లక్నో లో మూడు సార్లు పరాజయం ..అయిదు సార్లు ఘనవిజయం !!

Sharing is Caring...

A tireless warrior…………………………….

సుప్రసిద్ధ నేత,మాజీ ప్రధాని బీజేపీ స్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో లోకసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఓడిపోయి .. అయిదు సార్లు గెలిచారు. మూడు సార్లు ఓటమి ఎదురైనప్పటికి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో లక్నో ఒకటి. అతిపెద్ద నియోజకవర్గం ఇది. 1991 నుంచి ఈ లోకసభ స్థానం బీజేపీ చేతిలోనే ఉంది. వాజ్‌పేయి ఎనిమిది సార్లు ఈ స్థానం నుంచి పోటీ చేశారు.

మొదటిసారి వాజ్‌పేయి 1955 ఉప ఎన్నికలో పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. అపుడు ఆయనకు 33,986 ఓట్లు వచ్చాయి.14,746 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.  రెండోసారి 1957 లో పోటీ చేసినపుడు రెండో స్థానంలో నిలిచారు. 57,034 ఓట్లు వాజ్‌పేయి కి వచ్చాయి. 12,485 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి పులిన్ బిహారీ బెనర్జీ గెలిచారు.


అవే ఎన్నికల్లో వాజ్పేయి మథురలో కూడా పరాజయం పాలయ్యారు.మథురలో డిపాజిట్ కూడా గల్లంతైంది. అయితే బలరాంపూర్ నుంచి మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

1962 ఎన్నికల్లో లక్నోనుంచి మళ్ళీ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. నాటి ఎన్నికల్లో 86,620 ఓట్లు ఆయనకు వచ్చాయి. 30,017  ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి BK ధాన్ గెలిచారు. అవే ఎన్నికల్లో బలరాంపూర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత 1991 ఎన్నికల్లో లక్నో నుంచి బరిలోకి దిగి 1,17,౩౦౩ ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. 1996 లో 1,18,671 ఓట్ల మెజారిటీ తో,1998 ఎన్నికల్లో 2,16,263 ఓట్ల మెజారిటీ తో,1999  ఎన్నికల్లో 1,23,624 ఓట్ల మెజారిటీ తో, 2004 ఎన్నికల్లో 2,18,375 ఓట్ల మెజారిటీ తో వరుస విజయాలు సాధించారు.

1991 నుంచి లక్నో ఓటర్లు  2024 ఎన్నికల వరకు  వరుసగా బీజేపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ నేత రాజనాథ్ సింగ్ లక్నో కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!