వారసురాలితో ఉత్తర కొరియా అధినేత కిమ్ !

Sharing is Caring...

What’s on Kim’s mind………..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏం చేసినా సంచలనమే.ఇటీవలి కాలంలో కిమ్ ప్రతి కదలికలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. శత్రుదేశం అమెరికాను ఢీ కొట్టే సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగ స్థలానికి  తన కూతురు కిమ్ జు-ఏ (Kim Ju-ae)ను కిమ్ తీసుకురావడంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కిమ్ తన కుమార్తెతో కనిపించడం కూడా ఇదే తొలిసారి. దాంతో కొరియాలో నాలుగో తరం అనువంశిక పాలనకు ఆయన సంకేతాలిస్తున్నారనే  ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కిమ్ భార్య, పిల్లల గురించి నార్త్ కొరియా మీడియో ఇంతవరకు అధికారికంగా రాసిన దాఖలాలు లేవు.

తాజాగా తండ్రీ కూతుళ్లిద్దరూ చేతిలో చేయివేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో, బ్యాక్ గ్రౌండ్ లో బాలిస్టిక్ మిసైల్, అధికారులతో ఆయన మాట్లాడుతున్నట్టు, క్షిపణులను పరిశీలిస్తున్నట్టు ఉన్న ఫోటోలను ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ఐసీఎన్ఏ (ICNA) ప్రచురించింది.

దీంతో కిమ్ వ్యూహాత్మకంగానే తన కుమార్తెను ప్రమాదకర క్షిపణి ప్రయోగస్థలికి తీసుకువచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.  నాలుగో తరం వారసులుగా కూడా తమ వారే ఉంటారని చెప్పడం కిమ్ ఉద్దేశం కావచ్చని వారు అంచనా వేస్తున్నారు.

సియోల్ స్పై ఏజెన్సీ కథనం ప్రకారం, నార్త్ కొరియా వ్యవస్థాపక నేత కిమ్ ఇల్ సుంగ్ (Kim ll sung) మనుమడు, మూడో తరానికి సారథ్యం వహిస్తున్న కిమ్ జోంగ్ 2009లో Risol Ju ను వివాహం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే తొలి సంతానం కలిగింది.

 2013, 2017లో రెండు, మూడవ సంతానం కలిగింది. మాజీ ఎన్బీఏ స్టార్ డెన్నిస్ రాజ్మాన్ 2013లో నార్త్ కొరియా వెళ్లినప్పుడు కిమ్ కుమార్తె కిమ్ జు-ఏను కలుసుకున్నట్టు చెప్పడంతో బయట ప్రపంచానికి ఆ విషయం తెలిసింది. కాగా, కిమ్ తో కలిసి ఫోటోగ్రఫీలో కనిపించిన అమ్మాయి కిమ్ రెండో కుమార్తె జు- ఏ కావచ్చని  భావిస్తున్నారు.

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి సైతం తన పోలికలు ఎక్కువగా ఉండటంతోనే  కిమ్ జోంగ్ ఉన్ ను  తన వారసుడిగా ఎంపిక చేశారని అంటారు.  జు-ఏ ఇక ముందు కూడా తండ్రితో కీలక సందర్భాల్లో పాల్గొంటే అది బలమైన వారసత్వ సంకేతమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిమ్ తన కూతురిని దేశానికి భావి నాయకురాలిగా తయారు చేసే పనిలో ఉన్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తన వారసత్వం తన కూతురికే చెందుతుందనే బలమైన సంకేతం కిమ్ ఇచ్చినట్టు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.  కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ప్రజా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!