GR Maharshi……………………………………………………….
30 ఏళ్ల క్రితం మే నెలలో విపరీతమైన దగ్గు. తిరుపతిలో ప్రముఖ (ఇప్పుడు ఇంకా ప్రముఖ) స్పెషలిస్ట్‌తో చూపించుకున్నా. బోలెడు మందులు రాశాడు. తగ్గలేదు. మూర్తి అనే మిత్రుడు ఆయుర్వేద మందు ఇచ్చాడు. తగ్గిపోయింది. ఇన్నేళ్లలో మళ్లీ రాలేదు. అలాగని ఆయుర్వేదం అద్భుతమని అనడం లేదు. నేనేం రాందేవ్‌బాబా కాదు, ఆయనకైతే వ్యాపారాలున్నాయి. నాకు కరోనా భయం తప్ప వేరే ఏమీ లేదు. మనకి తెలియనిది అంతా చెత్త కాదు అని చెప్పడానికే ఇది.
ఒక విషాద సన్నివేశం నడుస్తోంది. ప్రతి మనిషి 10 మందిని పోగొట్టుకున్నాడు. కావాలంటే అడిగి చూడండి. కుటుంబ సభ్యులే కానక్కర్లేదు. పరిచయస్తులు, కొలిగ్స్ ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరూ 10 మరణాలని గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎపుడూ ఈ స్థితి లేదు. గ్లోబ్ అరచేతిలోకి వచ్చిందనుకున్నాం గానీ, రోగ క్రిమి విశ్వవ్యాప్తమైందని గుర్తించలేకపోయాం.
కరోనాకి జనం ఎందుకు వణికి పోతున్నారంటే మరణ భయం మాత్రమే కాదు, ఆర్థికంగా చితికిపోతామనేది దానికి మించింది. ఒకాయన ఇద్దరు ఆడపిల్లల పెళ్లికి కూడబెట్టుకున్న రూ.10 లక్షలు పోయాయి (అమ్మాయిలు అన్ని రంగాల్లో పోటాపోటీగా ఎదుగుతున్న ఈ రోజుల్లో కూడా వాళ్ల పెళ్లికి డబ్బు కూడబెట్టడం విషాదం, అది వేరే కథ). ఇంకొకరు భూముల్ని అమ్మి ఫీజులు కట్టి ప్లాస్టిక్ కవర్లో శవాన్ని తెచ్చుకున్నారు. కరోనా నుంచి కోలుకోవడం సులభం, వైద్య దోపిడీకి గురైతే కోలుకోవడం అసాధ్యం.
వైద్యం ఎంతో ఎదిగింది. డాక్టర్లే డబ్బు జబ్బు పడ్డారు. మహానుభావులు నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఎందరో ఉన్నారు. దేవుడంటూ ఉంటే, ఆయన తర్వాత ప్రాణాలు కాపాడే శక్తి డాక్టర్లకే ఉంది. అందుకే వైద్యుడు , దేవుడు ఒకటే అన్నారు. కానీ డబ్బు డ్రైనేజీ కాలువలాంటిది. అది అన్ని రంగాల్ని కలుషితం చేస్తుంది. నాసిరకాన్ని ఉత్పత్తి చేస్తుంది. జర్నలిజంలో అక్షరాలు రానివాళ్లు, మంచి వార్తల్ని గుర్తు పట్టలేని వాళ్లు గుంపులు గుంపులుగా చేరిపోయినట్టు (ఇది నా రంగం కాబట్టి చెబుతున్నా) అన్ని వ్యవస్థల్లో చెత్త చేరిపోయింది. డబ్బు రాని రంగాల్లోనే వేస్ట్ చేరితే, డబ్బు బాగా ఉన్న మెడికల్ రంగంలో ఎంత చెత్త చేరిపోయి ఉంటుంది?
చాలా ఏళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో మా బంధువు క్రానిక్ సుగర్ పేషెంట్ చేరితే ఫుల్‌గా చక్కెర వేసిన జ్యూస్‌ని నర్సు తెచ్చి ఇచ్చింది. మా తమ్మున్ని బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేరిస్తే అక్కడున్న నర్సింగ్ అమ్మాయికి సుగర్ టెస్ట్ చేయడం సరిగా రాక సూదితో నాలుగైదు సార్లు వేలిని పొడిచింది. జీతాలు మిగిలించుకోడానికి స్టూడెంట్‌లకి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి పేషెంట్ల ప్రాణాలు తీసిన ఆస్పత్రులు ఎన్నో వున్నాయి. ఆస్పత్రి హత్యలకి శిక్షలుండవు. రుయా ఆస్పత్రిలో 1996లో ఒక పేషెంట్ తలకి దెబ్బ తగిలి చేరాడు. పల్లెటూరిలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డాడు. వాడికి సుగర్. ఇది చూసుకోకుండా వరుసగా సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తే పోయాడు. వాడిని కొట్టిన పల్లెటూరి అమాయకులంతా హత్యా నేరం కింద జైల్లో కూచున్నారు. వైద్య సిబ్బంది సాయంత్రం క్యాంటీన్లో పకోడి తిని , ఇంటికెళ్లి టీవీ చూసి ఫస్ట్‌కి జీతం తీసుకున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులు జలగలు, మానవత్వం లేని రాక్షసులంటూ పోస్టింగ్‌లు కనిపిస్తూ ఉంటాయి. కోటి డొనేషన్, కోటి చదువు ఖర్చులు, ఐదారు కోట్లతో ఆస్పత్రి నిర్మాణం చేస్తే ఆ పెట్టుబడి Human Bodyతో రికవరీ అవుతుంది కానీ Humanity తో రికవరీ అవుతుందా? మానవత్వం అనే పదం పనికిమాలిన సాహిత్య పుస్తకాల్లో వుంటుంది, డాక్టర్ల డిక్షనరీలో కాదు (కొందరు మినహాయింపు). పది పైసల ఖర్చుతో చేసిన టాబ్లెట్ 10 రూపాయలకు అమ్ముకుంటున్న వాడు మానవత్వం గురించి మాట్లాడడు. అందుకే ఫార్మా కంపెనీలు డాక్టర్లకి ఖరీదైన కార్లు , పారిన్ ట్రిప్పులు బహుమతిగా ఇవ్వగలుగుతున్నాయి.
ఫీజుల దోపిడీ సరే, ప్రాణాలు దక్కుతాయా అంటే అదీ లేదు. ఎందుకంటే మెజార్టీ ప్రైవేట్ ఆస్పత్రులకి క్యాష్ మేనేజ్‌మెంట్ తప్ప క్రైసిస్ మేనేజ్‌మెంట్ తెలియదు. వెంటిలేటర్ల నిర్వహణ, ఆక్సిజన్ అవసరాలపై అవగాహన లేదు.
ఈ మధ్య ఒక రిటైర్డ్ తహశీల్దార్ అనంతపురంలో చనిపోయాడు. ఒకే వెంటిలేటర్ ముగ్గురికి మార్చిమార్చి పెట్టారని, రెమిడెసివర్ ఇంజక్షన్‌ని బళ్లారిలో రూ.50 వేలకి బ్లాక్‌లో కొని ఇస్తే , దాన్ని కొంచెం వాడి మిగతాది వేరే వాళ్లకి వేశారని వాళ్ల బంధువు చెప్పాడు. పరిస్థితి విషమిస్తే వేరే ఆస్పత్రికి మారిస్తే రూ.6 లక్షల బిల్లు వేసి శవాన్ని ఇచ్చారని చెప్పాడు. బాధితుల తరపున ఆరోపణల్లో అతిశయోక్తులు ఉండొచ్చు కానీ అసత్యాలు ఉండవు. సైన్స్ అద్భుతమే. కానీ అది పేదలకి, సామాన్యులకి అందడం కూడా అద్భుతమే. మన చుట్టూ ఆక్సిజన్ ఉందో లేదో తెలియదు కానీ, ప్రాణభయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆనందయ్య వచ్చాడు. ఆయన ఏదో మూలికలు సేకరించి ఉచితంగా మందు ఇస్తున్నాడు. అది శాస్త్రీయమా, కాదా పక్కన పెట్టండి. శాస్త్రీయం మనల్ని ఎంత మేరకు రక్షిస్తోందో , దోపిడీ చేస్తోందో తెలుస్తోంది.
ఆనందయ్య మందు విషయంలో రెండు విషయాలున్నాయి. ఒకటి జనం రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం. రెండు మందు వల్ల దుష్ప్రభావం. జనాన్ని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు. ఇక మందు ప్రభావం గురించి నిపుణుల నివేదిక చెబుతుంది.ఆనందయ్య విషయంలో జగన్ చేసింది కరెక్ట్. విమర్శలు ఏం చేసినా వస్తాయి అది వేరే విషయం. ఎందుకంటే ఆనందయ్యని అరెస్ట్ చేస్తే జగన్ మెడికల్ మాఫియాతో కుమ్మక్కయ్యాడని అంటారు. ఆ మందుకి ఆమోదం తెలిపితే ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుని ఆయుర్వేదాన్ని నమ్ముకుందని.
అయితే ఇంత పెద్ద వైద్య వ్యవస్థ ఇవ్వలేని నమ్మకం ఆనందయ్య ఇవ్వడమే ఇక్కడ కీ పాయింట్. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే విశ్వాసం చాలా ధైర్యాన్ని ఇస్తుందని. మందు అని చెప్పి చక్కెర నీళ్లు తాగించినా రోగులు కోలుకుంటారని. దీనికి ఏదో ఎఫెక్ట్ పేరు కూడా చెప్పారు. ఇపుడు జనానికి కావాల్సింది విశ్వాసం, మనో ధైర్యమే.అయితే మందుల వ్యాపారం పడిపోతే ఎవరూ సహించలేరు. ఆస్పత్రుల్లో వేల మంది చనిపోయినా ఫర్వాలేదు, ఆనందయ్య మందు తిన్నవాళ్లు ఒక్కరు పోయినా గగ్గోలు చెలరేగుతుంది.
నియోజకవర్గానికి 100 పడకల (ఆక్సిజన్‌తో) తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించగల సామర్థ్యం ఉన్న (కనీసం టీడీపీ కార్యకర్తలకైనా) చంద్రబాబునాయుడు, జూమ్ మీటింగ్‌ల ద్వారా ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి అరుస్తూ ఉంటాడు. పత్రికలు పునాదిగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న వాళ్లు కరోనా కష్టకాలంలో కనీసం తమ ఉద్యోగుల కోసమైనా తాత్కాలిక వైద్య సౌకర్యం అందించలేనంత పేదవాళ్లుగా మారిపోతారు (పైగా జీతాలు తగ్గిస్తారు, ఉద్యోగుల్ని తగ్గిస్తారు). మానవత్వం గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి.
ఈ వ్యవస్థలో ఆనందయ్య చాలా చిన్నవాడు, సామాన్యుడు. పిచ్చోడు కూడా. లేకపోతే ప్రజలకి ఆరోగ్య నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడా? ఆనందయ్య పనిని చేసుకోనివ్వండి. కనీసం కొందరైనా దివాళా తీయకుండా నమ్మకంతో బతికి బయట పడతారు. వికటిస్తే అంటారా? అన్ని వ్యవస్థలు వికటించే కదా ఉన్నాయి. కొత్త భయాలు ఎందుకు?