దర్శకుడు గురించి మీరు రాసినదాంట్లో కొంత తప్పుంది .. ఇలా చెప్పి కరెక్ట్ చేసేవారు.ఆనంద్ షడన్ గా నిష్క్రమించడం బాధాకరం … చాలా కష్టాలు పడ్డాడు. ఎన్నో కష్టాలను నవ్వుతూ దిగమింగాడు. పిల్లలను చక్కగా తీర్చిదిద్దాడు. జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాడు. నిజంగా కష్టేఫలి అనే మాటకు తానే నిదర్శనంగా నిల్చాడు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!