ఇరవైవేల కోసం కారు అమ్మాలనుకున్న కృష్ణశాస్త్రి !

Sharing is Caring...

“ఆయన శైలి అనితర సాధ్యం ”  స్టోరీ కి కొనసాగింపు.    

అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన.ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి . తెలుస్తుంది .
శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది… అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు. ఎవరికేం  చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు… మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…
ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది. ఆ తరువాత అందులోని విషయాన్ని గ్రహించి జీర్ణించుకోవటాని కింకో అర నిమిషం పట్టింది… ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…
“.. నాకు ఉ షస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అం టూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ ఉగాదులూ వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“ పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి.. ఎప్పు డూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు… చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…

దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు… “మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను… నీ ఎరుకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది. నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…” తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు.  అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడిం చారు శాస్త్రిగారు… “..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …” వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది.. “….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…” దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..
దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు.. “..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…” … “.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు… కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం… గుండె పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు.. “..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి .  సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “ “..సరే…అట్లాగే రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు.. వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు . 

అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..” అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు.

“వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…” “..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది…. ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా వున్నారు… అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..
ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు . “…అయ్యా మీరిక్కడేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా ” అని…దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు.. “.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “.. అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…
ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి.సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది.. ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది .. ఆ పాటే…అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఉపసంహారం
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం) “.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు )“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం) “..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)
ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి  కృష్ణశాస్త్రి గారు
తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను మాత్రం  “..నీ పదములే చాలూ… రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు.

అయితే  ఈ వాట్సాప్ ఈ కథనాన్ని గొల్లపూడి ఆ తర్వాత ఖండించారు. ఎనిమిదేళ్ల కిందట తాను రాసుకున్న ఆత్మకథలో కొన్ని విషయాలను వక్రీకరించారని ఆయనే మీడియాకు చెప్పారు. దేవులపల్లి మద్రాస్ ఆలిండియా రేడియో కి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు తాను సాగనంపడానికి వెళ్లానని ఆ సందర్భంగా ” డబ్బులేదు కారు అమ్మేయాలని అనుకుంటున్నా” అని బుక్ పై రాసి చూపారు. “అదేం వద్దు పాటలు రాయండ”ని  తాను సూచించానని గొల్లపూడి చెప్పారు. అంతే కానీ అప్పు అడగలేదని గొల్లపూడి వివరించారు. 

ఇంకో  కొస మెరుపు ఏమిటంటే  కృష్ణ శాస్త్రి గారి అబ్బాయి,ప్రముఖ చిత్రకారుడు బుజ్జాయి  గొల్లపూడి మారుతీ రావు గారికి లీగల్ నోటీసు ఇచ్చారు. ఆ తరువాతే గొల్లపూడి తన కథనాన్ని వక్రీకరించారని స్పష్టం చేశారు.

 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. రాయుడు.బి కె యెస్ September 18, 2020
error: Content is protected !!