మైనాస్వామి……………………………. An inscription written by the second Bukkaraya
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో మేరెడ్డిపల్లి ఒక మారుమూల గ్రామం. గోరంట్లకు 5 కి. మీ దూరంలో ఉత్తర దిక్కున వుంది. 700 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగి ఉండడమే గాక, సంస్థాన కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. ఆ గ్రామ అభివృద్ధిపై విజయనగర రాజ్య పాలకులు ప్రత్యేక దృష్టి సారించి, సాగు.. తాగు నీటి కోసం కాలువ తవ్వించి, చెరువును నిర్మించినట్టు పొలాల్లో ఉన్న శిలా శాసనం వివరిస్తున్నది.
శాసనకర్త విజయనగర ప్రభువు రెండో బుక్కరాయలు కాగా, శాసనాన్ని సామాన్యశకం 1388లో రాశారు. శాసనంలో మేడిరెడ్డిపల్లి అని వుంది. అది దసవంద శాసనం. మేరెడ్డిపల్లిలో అందమైన ఆలయాలతోపాటు శిథిలమైన గుళ్ళు, శిల్పాలు-పడిపోయిన స్తంభాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ పల్లె ప్రవేశంలో వేణుగోపాల స్వామి దేవాలయం, ఎదురుగా ఆంజనేయుని సన్నిధి, ఆ పక్కనే చౌడేశ్వరిమాత కోవెల, సమీపంలో శక్తి స్వరూపిణి – నల్లనమ్మ విగ్రహం, ఆ తర్వాత శిథిల శివాలయం వున్నాయి. శక్తి మాతలు- సప్తమాతృకల రూపుచెదిరిన శిల్పాలు దర్శనమిస్తాయి.
వేణుగోపాలుని గుడి, మారుతి మందిరం విజయనగర రాజ్య ప్రారంభ కాలం నాటివి. నల్లనమ్మ విగ్రహం, చౌడమ్మ కోవెల చోళుల పాలనలో రూపుదిద్దుకొని వుండవచ్చు. చిత్రావతి నదికి వెళ్ళే దారిలో ఎత్తయిన వేదికపై నల్లనమ్మ విగ్రహం వుంది. వేప చెట్టు నీడే అమ్మవారికి ఆలయం. గ్రామదేవతలకు బహిరంగ ప్రదేశాల్లోనే పూజలు జరుగుతుంటాయి. గ్రామదేవతలకు గుడులు అరుదుగా వుంటాయి. విజయనగర కాలంలో కట్టిన వేణుగోపాల స్వామి గుడికి ఇటివల మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు.
గర్భగుడి, అంతరాళం, ముఖమండపం, ధ్వజస్తంభం, ప్రాకార గోపురంతో సంపూర్ణ గుడిగా నిలిచింది. గర్భగుడిపై ద్రావిడపద్ధతిలో విమానగోపురం నిర్మితమయింది. ముఖమండపంలోని స్తంభాల్లో ఎటువంటి శిల్పాలూ లేవు. గర్భగుడిలోని మూలవిరాట్-వేణుగోపాలుని సుందర రూపాన్ని చూడడానికి వేయి కన్నులు చాలవు. నునుపుదేలిన నల్లని రాతిలో నల్లనయ్య నిలువెత్తు విగ్రహాన్ని మలిచారు. వేణుధరుని వర్ణించడానికి మాటలు చాలవు. వేణువు వూదుతూ నిలబడుకొన్న గోవర్ధనున్ని చూస్తూ గోవులు మైమరచి పోతాయి.
స్వామివారి పాదాల చెంత అటూ ఇటూ రుక్మిణీ-సత్యభామలున్నారు. పైన గల మకరతోరణంలో దశావతారాలున్నాయి.గోపాలుని నిండైన శిల్పం ఎంతో నాజూకుగా వుంది. మేరెడ్డిపల్లికి రహదారి-రవాణా సౌకర్యం సరిగా లేకున్నా.. ఎంతో మంది యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి స్వామి సందర్శనకు వస్తుంటారు.
రెండో బుక్కరాయలు: విజయనగర సామ్రాజ్య పాలకుడు రెండో హరి హర రాయల రెండో కుమారుడు బుక్కరాయలు. రెండోహరిహర సా.శ.1377 నుంచి 1404 వరకు రాజ్య పాలన చేశాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు విరూపాక్షరాయలు, బుక్కరాయలు, దేవరాయలు. విరూపాక్ష తర్వాత తమ్ముడు బుక్కరాయలు రాజయ్యాడు. కేవలం సంవత్సరం రోజులు (1405-1406) మాత్రమే బుక్క ప్రభువుగా పాలన సాగించాడు. రాజ్య అధిపతి గాక ముందు బుక్కరాయలు పెనుకొండలో రాజప్రతినిధిగా వుంటూ, పాలనలో తండ్రికి అండగా నిలబడ్డాడు.
రెండో బుక్క రాయలకు సంబంధించిన వివరాలు అతి తక్కువగా లభ్యమవుతున్నాయి. మేరెడ్డిపల్లి శాసనంలోనూ “బుక్క రాయడు పృథ్వీ రాజ్యం చేయుచుండగా” అని చెప్పారు తప్ప, అతని బిరుదులు, రాజ్యకేంద్రస్థానం వంటి వాటిని వెల్లడించలేదు. తనతండ్రి ‘హరిహరరాయలను సైతం మహామండలేశ్వరుడు’ అని రాశారు. ‘అరి రాయ విభాడ, మూరు రాయరగండ’ అనే బిరుదులు హరిహరరాయనికి ఉన్నట్టు పేర్కొన్నారు. శ్రీమన్ మహా మండలేశ్వర, అరిరాయ విభాడ, మూరు రాయర గండ, శ్రీ వీర హరిహరరాయని కుమారుడు బుక్కరాయడు ప్రితివి (పృథ్వీ) రాజ్యము చేయు చుంన్నగా.. అని రాశారు.
తండ్రి హరిహరుడు విజయనగరం (హంపి) లోకు రాజ్యాధికారం చేపట్టినప్పుడే శ్రీ.శ. 1377లొ బుక్కరాయలను పెనుకొండలో రాజప్రతినిధిగా నియమించి వుండవచ్చు.అప్పుడే ఆయన పెనుకొండసీమ అభివృద్ధి పట్ల దృష్టి సారించాడు. వ్యవసాయం – ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే గాక, తెలుగు భాష- సంస్కృతి వికాసానికి తోడ్పడ్డాడు. మేరెడ్డిపల్లి శాసనాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకొంటే బుక్క రాయల భాషాభిమానాన్ని ప్రశంసించి తీరాలి.
రెండో బుక్కరాయల 1388 నాటి శాసనాన్ని మేరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చూడవచ్చు. శాసనంలోని తెలుగు భాష అద్భుతంగా వుంది. అప్పటికి తెలుగు భాష చందోబద్ధమైన పద్యాల రూపంలోనే వుంది. గద్యం చాలా తక్కువ. అంతా గ్రాంథికమే. కానీ మేరెడ్డిపల్లి శాసనంలోని ‘వచనం’ ఎంతో సరళంగా వుంది. అంతేగాక శాసనంలోని అక్షరాలు గుండ్రంగా అందంగా.. వరుసలు వరుసలుగా వున్నాయి.
శాసనంలో వాడిన పదాలను బట్టి పెనుకొండ సీమలో “తెలుగు భాష తేనె అంత మధురం” గా వుండేదని చెప్పవచ్చు. పేరు తర్వాత గారు, గారి అని గౌరవాన్ని ప్రదర్శించారు. శాసనాన్ని అంత సుందరంగా రూపొందింపచేసిన ఆ కవివరేణ్యునికి జేజేలు పలకాల్సిందే.
అది దసవంద శాసనం: చెరువులు కట్టించడం, కాలువలు తవ్వించడం, వాగులు నదులకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడి విధంగా పాలకులు ఆదేశాలు జారీ చేసే అంశాలను పొందుపరిచిన రాతలను ‘దసవంద శాసనాలు’ అంటారు. నది నుంచి కాలువ ద్వారా చెరువుకు నీటిని మళ్ళించడం, చెరువు నిర్మాణ కర్తలు, చెరువును కట్టిన వారికి శాశ్వతంగా ధాన్యం హక్కు తదితర విషయాలన్నీ చాలా స్పష్టంగా వున్నాయి.. అందువల్ల మేరెడ్డిపల్లి శాసనం దశవంద శాసనమే. ఆ శిలా రాత నాయంకర పరిపాలనను, పాలకులను ప్రజలకు తెలుపుతున్నది.
మేరెడ్డిపల్లి నాయంకర పాలనలో వుంది. నాయంకాచార్య (మండలాధ్యక్షుడు) హరిగిల కతనాయిని గారి కొడుకు పోలి నాయినింగారు మేడిరెడ్డిపల్లిని మేలుచుంనుండి అని శాసనం చెబుతున్నది. మేడిరెడ్డిపల్లి చెరువుకు చిరేట నుండి కాలువ తవ్వాలని పోలినాయకుడు ఆదేశించాడు. చిరేట అంటి చిరు ఏటి.. చిన్న నది అని అర్థం. నదిని వ్యవహారికంలో ఏరు అంటారు. నాయంకాచార్య పోలినాయక తోలేటి దేవోజు కొడుకులు పెదబయిరపోజు, చినబయిరపోజులచే చిరేటకు కాలువ తవ్విoచాడు.
(చిరేట ప్రస్తుతపేరు చిత్రావతి) ఏటి కాలువ తవ్వినందుకు పెదబయిర, చినబయిరలకు చెరువు కింద పండిన పంట (వరిమడి)లో పందుము ధాన్యం ఇవ్వాలని నాయకుడు ఆదేశించాడు. పందుము అంటే ఆరు బస్తాలు. ‘సూర్యచంద్రులున్నంత వరకు’ పోలినాయక ఆదేశం అమలులోవుంటుందని శాసనం చెబుతున్నది. 18-26 వరుసల మధ్య పందుము ధాన్యం- ప్రతిఫలం విషయం వుంది. శాసనం మొత్తం 26 వరుసల్లో వుంది. ‘స్వస్తిశ్రీ జయాభ్యుదయ శక వర్షములు 1309’ అని మొదలై .. మంగళమహా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ తో ముగుస్తుంది.
శాసన కాలం శక వర్షం 1309 ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ 15 గురువారం (ఇంగ్లీష్ తేది. క్రీ.శ.1388 జనవరి 23) . తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న శాసనాల్లో మేరెడ్డిపల్లి శాసనం ఒకటని చెప్పవచ్చు. (మేరెడ్డిపల్లి శాసనాన్ని పురావస్తు శాఖ వారు 1917 లో నమోదు చేశారు.)
శాసన పాఠం…కొంత భాగం:
స్వస్తిశ్రీ జయాభ్యుదయ శక వర్షములు 1309 అగు నేటి ప్రభవ సంవత్సరం మాగ సు. 15 గురువారము నాడు శ్రీమన్ మహామండలేశ్వర అరిరాయ విభాడ మూరు రాయర గండ శ్రీ వీర హరి హర రాయని కుమారుడు బుక్క రాయడు ప్రితివి రాజ్యము చేయుచుంన్నగా శ్రీమన్ మహానాయంకాచార్య హరిగిల కితినాయిని గారి కొడుకు పోలినాయినింగారు మేడిఱెడ్డిపల్లియేలు చుంనుండి ఆ పొలినాయినింగా ..