Destiny script…………………………………..
హెలికాఫ్టర్ ప్రమాదం లో భర్త జనరల్ బిపిన్ రావత్ తో పాటు మధులిక రావత్ కూడా మరణించిన విషయం తెలిసిందే. మధులిక కూడా భర్తకు తగిన భార్యే. ఆ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. భర్తకు ఎపుడు ఆమె తన సహాయ సహకారాలు అందించేవారు. మధులికది మధ్యప్రదేశ్ లోని రాజకుటుంబం.
మధులిక తండ్రి మృగేంద్ర సింగ్ షాదోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రియాసత్‌కు రియాసత్దార్ మాత్రమే కాదు, 1967 .. 1972లో జిల్లా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1985లో బిపిన్ రావత్ మధులిక ను వివాహం చేసుకున్నారు. డాక్టర్ మధులికా రావత్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వ శాస్త్రాన్నిఅభ్యసించారు.
మధులిక ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) అధ్యక్షురాలిగా చేస్తున్నారు. మొదటి నుంచి సామాజిక సేవ అంటే ఆమెకు ఇష్టం. మధులిక రావత్ ఆర్మీ సిబ్బంది వితంతువులు, వికలాంగ పిల్లలు, క్యాన్సర్ రోగులు, సైనిక సిబ్బందిపై ఆధారపడిన కుటుంబాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేశారు.ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు జీవన నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేశారు. వారు కొత్త కోర్సులు చదివేలా ప్రోత్సాహించేవారు. ఆర్థికంగాఎదగడానికి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కృషి చేశారు.
జనరల్ బిపిన్ రావత్ .. మధులికా రావత్‌లకు కృతికా, తారిణి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో కృతికాకు వివాహం చేశారు. తారిణి ఇంకా చదువుకుంటున్నారు. గ్వాలియర్‌లోని ప్రతిష్టాత్మక సింధియా కన్యా విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన మధులిక చివరిసారిగా 2012లో సోహగ్‌పూర్‌ని సందర్శించారు. కొత్త సంవత్సరం లో మళ్ళీ వస్తామని ఇటీవలే సోదరుడు యశ్వర్ధన్ సింగ్ కి చెప్పారట. ఈ లోపలే మృత్యువు ముంచుకొచ్చి ఆమె ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.