దడ దడ లాడించిన మంచు లక్ష్మి !

Sharing is Caring...

మంచు లక్ష్మీ నటించి ..నిర్మించిన సినిమా ఇది. 2015 లో విడుదలైంది. ఇపుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవి శేష్, బ్రహ్మానందం, ప్రభాకర్, మధు కీలక పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’. సినిమా ఫర్వాలేదు.. చూడొచ్చు. శృతి (మంచు లక్ష్మీ) టాలీవుడ్ లో ఓ హీరోయిన్. ఆమె ను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు.  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ గా బ్రహ్మి వస్తాడు.

కిడ్నాపర్లు ఎవరు ? ఏమిటి ? ఆమె ఎలా తప్పించుకుంది ? బ్రహ్మి ఏం చేశారు? హీరో అడవి శేష్ ఏంచేశారు ? అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  కథ లో ట్విస్టులు మీద ట్విస్టులు పెట్టాడు కొత్త దర్శకుడు వంశీ కృష్ణ. అక్కడక్కడా లాజిక్ మిస్ అయినా సినిమాలో కామెడీ ని ఎంజాయ్ చేయవచ్చు. డిటెక్టివ్ గా బ్రహ్మానందం నవ్విస్తాడు. ముఖ్యంగా బ్రహ్మి, నటి ప్రగతి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీలు ఉన్న సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో డైలాగులు పేలాయి. 

హీరోయిన్ తల్లిగా ప్రగతి తన పాత్రలో మెప్పించింది.హీరోగా చేసిన అడవి శేష్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆపాత్రకు కరెక్ట్ సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. అతనికి రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. సీరియస్  విలన్ గా చేసే ప్రభాకర్ ఈ సినిమాలో కామెడీ విలన్ గా చేసాడు. 

ఇక మంచు లక్ష్మి కూడా ఫర్వాలేదు. కామెడీ, యాక్టింగ్, ఫైట్స్,డాన్సులతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించింది. హీరో నాగార్జున .. రవి తేజ .. మనోజ్ లతో ఒక స్పెషల్ సాంగ్ తీశారు. అంత మంది హీరోలు ఒకే పాట లో కనిపించడం వారి అభిమానులను అలరిస్తుంది. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో కథ పలు మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో లాజిక్ ఉండదు. సినిమా మధ్యలో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. 

కథ కథనం మీద కొంచెం కసరత్తు చేసి ఉంటే ఇంకా బాగుండేది. సెంటిమెంట్ సాంగ్ అనవసరం. కథను డ్రాగ్ చేసేలా ఉంది. కథలో కీలకమైన కిడ్నాప్ ఘటన ఎలా జరిగిందో చూపకుండానే కథనం సాగుతుంది.రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు బలం చేకూర్చాయి. సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్ పనితనం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించాడు.సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది.  హాట్ స్టార్ చందాదారులు చూడ వచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!