మమతా బెనర్జీ దేశంలోనే ఒక అరుదైన నాయకురాలు. ఎవరికి బెదరని ధీరత్వం ఆమెది. ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి .. నిలబడగల సత్తా ఆమెది. సంచలన విజయాలు ఎన్నో సాధించిన ఖ్యాతి ఆమెది. సొంత పార్టీ పెట్టి మూడు మార్లు ఘనవిజయం సాధించడం ఆంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో దీదీ ని ఓడించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. మమతా పార్టీలోని కీలక నాయకులను ఆకర్షించి కాషాయ తీర్ధం ఇచ్చి వారిని బరిలోకి కూడా దింపింది. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. నందిగ్రామ్ లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ .. పశ్చిమ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ వరుసగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని కీలక విషయాలను తెలుసుకుందాం. 1955 జనవరి 5 న మధ్యతరగతి కుటుంబంలో మమత జన్మించారు. ఆమె తండ్రి బెనర్జీ వైద్య చికిత్స అందకపోవడంతో మరణించారు.అపుడు మమతా వయసు 17 సంవత్సరాలు. మమత కలకత్తాలోని జోగమయ దేవి కళాశాల లోచదువుకున్నారు. చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. మమతా బెనర్జీ 70 వ దశకంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కొన్నాళ్ళు పనిచేశారు. మమత మంచి చిత్రకారిణి. కవితలు కూడా రాసేవారు. ఆమె తన పెయింటింగ్స్‌ను అమ్మి ఆ సొమ్మును పార్టీకి డొనేషన్ గా ఇచ్చింది. రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్ళు మమతా బెనర్జీ స్టెనోగ్రాఫర్ గాను. ఒక ప్రాధమిక పాఠశాల లో టీచర్ గా, ఒక ప్రైవేట్ ట్యూటర్ గా, సేల్స్ గర్ల్ గా కూడా పనిచేశారు. ఆమె పెళ్లి చేసుకోలేదు.. బ్రహ్మచారిణి గానే ఉండిపోయారు.
1984 లోక్‌సభ ఎన్నికలలో, 29 ఏళ్ల మమతా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని ఓడించి సంచలన విజయం సాధించింది. అపుడే ఆమె గురించి అందరికి తెలిసింది. 1991 లో కోల్‌కతాలో హజ్రా క్రాసింగ్ వద్ద కాంగ్రెస్ ర్యాలీ లో పాల్గొని వస్తుండగా మమతా బెనర్జీ పై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో మమతా తల పై గాయాలైనాయి. 11 కుట్లు పడ్డాయి. సాక్ష్యాలు లేవని దాడిచేసిన వారిని కోర్టు విడుదల చేసింది.
మమతా ఇప్పటి వరకు రెండు మార్లు ఎన్నికల్లో ఓడిపోయింది. మొదటిసారి గా 1989లో మాలిని భట్టాచార్య చేతిలో ఓటమి చవి చూసారు. రెండో సారి తాజా ఎన్నికల్లో నందిగ్రామ్ లో సువెందు అధికారి చేతిలో. 1991 లో కలకత్తా సౌత్ నియోజకవర్గం నుండి తిరిగి గెలిచింది. తరువాత 1996, 1998, 1999, 2004, 2009 ఎన్నికలలో వరుస విజయాలు సాధించింది.
1997 లోతృణమూల్ కాంగ్రెస్ ను పెట్టాక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది. తరువాత కాలంలో మమత ఎన్డీఏ, యుపిఎ రెండింటితో చేతులు కలిపింది.
1999 లో ఎన్డీయే లో చేరి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేసింది. తర్వాత బయటకొచ్చింది. 2004 లో మరోసారి ఎన్డీయే తో చేతులు కలిపింది. అపుడు బొగ్గు, గనుల శాఖ మంత్రిగా చేసింది. 2009 పార్లమెంటు ఎన్నికలకు ముందు యుపిఎ తో పొత్తు కుదుర్చుకుంది. రైల్వే మంత్రిగా పని చేశారు.
మహిళల రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన సమాజ్ వాదీ పార్టీ ఎంపి దరోగా ప్రసాద్ సరోజ్‌ను షర్టు పట్టుకుని లోకసభ వెల్ లోనుంచి మమతా బయటికి లాక్కొచ్చారు. 1988 డిసెంబర్ 11 న ఈ సంఘటన జరిగింది. అప్పట్లో అదొక సంచలన సంఘటన. సాదా సీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడే మమతాబెనర్జీ సాంప్రదాయ బెంగాలీ కాటన్ ‘టాంట్’ చీరలను ధరిస్తుంది. దక్షిణ కోల్‌కతాలోని హరీష్ ఛటర్జీ వీధిలో ఆమె పూర్వీకుల నివాసం ఉండేది. అదొక చిన్న ఇల్లు. వర్షం వస్తే కురిసేది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మమతా కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఇంటి ని ఒకసారి సందర్శించారు.ఆ ఇల్లు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఆమె తన నివాసాన్ని మార్చింది. అది కూడా సాదా సీదా ఇల్లే. హంగులు ఆర్భాటాలు ఉండవు. మమతా ఆరోగ్యం కోసం రోజూ ట్రెడ్‌మిల్‌పై 5-6 కి.మీ వాకింగ్ చేస్తారు. పాత్రికేయులతో కలిసి అపుడపుడు అసెంబ్లీ పచ్చిక బయళ్ళలో కూడా వాకింగ్ చేస్తుంటారు.
—————KNM