MOVIE ON NAXALS ……………………………………….
సూపర్ స్టార్ కృష్ణ నటించిన “ఎన్ కౌంటర్” పవర్ ఫుల్ కథతో నిర్మించిన సినిమా. ఇందులో నక్సలైటు నాయకుడు కృష్ణన్నగా కృష్ణ నటించారు. దర్శకుడు శంకర్ కి ఇది తొలి సినిమా. ఆ తర్వాత సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
అంతకు ముందు సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలు ఒకటి రెండు పోషించినా ఈ సినిమాలో పాత్ర భిన్నమైనది. శంకర్ ఈ కథను కృష్ణ ను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నారు. ఆయన ఆ పాత్రలో ఇమిడి పోయారు. సినిమాలో నక్సలైటుగా కృష్ణ గెటప్, డైలాగ్ డెలివరీ భిన్నంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. కృష్ణ కుమారుడు రమేష్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు.
సినిమా కథ మొత్తం నక్సల్స్ .. పోలీసులు .. భూపోరాటాలు ఎన్కౌంటర్ల చుట్టూ తిరుగుతుంది. ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ వేగంగా పరుగెడుతోంది. కథ లో కృష్ణన్న .. స్వర్ణక్క(రోజా) సూర్యం (రమేష్ ) అతని తల్లి రాధిక పాత్రలు ప్రధానంగా ఫోకస్ అవుతాయి.
స్వర్ణక్కను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత శవ పంచాయితీ లో ఆమె తల్లిదండ్రులు కాకరాల,తెలంగాణ శకుంతల విలపించే సన్నివేశం గుండెలకు హత్తుకుంటుంది. రాధిక కొడుకును చూసి ఒక ముద్ద అన్నం పెట్టాలని జైలు దగ్గర కొచ్చిన సన్నివేశం ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తుంది.
మంత్రి కోట శ్రీనివాస రావు ఇంటిని కృష్ణన్న ముట్టడించిన సీన్ .. జైలులో రమేష్ ను పోలీసులు హింసించే దృశ్యాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో ఎస్పీ వినోద్ కుమార్ .. కృష్ణ ల మధ్య సంవాద దృశ్యాలు .. అలాగే అనుచరులను కాపాడేందుకు కృష్ణన్న తపన పడిన సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.
పోలీస్ ఇన్ స్పెక్టర్ గా జీవా ఆపాత్రకు ప్రాణం పోశారు. పాత్రలో క్రూరత్వాన్ని అద్భుతంగా పండించారు జీవా. చిన్న పాత్రలో చంద్రమోహన్ కూడా ఆకట్టుకుంటాడు. రమేష్ క్యారెక్టర్ చిన్నదైనా రెండో భాగంలో కథ ఆ పాత్ర పైనే నడుస్తుంది.
హరనాథరావు మాటలు తూటాల్లా పేలాయి. నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నిజ జీవితంలో తాను చూసిన ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నారు. అద్భుతంగా తెరపైకి ఎక్కించారు. సినిమాలో పాటలన్ని బాగుంటాయి. మళ్ళీ వినాలనిపిస్తాయి. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు.
దర్శకుడు శంకర్ మొదట ఈ సినిమాను తెలుగు తమిళం మళయాళ భాషల్లో చేద్దామనుకున్నారు. సెల్వమణి నిర్మాత .. మమ్ముట్టి ఎస్పీ పాత్ర కోసం ..హీరో ప్రశాంత్ ను సూర్యం పాత్ర కోసం ..కృష్ణన్న క్యారెక్టర్ కి కృష్ణ ను అనుకున్నారు.
అయితే ప్రాజెక్టు బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో సూపర్ స్టార్ పద్మాలయ బ్యానర్ పై తెలుగులో చేద్దామన్నారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కృష్ణ సాహసం చేశారు. మూడు నెలల్లో సినిమా తీసేసారు. 1997 ఆగస్టు 14 న సినిమా రిలీజ్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నపుడు నక్సలైట్లు వచ్చారట. కృష్ణ దగ్గరకు వచ్చి ఏకే 47 తుపాకీని ఇలా పట్టుకోవాలని చూపించి వెళ్లారట. సినిమా విడుదలకు ముందురోజు ప్రసాద్ ల్యాబ్స్ లో గద్దర్ .. విడుదల అయిన రోజు లెజెండరీ నక్సల్ లీడర్ కొండపల్లి సీతారామయ్య .. దర్శకుడు శంకర్ కలిసి సినిమా చూశారు.
ఒక ఇంటర్వ్యూలో శంకర్ ఈ విషయాలు చెప్పారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రశంసలు అందుకున్నది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉన్నది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.
——–KNM