డా. వంగల రామకృష్ణ…………………
సర్వసిద్ధి ప్రదోఽసిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవ———-
సిద్ధిబుద్ధి ప్రదాత అయిన వినాయకుని పూజించేటప్పుడు మనం చెప్పుకునే మంత్రం ఇది. మనిషి మనుగడకు బుద్ధి కీలకం. బుద్ధి బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ నిర్దుష్టంగా ఉంటే కార్యసిద్ధి దానంతట అదే లభిస్తుంది. ఈ రెండిటినీ తన వశం చేసుకున్నవాడు కనుకనే వినాయకుడు సర్వసిద్ధి సిద్ధి, బుద్ధి దాయకుడయ్యాడు. ఈ విషయం చెప్పడానికే పురాణాలు, సిద్ధి బుద్ధులనే ఆయన భార్యలున్నారు.
బుద్ధి దైవానుగ్రహం. ఇది సహజంగా కలుగవలసినదే తప్ప ప్రయత్న పూర్వకంగా సాధించగలిగింది కాదు. ఒకదానిపై ఒకటిగా ఆధారపడి ఉండే ఈ రెండూ స్వయంభువ శక్తులు. ఈ స్వయం శక్తులను ఏలుకునే వాడు కూడా స్వయం వ్యక్తుడే అయి ఉండాలి కనుక వినాయకుడు స్వయంవ్యక్త మూర్తి అయ్యాడు.
ఈ బుద్ధిశాలి అయిన వినాయకుని పార్వతి తన మేని నలుగు నుంచి తయారుచేసింది. పార్వతి ప్రకృతీ స్వరూపిణి. ఆమె మేని నలుగు మట్టి రూపంలో మనకు భూమ్మీద దొరుకుతోంది. వినాయకునికి ఆకారమివ్వడానికి పార్వతి మట్టిని స్వీకరించింది.
స్నానానికి సిద్ధమవుతున్న పార్వతికి నలుగుపిండి (మట్టి) కన్నా నాణ్యమైన వస్తువు అప్పటికప్పుడు దొరికే అవకాశం కూడా లేదు. అలా నిరాకార వినాయకుడు సాకారం కావడానికి మట్టి ఉపయోగపడింది. ఈ తలను ఈశ్వరుడు తొలగించి కాల్చి వేయడంతో వినాయకుడి తల ఆనవాలు లేకుండాపోయింది. వినాయకుడికి ఈశ్వర సంకల్పంతో మరణం సంభవించింది.
మట్టి వినాయకుని చావు పుట్టుకలకు శివ, పార్వతులు కారకులయ్యారు. అంటే చావు, పుట్టుకలకు దేవుళ్ళే కారకులని, ఇవి మన చేతిలో లేనివని అర్థమవుతోంది కదా! మట్టిలో పుట్టి మట్టిలో కలిసి పోవడమే జీవితమన్న సూక్తిని వినాయకుడి కథ నిరూపిస్తోంది.
“దేహోదేవాలయో ప్రోక్తో జీవోదేవో సనాతనః” అన్నాడు ఆదిశంకరుడు. శివుడు ఆత్మలింగంగా, రాముడు ఆత్మారాముడిగా, విష్ణువు హృదయ స్థితుడిగా ఉన్నారని, కుమారస్వామి కుండలినిలో సర్పాకారుడై ఉన్నాడని చెప్పారు పెద్దలు. హనుమంతుడు గుండెలు చీల్చి సీతారాములను చూపాడని, లక్ష్మి హరి హృదయకుహరంలో నివసించి ఆయనను శ్రీనివాసుడిగా మార్చిందని పురాణకథలు చెబుతున్నాయి.
ఇవన్నీ వినడానికి బాగున్నా సిటి, ఎమ్మారై వంటి స్కానింగ్ లకు దొరికేవి కావు. టు-డి ఇకోలో వినిపించేవి కూడా కావు. పురాణాలు చెప్పే ఆత్మలు, హృదయాలు ఆధునిక స్కానింగ్ లకు అందేవి కావు. అందుకని పురాణాల కథలకు నిరూపణలకు అందక పుక్కిటిపురాణాలుగా మిగిలిపోతున్నాయి.
వినాయకుడి తరహా వేరు.. ఆయన పూజలో వాడే యంత్ర, తంత్రాలకేకాదు, శరీరాన్ని డయాగ్నైజ్ చేసే స్కానింగ్ యంత్రాలకు కూడా కనబడి నేనున్నానని నిరూపించుకుంటున్నాడు. చూద్దాం..
జీవికి తెలివి తేటలనిచ్చే బుద్ధి ఎక్కడ ఉంటుంది? మెదడులో..
అది ఎక్కడ ఉంటుంది? తలలో…
తల ఎక్కడ ఉంటుంది..?
శరీరానికి అన్ని అంగాల కన్నా పైన..అగ్ర స్థానంలో..మెడ అనే సింహాసనం పై ఆసీనమై ఉంటుంది.
ఈ తలను శిరస్సు అని కూడా పిలుస్తారు.
“శిరసీ ఏకదంతాయ నమః” అంటోంది ముద్గల పురాణంలోని గణేశన్యాసం.బుద్ధి కేంద్రంగా ఉండే ఈ వినాయకుడు ఆదిపూజ్యుడు, అగ్రపూజ్యుడు అని పురాణాలు ఘోషించి చెబుతున్నాయి.
వినాయకుడు “మూలాధార క్షేత్ర స్థితుడు”. ఈ మూలాధార క్షేత్రం వెన్నుపూస కింద ఉంటుందని..పురాణాలు చెబుతున్నాయి. మూలాధారం అంటే కీలకమైన ఆధారం అని అర్థం.అత్యంత కీలకమైన ఈ మూలాధారానికి ఏదైనా హాని జరిగితే శరీరం మొత్తం కుప్పకూలిపోవాలి, మరణం సంభవించాలి..కానీ అలా జరగడంలేదు.
కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతిని కాళ్ళూ చేతులు పారలైజ్ మూలన పడుతోందే తప్ప ప్రాణాలు పోగొట్టుకోవడంలేదు. కనుక ఈ మూలాధారచక్రం వినాయకుని ఉనికికి మూలకారణం కాదు.శరీరానికి పైభాగంలో, మెడపై విడిగా ఉండి ప్రత్యేక ప్రతిపత్తిని, అస్తిత్వాన్ని చాటుకుంటున్న తలను తీసేస్తే మరణం తక్షణం ప్రాప్తిస్తోంది.
తలలో ఉండే మెదడు కూడా పెద్దమెదడు, చిన్నమెదడు అని రెండు భాగాలుగా ఉంటుంది. ఈ చిన్నమెదడే వినాయకుడుండే గర్భగుడి.ఈ చిన్న మెదడులో సెరెబెల్లం, మెడుల్లా, పోన్స్, ట్రైగెమినల్ నరాలు ఉంటాయి. బ్రెయిన్ స్టెమ్ లో భాగమైన పోన్స్ వినాయకుని ముఖాకృతిని తలపిస్తాయి.
వీటి మూలాలు వినాయకుని దంతాలను గుర్తుచేస్తాయి. సెరెబెల్లం వినాయకుని రెండు చెవుల్లా పెద్దపెద్దగా ఉండి ముఖానికి రెండు పక్కలా కనబడుతుంది. ట్రైగెమినల్ నరాలు వినాయకుని నేత్రాలను గుర్తుచేస్తాయి. మెడుల్లా వినాయకుని తొండంలా ఉంటుంది.
పెద్దమెదడుకు కిందుగా.. శిరస్సు మెడ కలిసే చోట.. చిన్నమెదడు (సెరిబెల్లమ్) ఉంటుంది. ఇది వినాయకుడు ఉండే సిసలైన స్థావరం.పెద్దమెదడు ఇక్కడి వినాయకుడికి కిరీటం పెట్టినట్టుగా పెద్దగా.. ఉంటుంది. ఈ గోపురం మీద ఉండే వెంట్రుకలకే మనం వాసన నూనెలు రాస్తూ, నానావిధ పరిమళ షాంపులతో కడిగి ఘుమఘుమలాడిస్తున్నాం.
సుబ్బరంగా తల దువ్వి పాపిటలో కుంకుమపెట్టి, పాపిటబిళ్ళపెట్టి ఆ కిందే ఉండే నుదుటికి బొట్లుపెట్టి సింగారిస్తాం. చెవులకు దుద్దులు, రింగులతో అలంకారాలు చేస్తాం. ఆ విధంగా మనకు తెలియకుండానే మనలోని వినాయకుడికి నిత్యపూజలు చేస్తున్నాం. చిన్నమెదడే మనకు శ్రీరామరక్ష. దాన్ని చితికిపోకుండా కాపాడుకోవాలి.