అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు. ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం.
ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. నాటి మనుష్యుల వేటకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి మానవుడి కదలికలు మూడు దశలుగా కనిపిస్తాయి పాత రాతియుగంలో నివసించిన మానవుని మెగాలిత్ మానవులను అంటారు. ఆనాటి మానవుడు రాతపూర్వకంగా మిగిల్చిన ఆనవాళ్లేమీ లేవు. కానీ ఆ కాలపు ఆయుధాలు,ఎముకలు,బొమ్మలు, గుహల్లో గీసిన చిత్రాలు,ఆభరణాలు ఆదిమానవుల జీవన శైలికి సాక్ష్యాలుగా ఈనాటికి నిలిచి ఉన్నాయి.
వీటన్నింటినీ పరిశోధించి .. పరిశీలించి వెలికితీసి భవిష్యత్ తరాలకు అందించిన ఆంగ్లేయుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్ కి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయనే కనుక కష్టపడి శోదించకుంటే మనకేమి తెలిసేవి కాదు. అప్పట్లో మానవుడు ఉపయోగించిన పనిముట్లను మెగాలిత్స్ అంటారు. అప్పట్లో మానవులు జంతువులను వేటాడాలి అన్నా .. నేలను తవ్వాలన్నా .. చెట్టును కొట్టాలన్నా బండ రాళ్లను ఉపయోగించేవారు.
నాడు అన్ని పనులకు రాయే ఆధారం. ఆ క్రమంలోనే రాళ్లతో పలు పనిముట్లు తయారు చేసుకున్నారు. జంతువులను వేటాడేందుకు పదునైన రాతి ముక్కలతో విల్లంబులు రూపొందించారు. తెలంగాణ ప్రాంతంలో పాత రాతియుగపు ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలానికి నలభై మైళ్ళ దూరంలో ఆదిమానవులు ఉపయోగించిన ముప్పై ఐదు రకాల పనిముట్లు తవ్వకాలలో బయటపడ్డాయి.
అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ పనిముట్లు దొరికిన ఈ 50 గజాల ప్రదేశాన్ని ‘పాత రాతియుగపు పనిముట్ల పరిశ్రమ’గా వర్ణించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని పాతరాతి యుగం మానవుడు కు చెందిన మరికొన్ని ఆధారాలు లభించాయి. హైదరాబాద్ కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండ గుట్టల్లోని గుహల్లో వేల ఏళ్ల కిందట ఆదిమ మానవుల గీసిన ఎరుపు రంగుల చిత్రాలు వెలుగు చూశాయి. ఆరుగురు వ్యక్తులు తమ బాణాలతో పులిని వేటాడుతున్నట్టు చిత్రకారుడు గీశాడు. ఆది మానవుడి చిత్రకళకు ఈ చిత్రాలు ప్రతీకగా నిలిచాయి.