Bharadwaja Rangavajhala…………………………………………melodious raga
రాగంలో కాస్త జానపద, లలితసంగీతం ఛాయలు ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్స్ తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో మాండు రాగంలో ఎక్కువ పాటలు చేశారు.
తిరువిళయదాల్ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట మాండు రాగం ప్రత్యేకతను చాటుతుంది. బాలమురళి గాత్రంలో రాగ ఛాయల్లో సంచరించే పాట ఇది. https://youtu.be/XOiMExz65ZA
”రహస్యం” చిత్రం కోసం ఘంటసాల స్వరం కట్టిన సముద్రాల అనే కలం పేరుతో మల్లాది వారు రాసిన సాహిత్యం “సాధించనౌనా జగాన” మాండు రాగ ఛాయల్లోనే నడుస్తుంది. ‘పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా?’ …. ఆహ్లాదకరమైన సందర్భానికి తగిన మూడ్ క్రియేట్ చేయడం మాండు రాగ ప్రత్యేకత.
ఉదాహరణకు “పెళ్లి కానుక” లో ఎఎమ్ రాజా స్వరం కట్టిన -“కన్నులతో పలకరించు వలపులూ యెన్నటికీ మరువరాని తలపులూ”–వింటే అర్ధమైపోతుంది. ఆత్రేయగారన్నట్టు మనసు పరాధీనమైపోతుంది. మాండ్ రాగం ఆధారంగా చేసిన ఈ పాటలో కూడా అన్ని సినిమా పాటల్లోలాగే అన్యస్వరాలూ తప్పక వినిపిస్తాయి.
మాండు రాగంలో చేసిన పాటల్లో దాదాపు అన్నీ హిట్టు కొట్టాయి కూడా. హృద్యంగా మనసును తాకుతూ మది లోలోతులకు వెళ్లగలగడం మాండు రాగం ప్రత్యేకత. కావాలంటే ఎమ్మెస్వీ మాండు రాగంలో చేసిన ఈ ట్యూను చూడండి. తమిళంలో సౌందరరాజన్ , సుశీల పాడిన ఈ పాటను తెలుగులో ఘంటసాల సుశీల ఆలపించారు. పాట ముందు వచ్చే ఆలాపన మాత్రం తెలుగులోనూ ఎమ్మెస్వీయే పాడారు. నిజానికి తెలుగు వర్షన్ కు మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. అయినప్పటికీ ఎమ్మెస్వీ చేసిన తమిళ వరసలనే అనుకరించారు.
కాస్త నెమ్మదిగా సాగే మాండు రాగంలో హాయైన భావాలను ప్రశాంతమైన స్వరంలో చెప్పడానికి చాలా వీలు చిక్కుతుంది.సరిగ్గా ఇలాంటి సందర్భానికే మాండు రాగంలో పాట చేశారు పెండ్యాల నాగేశ్వరరావు. జయభేరి చిత్రంలో వినిపించే మల్లాది వారి సాహిత్యం ‘నీ దాననన్నది రా’…పాట మాండులో కంపోజ్ చేసినదే.
మాండు రాగం కర్ణాటక సంగీత పద్దతిలో శంకరాభరణానికి జన్యురాగం. హిందూస్తానీ నుంచీ దిగుమతి చేసుకున్నదే. భిలావల్ ఠాఠ్ లో భాగంగా వినిపిస్తుంది. దీని పుట్టుక రాజస్థాన్ లో అంటారు. కారణం రాజస్థానీ జానపద బాణీల్లో మాండు చాయలు విపరీతంగా కనిపిస్తాయి.బెంగాలీ తదితర భాషల్లో వినిపించే భజన గీతాల్లోనూ మాండు రాగం వినిపిస్తుంది.
మాండు రాగంలో పాటలు బాలీవుడ్ లోనూ వినిపిస్తాయి. ముఖ్యంగా S.D. బర్మన్ సంగీత దర్శకత్వంలో. ఆయనే స్వరాలు అందించిన అమితాబ్ మూవీ అభిమాన్ లో లతామంగేష్కర్ పాడు సోలో ఒకటుంటుంది. ‘అబ్ తో హై తుమ్ సే’ అంటూ సాగే ఈ పాట చాలా పెద్ద హిట్టు .
బర్మన్ ను ప్రేరణగా తీసుకుని సంగీతం చేసే సంగీత దర్శకుడు చక్రవర్తి. ముఖ్యంగా మెలోడీలు చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక్కసారి రిఫరెన్స్ లోకి వెళ్తారు. బలిపీఠం సినిమా కోసం దేవులపల్లి వారు రాసిన పాటను మాండు రాగఛాయల్లోనే చక్రవర్తి స్వరం కట్టారు. కాస్త విషాదం ధ్వనించే పాటలు కూడా మాండు రాగంలో వినిపిస్తాయి.
రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో పూజ సినిమాలో అలాంటి పాట వినిపిస్తుంది. అది కూడా చాలా హృద్యంగా సాగుతుంది.ఒక విషాదపు జీర తప్ప పాటంతా హాయిగా సాగుతుంది. ఈ పాటకు సాహిత్యం అందించింది దాశరథి. ‘మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా’…(నాకేం తెల్సు ).
ఘంటసాల మాస్టారు స్వరకల్పనలో మాండు రాగం వినిపించే సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా పద్య పఠనంలో మాస్టారు మాండు రాగాన్ని వాడారు. సినిమా పాటలకు సంబంధించి ఆయనా మాండు రాగంలో యుగళగీతాన్నే చేయడం విశేషం. పెళ్లి సందడి చిత్రం కోసం చేసిన’ ఓహో ప్రేమలతా ‘పాట చాలా ప్రాచుర్యం పొందింది.
‘శాస్త్రీయ రాగాలను సినిమా పాటలకు వినియోగించడంలో రెహ్మాన్ ది ప్రత్యేక ముద్ర. మాండు రాగానికి నీలాంబరి, తోడి, మోహన రాగాలను దన్నుగా నిలబెట్టి చేసిన రాగమాలిక ‘ఇద్దరు’ చిత్రంలో వినిపిస్తుంది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటలో ‘మదనమోహినీ చూపులోన మాండు రాగమేలా’ అంటాడు. అలాగే మరో చోట ‘క్షణానికో తోడి రాగం’ అంటాడు. సంగీతపు గుట్టుమట్టులు తెలిసిన కవి ఆయన. ఇలాంటి వారు కొంచెం ప్రమాదం.
హృద్యమైన బాణీలు కూర్చడంలో తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో రమేష్ నాయుడుది ప్రత్యేక ముద్ర. దర్శకుడుగా జంధ్యాల తొలి చిత్రం ‘ముద్దమందారం’ కోసం మాండు రాగ ఛాయల్లో అద్భుతమైన బాణీ కూర్చారు నాయుడుగారు.వేటూరి వారి సాహిత్యం కూడా బాణీకి అలా ఒదిగిపోయింది.అనునయింపు , ఓదార్పు, భరోసా లాంటి భావాలన్నీ పాటలో ధ్వనింపచేశారు. ‘నీలాలు కారేనా కాలాలు మారేనా………. నీ జాలి నే పంచుకోనా ……………. నీ లాలి నే పాడలేనా….. జాజి పూసే వేళ జాబిల్లి వేళ….. పూల డోల నేను కానా …’
ఇళయరాజా , రెహ్మాన్ ల తరహాలోనే శాస్త్రీయ రాగాలను ఆధారం చేసుకుని చక్కటి బాణీలు కూర్చిన కీరవాణి.ఒక మంచి పాట రూపొందాలంటే ప్రధానం గా సందర్భం కుదరాలి. దర్శకుడికి అభిరుచి ఉండాలి.బాలచందర్ తీసిన ఓ తమిళ సినిమా కోసం కీరవాణి మాండు రాగంలో కూర్చిన ఈ గీతం చూడండి. https://youtu.be/NlAdyIcpAb8
తెలుగులోనూ మాండు రాగంలో ఓ పాట కంపోజ్ చేశారు కీరవాణి. దర్శకేంద్రుడు తీసిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రం కోసం చంద్రబోస్ రాసిన ఓ చిలిపి గీతాన్ని హృద్యంగా స్వరపరిచారు. ‘ఎంత ఎంత చూడనూ’ అంటూ సాగే పల్లవి. తెరంతా రాఘవేంద్రజాలం మార్మిక గీతంగా సాగుతుంది.