వసంత (చిన్నకథ )

Sharing is Caring...

“దెయ్యం క్యారెక్టర్ నువ్వే చేయాలి”  డైరెక్టర్ గారు ఆ మాట అనగానే ఉలిక్కిపడ్డాను.
“నేనేంటి దెయ్యం క్యారెక్టర్ ఏంటి ? సార్” అన్నాను.
“నీకు మంచి పేరు వస్తుంది. నా మాట నమ్ము.” అన్నాడు ఆయన.
కాదంటే వచ్చిన వేషం కూడా పోతుంది. వేరే దారి లేక ‘సరే’ అన్నాను.

దెయ్యాలంటే నాకు చిన్నప్పటినుంచి భయం. వాటి గురించి వింటేనే వణుకు.అలాంటి నేను దెయ్యం లా ఏం నటిస్తాను?
“రేపు మేకప్ తో ట్రయిల్ వేద్దాం. ఈ రాత్రికి రెండు మూడు హారర్ సినిమాలు చూడు . వాటిలో దెయ్యం క్యారెక్టర్ వేసిన వాళ్ల హావభావాలను పరిశీలించు. ఒకేనా.. బై “అన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది.ఇక తప్పదు అనుకుని మొబైల్ లో ఒక సినిమా చూద్దామని ప్రయత్నించా. ఒకటి రెండు సీన్లు చూడగానే వెన్నులో వణుకు మొదలైంది.

తెల్లవారు జామున చూద్దాములే అనుకుని దుప్పటి  ముసుగు తన్ని పడుకున్నాను. పడుకున్నానే గానీ నిద్ర పడితేకదా. ఆ ఒకటి రెండు సీన్లే కళ్ళ ముందు కదులుతున్నాయి. అంతలోనే బీరువా దగ్గర ఏదో అలికిడి అయింది. దుప్పటి తీసి బీరువా వైపు చూసాను. అక్కడ ఏమి కనబడలేదు.

కళ్ళు మూసుకున్నా … మళ్ళీ ఏదో అలికిడి . బీరువా కదులుతున్న శబ్దం. దాని వెనుక ఎవరో ఉన్నారేమో అనిపించింది.
దొంగ ఎవరైనా వచ్చారా ? తలుపులు వేసే ఉన్నాయి కదా.  కొంపదీసి దెయ్యం కాదుకదా ! మొత్తానికి బీరువా వెనుక ఏదో ఉంది.మెల్లగా లేచి కూర్చున్నాను. గోడ వైపు చూసాను. చాలా చిన్న స్వరం తో “ఎవరు” అన్నాను . జవాబు రాలేదు.

బీరువా వైపు వీపు పెట్టి ఇటు పక్కకు తిరిగి పడుకుని కళ్ళు మూసుకున్నాను. కాసేపటి తర్వాత వెనుక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది.ఎవరో వచ్చి నా బెడ్ మీద కూర్చున్నట్టు అనిపించింది.  ఎవరిదో ఊపిరి అతి దగ్గరగా వినిపించసాగింది.

నా మెడకు తగులుతున్న ఊపిరి తాలూకు స్పర్శతో భయమేసింది.  ‘శ్రీ ఆంజనేయం .. ప్రసన్నఆంజనేయం’ … దేవుడిని తలచుకున్నాను. స్పర్శ తగలడం ఆగిపోయింది.  కొంచెం ధైర్యం తెచ్చుకుని పక్కకు తిరిగాను.  చూస్తే ఎవరూ లేరు. బీరువా నుంచి టీవీ దాకా ప్రతి వస్తువును పరికించి చూసాను.  ఎవరూ కనిపించలేదు . అంతా నా భ్రమే .. భయమే అనిపించింది.

అంతలో కాలింగ్ బెల్ మోగింది. గుండె జల్లుమంది.  ఈ టైములో ఎవరు? మళ్ళీ బెల్ మోగింది. ఇక తప్పదు అనుకుని భయపడుతూనే వెళ్లి తలుపు తీసాను. ఎదురుగా వసంత.
“ఈ టైమ్ లో ఏమిటే ?”
“బస్ లేట్ అయింది లే .”…. అంటూ లోపలికొచ్చింది. తను నా రూమ్మేట్ …. 20 రోజుల క్రితం సొంత వూరు వెళ్ళింది.
ఇద్దరం మంచం మీదకు చేరి … చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం.  దెయ్యం క్యారెక్టర్ గురించి కూడా చెప్పాను. ‘ఆల్ ది బెస్ట్ ‘అన్నది.

“అన్నట్టు వాసు సంగతి మీ ఇంట్లో చెప్పావా ?” అడిగాను.
“మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నారు … కానీ వాడే ఒప్పుకోవడం లేదు.”
“అదేంటే ?”  “నా క్యారెక్టర్ మీద నమ్మకం లేదట ఆ రాస్కెల్ కి” అంది కోపంగా వసంత. ఆమాట వినగానే నాకు చాలా బాధ వేసింది.

వసంత మంచి పిల్ల . దానికి అసలు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. అన్ని విషయాల్లోనూ లిమిట్స్ లో ఉంటుంది. “సర్లే … పడుకో. నేను పొద్దునే అక్క వాళ్ళింటికి వెళతా . మాట్లాడే పని ఉంది. ” అంది వసంత. వసంత రాగానే నాక్కుడా ధైర్యమొచ్చింది. ముసుగు తన్ని పడుకున్నా.  లేచేటప్పటికి ఎనిమిది దాటింది. పక్కన వసంత లేదు.
——————-
పదకొండు గంటలకు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్ కి రమ్మన్నారు. వెళ్లాను .
” రేపు మేకప్ తో రిహార్సల్ చేద్దాం.” అన్నారు. సినిమాలో నా క్యారెక్టర్ గురించి బ్రీఫ్ గా చెప్పారు. ‘సరే … రేపు వస్తా’నని చెప్పి రోడ్డు మీద కొచ్చాను.
డైరెక్టర్ చెప్పిన కథ విన్నపుడు వసంత గుర్తుకొచ్చింది.

‘అవును ఇదేంటి …. మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు ‘అనుకుని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉందా ఫోన్. ఆటో కోసం ఎదురు చూస్తుంటే అంతలో వసంత వాళ్ల అక్క కనిపించింది.. గబగబా వెళ్లి పలకరించాను.రాత్రి వసంత వచ్చిన విషయం చెప్పాను. ‘ఉదయమే మీ వద్దకు వెళతానని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేయలేదు’ అన్నాను.

నా మాటలు విని ఆమె షాక్ తిన్నట్టుంది. మొహం లో రంగులు మారిపోయాయి.
“వసంత సూయిసైడ్ చేసుకుని వారం రోజులవుతోంది. తను నీ దగ్గరకు రావడమేంటి” అంది.
అంతే… నా గుండె ఒక్క సారిగా ఆగింది . వళ్ళంతా చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు.

KNMURTHY

——-
@@@@@@@@

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!