Gr Maharshi ………………………………
(ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 197 వ్యాసాలు. నవ్వినోల్లకి నవ్వింత…. మార్నింగ్ షో. ఫిబ్రవరి 7 విడుదల )
నిజ జీవితంలో కృష్ణని నేనెపుడు చూడలేదు. కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఒక జీవిత కాలం. నాకు గుర్తుండి మొదట చూసింది విచిత్ర కుటుంబంలో. ఆవేశంతో ప్రతివాన్ని తంతూ వుంటాడు. నచ్చేశాడు. ఫైట్స్ కోసమే సినిమాలు చూసే బాల్యం.
NTR కత్తి యుద్ధ వీరుడే కానీ, కొన్ని సినిమాల్లో మర్యాదస్తుడిగా మారిపోతాడు. ఫైట్స్ వుండవు. కృష్ణ అది కాదు. లోడు చేయ కుండా రివాల్వర్ కాల్చి పొగ ఊదుతాడు. డబుల్ బ్యారెల్ గన్‌తో ఎన్ని రౌండ్లైనా కాలుస్తాడు. ఫైటింగ్ చేస్తే దున్నపోతు రౌడీలని కూడా ఉతికేస్తాడు.
కృష్ణ వల్ల జరిగిన నష్టం అంతాఇంతా కాదు. గూఢచారి 116 చూసి జేమ్స్‌బాండ్ అయిపోదామనుకున్నా. మా ఊళ్లో దురద పాండు (ఎప్పుడూ గోక్కునే వాడు), దంటు పాండు (జొన్న దంటులా సన్నగా పొడుగ్గా వుండేవాడు) ఉన్నారు కానీ, జేమ్స్‌బాండ్ లేరు. బాండ్ కావాలని దీపావళి తుపాకి కొన్నాను. రీల్ పెట్టి కొడితే వాసన, పొగ వచ్చేవి.
అయితే మనం ఊదడానికి అనువుగా గొట్టంలోంచి పొగ వచ్చేది కాదు. బాండ్‌గా మనం చేయాల్సిన మొదటి పని ఎవరో ఒక సైంటిస్ట్ తినింది అరక్క ఫార్ములా కనిపెడితే అతన్ని రక్షించడం. మా స్కూల్లో ఒక ల్యాబ్ ఉండేది. రకరకాల గాజు పాత్రలుండేవి. మా అయ్యవార్లు ఏమైనా కనిపెడతారేమోనని ఆశించా. వాళ్లకంత తెలివి లేదు. నాకు ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది.
తర్వాత మోసగాళ్లకు మోసగాడు చూసి పిచ్చెక్కింది. ఎక్కడికి వెళ్లినా గుర్రంలా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆగినప్పుడు సకిలించేవాన్ని. ఒక గుర్రాన్ని సంపాదించి, కౌబాయ్‌లా పశువులు మేపాలనుకున్నా. గుర్రమూ లేదు పశువులూ లేవు.జట్కా వాడి గుర్రాన్ని కొట్టేద్దామని నేనూ, ఇంకో ఫ్రెండ్ ప్లాన్ చేశాం. ఒక రోజు గుర్రం దగ్గరికి వెళితే గట్టిగా బుస కొట్టి నేలమీద నాట్యం చేసింది. కాలు తొక్కితే చచ్చేవాళ్లం. ఆ రోజుల్లో పిండికట్టు వేస్తే నెలల తరబడి దేకాల్సి వచ్చేది.
గుర్రం డేంజర్, పైగా దాన్ని ఎక్కడానికి స్టూల్ కావాలి. ఎక్కడానికి, దిగడానికి స్టూల్ వాడితే కౌబాయ్‌గా మనకు డిగ్నిటీ ఏముంటుంది?అందుకని గాడిదని ఎంచుకున్నాం. గాడిదలు మహాజ్ఞానులు. జ్ఞానం ఉండటం గాడిదల సహజ లక్షణమని చిన్నప్పుడే తెలుసు. స్కూల్ గ్రౌండ్‌లో అది గడ్డి పరకలు, కాగితాలు తింటూ కనిపించింది. నేను నా స్నేహితుడు దగ్గరికెళ్లి స్నేహంగా పలకరించాం.
అయ్యవార్లు ఎప్పుడూ గాడిదా అని తిట్టడం వల్ల, మాకు సహజ సిద్ధంగా గాడిదతో స్నేహం అలవడింది. పలకరించినా, మెడ నిమిరినా అది ఏమనలేదు. తత్వవేత్తలా చూసింది. స్వారీకి తగిన సమయమని మా మిత్రుడు లంఘించాడు. తర్వాత వాడు నాకు కనపడలేదు. కేక మాత్రం వినపడింది. గాలిలో వున్నాడు. మెరుపు వేగంతో గాడిద తన రెండు కాళ్లని వాడి మీద ప్రయోగించింది. జ్ఞానుల కోపం ఎలా ఉంటుందో అర్థమైంది.
ఇంటర్‌లో భవాని అనే మిత్రుడు కృష్ణ వీరాభిమాని. ఆయన్ని చూడటానికి మద్రాసు వెళ్లాడు. స్టూడియోలో ఏదో చర్చల్లో ఉంటే తలుపు తోసుకుని కృష్ణ దగ్గరికెళ్లాడు. ఆయనకి కోపం వచ్చి తిట్టాడు. తర్వాత అభిమానంతో ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కనిపించిన ప్రతి వాడికి ఇది చెప్పి ఆటోగ్రాఫ్ చూపించేవాడు. 90లో జరిగిన మతకలహాల్లో హైదరాబాద్‌లో భవాని మిస్ అయ్యాడు. చాలా కాలం వెతికి ఆశలు వదిలేశారు.
శ్రవణ్ అనే మిత్రుడు చిన్నప్పుడు ఇంట్లో నుంచి మద్రాస్ పారిపోతే కృష్ణ, విజయనిర్మల దంపతులు ఆశ్రయం ఇచ్చారు. తర్వాత తన ఇద్దరి పిల్లలకి ఆయన కృష్ణ పేరు పెట్టుకున్నారు.బి,కొత్తకోటలో షామీర్ అనే సాక్షి రిపోర్టర్‌కి కృష్ణ అంటే పిచ్చి. హార్సిలీహిల్స్‌లో పాతికేళ్ల క్రితం కృష్ణ సినిమా షూటింగ్ జరిగితే కృష్ణ కోసం రాత్రింబవళ్లు అక్కడే ఉన్నాడు.
35 ఏళ్ల క్రితం కేవలం కృష్ణ వార్తల కోసమే ఒక సినిమా పత్రిక వచ్చేది. కృష్ణ చాలా సాహసి. లేకపోతే దేవదాసుగా నటిస్తాడా? అర్జునుడిగా నటించి, కురుక్షేత్రాన్ని NTR కర్ణకి పోటీగా రిలీజ్ చేస్తాడా? అన్ని సినిమాల్లో ఒక్కలాగే నటించినా కూడా ఆయన్ని జనం విపరీతంగా ప్రేమించారు. ఇది చాలా అరుదైన విషయం.