నటశేఖరుడి కృష్ణావతారం !

Sharing is Caring...

ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది .  చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ది. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి వావ్ అనిపించారు ముళ్ళపూడి.

ఈ కథ లో సూపర్ స్టార్ ది ఒక మాస్ క్యారెక్టర్. సినిమా మొత్తం (నాలుగైదు సన్నివేశాలు మినహా ) లుంగీ చొక్కాపై నే కృష్ణ నటించారు. అదే మరో హీరో అయితే అలా చేసేవారు కాదేమో. కథలో కృష్ణావతారం పాత్రకు కృష్ణ కరెక్టుగా సూటయ్యారు. అన్యాయాలను సహించలేని ఓ చిన్న సైజు రౌడీ పాత్రలో భిన్నంగా నటించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు.

సినిమాలో బాపు కృష్ణ ను డిఫరెంట్ గా చూపించారు. సూపర్ స్టార్ ను దృష్టిలో పెట్టుకుని ముళ్ళపూడి వెంకట రమణ డైలాగులు రాశారు. ముళ్ళపూడి మాస్టారు వారి పెద్ద డైలాగులను కూడా అలవోకగా కృష్ణ చెప్పేస్తుంటే అబ్బురపోయి చూస్తుంటాం. రొటీన్ కథలకు భిన్నంగా సూపర్ స్టార్ చేసిన సినిమా ఇది.

కథలో హీరో పాత్ర పేరు మాత్రమే కృష్ణుడు కానీ క్యారెక్టర్ పరంగా రాముడి స్వభావాలు ఎక్కువ. ఆ పాత్ర ను అలా రూపొందించారు. అలాగే  పేరుకే రౌడీ కానీ అన్యాయాలను సహించలేక వాళ్ళను వీళ్ళను కొట్టి తరచుగా జైలే కెళ్లే క్యారెక్టర్. కథలో హీరో రౌడీయిజం ఒకటి రెండు సన్నివేశాల్లో మినహా ఎక్కడా కనిపించదు.

ఈ చిత్రంలో శ్రీధర్ సాఫ్ట్ విలన్ పాత్రలో నటించాడు. అల్లుడిగా నాటకమాడమని కృష్ణను రమణమూర్తి , శ్రీధర్ లు (మామ అల్లుళ్ళు) బతిమాలితే అతగాడు ఒప్పుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది.

ఫక్తు ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా బాపు తెరకెక్కించారు.అల్లుడిగా నటించడానికి వచ్చిన కృష్ణ విజయశాంతి ని మోసం చేసేంది ఎవరో తేలేదాకా ఆ ఇంట్లోనే తిష్ట వేస్తాడు.

ఇక హీరోయిన్ పాత్ర లో శ్రీదేవి సంగతి చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతోఆకట్టుకుంది.రమణమూర్తి కూతురు పాత్రలో విజయశాంతి కూడా బాగానే నటించింది. కృష్ణ కు వరలక్ష్మి విషం కలిపి పూర్ణం బూరెలు పెట్టే సన్నివేశం ఆకట్టుకుంటుంది.

కాంతారావుతో మాటలు లేకుండా కృష్ణ నటించే సన్నివేశం … కోర్టులో తన తరపున వాదించిన శ్రీధర్ అన్ని అబద్ధాలు చెప్పాడని తనకు శిక్ష వేయమని కృష్ణ జడ్జి ని అడిగే సీన్ ఆసక్తికరంగా ఉంటాయి. ముళ్ళపూడి వారు వేగంగా కథను పరుగెత్తించి.. క్లయిమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇస్తారు.

అందరూ కృష్ణ విజయశాంతిని చేసుకుంటాడేమో అనుకుంటున్న సమయంలో కథను మలుపు తిప్పుతారు. బాపు ప్రతి సీన్ ను అద్భుతంగా తెరకెక్కించారు. సూపర్ స్టార్ కెరీర్ లో ఇదొక మంచి చిత్రం. ఇక  సినిమాలో పాటలన్ని బాగుంటాయి.

ఇంట్లో ఈగల మోత….  కొండ గోగు చెట్టు ….. సిన్నారి నవ్వు … మేలుకోరాద కృష్ణ … స్వాగతం గురు  వంటి పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. మామ మహదేవన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. బాబా అజ్మీ కెమెరా పనితనం అద్భుతం. ఈ సినిమాతో బాపు రమణలకు బాగా డబ్బులొచ్చాయి. పాత అప్పులన్నీ తీర్చేసుకున్నారు.  యూట్యూబ్ లో సినిమా ఉంది. చూడని వారు చూడొచ్చు. చూసిన వారు మరో మారు చూడొచ్చు. 

——— KNMURTHY

post updated on 5-8-2024

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!