బరగూరు మహేంద్రేశ్వరాలయం లో అద్భుత శిల్పకళ !!

Sharing is Caring...

Amazing sculpture………………………. 

మైనాస్వామి……………………………. 

నోలంబ పల్లవ రాజ్యంలో బరగూరు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. రాజధాని హెంజేరుకు సమీపంలోనే వుండే బరగూరు రాజుల విడిది కేంద్ర మయింది. మహేంద్ర నోలంబాధిరాజ కొన్ని నెలలపాటు బరగూరులో బస చేసి పాలన సాగించినట్టు ఆధారాలున్నాయి. మహేంద్రేశ్వరాలయం, బసవేశ్వర సన్నిధి, ఆంజనేయస్వామి తదితర దేవాలయాలు ప్రఖ్యాతి గాంచాయి. మహేంద్రేశ్వర కోవెల నోలంబ ప్రభువులకు ఆరాధ్యమయింది.

నోలంబ పల్లవ నిర్మాణాలు………..ఆలయ శిల్పకళకు బరగూరు శివ సన్నిధిని మంచి నిదర్శనం గా పేర్కొనవచ్చు. గర్భగుడి, అంతరాళం, ముఖ మండపం, అగ్ర మండపం లేదా మహామండపం, నంది మండపంతో పూర్తిస్థాయి దేవాలయంగా మహేంద్రేశ్వర గుడి రూపొందింది. మహేంద్ర నోలంబాధిరాజ చే నిర్మించబడినందున మహేంద్రేశ్వరాలయంగా ఖ్యాతి గాంచింది.

పెద్ద శివలింగం, దేవతల శిల్పాలు, ఆలయ స్తంభాలు, నంది విగ్రహం, శాసన స్తంభం నోలంబ పల్లవ శిల్పకళను చాటి చెబుతున్నాయి. బరగూరు హేమావతి నుంచి 14 కి.మీ., కర్నాటక తుమకూరు జిల్లా శిర నుంచి 26 కి. మీ. దూరంలో వుంది.

మహేంద్రేశ్వర సన్నిధి గర్భగుడిలో నోలంబ పల్లవ శిల్పశైలికి తగ్గట్టుగా పెద్ద శివలింగం కొలువు దీరింది. శక్తికి సంకేతమైన బ్రహ్మ సూత్రం రేఖలు శివలింగంపై వున్నాయి. నునుపుగా వున్న నల్లని రాతి శివలింగం మెరుస్తున్నది. గర్భగుడి ద్వారబంధాలు సాదాసీదాగా వున్నాయి. అంతరాళంలోని శిల్పాలు అత్యంత సుందరంగా వున్నాయి.

ఒక వైపు కాల భైరవ స్వామి, మరో వైపు మహిషాసుర మర్ధిని మాత విగ్రహాలున్నాయి. అంతరాళానికి ఆలంబనగా వున్న రెండు స్తంభాలు రమణీయంగా వున్నాయి. స్తంభం మధ్యలో చతురస్రాకారంగా వున్న భాగంలో సూక్ష్మ శిల్పాలు ఎంతో బాగున్నాయి. పద్మనిధి, శంఖనిధి వివిధ దేవతల శిల్పాలు, దండలు, కీర్తిముఖాలతో స్తంభాలు అలంకృతమయ్యాయి. వాస్తవానికి అటువంటి నాలుగు స్తంభాలు నవరంగ మండపంలో వుంటాయి.

కానీ బరగూరు సన్నిధిలో రెండు మాత్రమే ఆలంకృత స్తంభాలు ఉన్నాయి. ముఖమండపంలో బాగా నునుపుదేలిన స్తంభాలున్నాయి. స్తంభం పైభాగం వృత్తాకారంలో వుండగా, దిగువ పీఠం పైభాగo చతురస్రాకారంగా వుంది. మధ్య భాగమంతా గంటాకారంగా వుంది. ఒకే విధంగా వున్నఅన్ని స్తంభాల్లో ఎటువంటి శిల్పాలు లేవు. ముఖ మండపం పైకప్పు కూడా సాదాగా వుంది.

ముఖమండపానికి రాతి కిటికీలు ఉన్నాయి . ముఖమండపం ద్వార బంధాలు మరియు పై దిమ్మెపై చెప్పుకోదగ్గ శిల్పాలు లేవు.కూర్చొన్న భంగిమలో అమ్మవారు, నిలబడు కొన్న విధంగా వున్న విష్ణు మూర్తి విగ్రహాలు ముఖమండపంలో వున్నాయి. ముఖమండపం ముందున్న మహా మందప స్తంభాలు అత్యంత నునుపుగా, సాదాగా వున్నాయి. ఆ స్తంభాలు హేమావతి మల్లేశ్వరాలయ స్తంభాలను పోలి వున్నాయి.

స్తంభాలతో కూడిన మహామండపం విశాలంగావుంది. అందులోనే మహాదేవుని వాహనం – నంది కొలువు దీరింది. నంది విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా వుంది. నంది తల, నుదురు, చెవులను నోలంబ శిల్పులు చక్కగా మలిచారు. నంది మెడను చిన్నగంటల మాల అలంకరించగా, నడుం పై నుంచి కిందవరకు పెద్దగంటల మాల వుంది.

నంది కాలి గిట్టెలు, తోక మెలిపెట్టిన విధానం ఎంతో బాగుంది. నోలంబనంది లేచి రావడానికి సంసిద్ధంగా వుంది. మహా మండపం ఆగ్నేయ మూలలో సుమారు 10 అడుగుల ఎత్తున్న శాసన స్తంభాన్ని నిలబెట్టారు. ప్రాచీనకన్నడ భాషలో వున్న ఆ శాసనాన్ని శాలివాహన శక వర్షం 800 (క్రీ.శ.878) సం.రంలో రాశారు.మహామండపం వెలుపల వినాయకునికి ఉపాలయం వుంది. నోలంబుల నిర్మాణం – శిల్ప శైలి అద్భుతంగా వున్నాయి. గుడి తూర్పు దిక్కున ప్రవేశద్వారం  ఉన్నది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!