Sisters who competed in the world of music………………………………
అక్కాచెల్లెళ్లు అయిన లతామంగేష్కర్ .. ఆశాభోంస్లే సంగీత ప్రపంచంలో తమ సత్తా చాటుకుని లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ ఇద్దరూ ఎన్ని పాటలు పాడారో వారికే తెలీదు. చిన్నతనంలో ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువు కున్నారు. ఆశాను లతా ఎత్తుకుని స్కూల్ కి వెళ్లేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు.
ఆ ఇద్దరి తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వారి చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి ఆ ఇద్దరు పాటలు పాడటం ప్రారంభించారు.లతా మంగేష్కర్ గాయనిగా స్థిరపడినప్పటికీ, ఆశా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుండేది.అలా కష్టపడుతున్న రోజుల్లోనే ఆశా ఊహించని అడుగు వేసింది. ఆమె లతా మంగేష్కర్ కార్యదర్శిగా ఉన్న గణపత్రావ్ భోంస్లే ప్రేమలో పడింది.
అతని వయసు 31 ఏళ్ళు ఆమెకు 16 సంవత్సరాలు. ఈ విషయం చూచాయగా తెలుసుకున్న లతా ఆశాను తొందరపడొద్దని హెచ్చరించింది అంటారు. అయినా ఆశా అక్క మాట వినలేదు. ఇంటి నుంచి వెళ్లి పోయి గణపత్రావ్ భోంస్లే ను పెళ్లి చేసుకుంది.అప్పట్లో ఆశా కొన్నాళ్ళు కుటుంబానికి దూరమైంది. ఇద్దరి మద్య మాటలు కూడా లేవు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు పలుక్కున్నారు. ఆశా కొంత లేటుగా సినీ గాయకురాలిగా స్థిరపడింది. లతా మంగేష్కర్ తో పోటీపడి వేల పాటలు పాడింది. లతా మంగేష్కర్ ఎన్ని పాటలు పాడారో ?ఆమెకే తెలీదు. లత ఎలాంటి రికార్డు రాసుకోలేదు. అందుకే ఆమె ఎన్ని పాటలు పాడారో ?ఖచ్చితమైన సమాచారం లేదు.
1974లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు 1948-74 మధ్య కాలంలో అత్యధిక పాటలు పాడిన సింగర్ గా గుర్తించారు.25 వేలు పాడిన గాయనిగా లతామంగేష్కర్ ను రికార్డ్ ల్లో కెక్కించారు.అదలావుంటే అప్పట్లో ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ ఈ రికార్డు ను అంగీకరించలేదు. తాను అప్పటికే 28 వేల పాటలు పాడానని ఛాలెంజ్ చేసారు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.
గిన్నిస్‌బుక్ సంస్థ లతా రికార్డును కొనసాగిస్తూనే మహమ్మద్ రఫీ పేరును కూడా రికార్డుల్లో చేర్చారు.ఆ తర్వాత 1991లో గిన్నిస్ బుక్ రికార్డుల నుంచి లతా పేరును తొలగించింది. 2011లో.. 11 వేల పాటలు పాడిన గాయనిగా ఆశాభోంస్లే పేరును గిన్నిస్ బుక్ ప్రకటించింది.అలా ఇద్దరూ గిన్నీస్ బుక్ ఎక్కారు.
ఎన్నో అవార్డులు .. రివార్డులు సాధించారు.చెల్లెలు కూడా పెద్ద గాయనిగా గుర్తింపు పొందడం పట్ల లతా కూడా సంతోషం వ్యక్తం చేసేవారు. అక్కగా, స్నేహితురాలిగా,శ్రేయోభిలాషిగా వ్యవహరించిన లతా దివ్య లోకాలకు వెళ్లిపోవడం ఆశాకు పెద్ద లోటే. చివరి రోజుల్లో ఆశా హాస్పటల్ కెళ్ళి అక్కను పరామర్శించి వచ్చారు.